రాజకీయ నాయకులు…. ఎప్పుడు కలిసిపోతారో, ఎందుకు కలిసిపోతారో, ఏ పాయింట్ వద్ద రాజీ కుదురుతుందో.., లేదా… ఏ ఇష్యూ మీద తన్నుకుంటారో అర్థం కాదు… అన్నీ తెరవెనుక మార్మిక యవ్వారాలు… అంతిమంగా జనం అమాయకులు…! నిజానికి బోలెడు ఉదాహరణలు మనకు నిత్యరాజకీయాల్లో కనిపిస్తూనే ఉంటయ్… కొన్ని సంకేతాలు స్పష్టాస్పష్టంగా మీడియా ధోరణిలో కనిపిస్తుంటయ్… మొన్న టెన్‌టీవీలో కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి సుదీర్ఘ డిబేట్ చూసిన చాలామందికి ఓపట్టాన జీర్ణం కాలేదు…
ఆమధ్య మీకు గుర్తుందా..? సీఎం ఆఫీసు ముట్టడి అని రేవంత్ బయల్దేరితే ఒక్క టీవీ పట్టించుకోలేదు, తనను దాదాపుగా ప్రతి టీవీ వదిలిపెట్టేసింది… మొన్న గ్రేటర్ ఎన్నికల ఫలితాల అనంతరం కూడా రేవంత్ ప్రథమ స్పందన మీడియా మీదే… అమ్ముడుపోయిందని…!! ఇక మై హోం రామేశ్వరరావుతో అయితే ఎప్పుడూ ఉప్పూనిప్పూ వ్యవహారమే… మై హోం రామేశ్వరరావుకు అత్యంత సన్నిహితుడైన కేసీయార్తోనూ రేవంత్‌కు నిత్యవైరమే కదా… మరి ఈ కేసీయార్ అనుకూల మీడియాతో రేవంతుడికి రాజీ ఏ పాయింట్ దగ్గర, ఎప్పుడు, ఇంత హఠాత్తుగా ఎలా కుదిరిందనేది అనూహ్యం…
Ads
అసలు టెన్ టీవీ మాత్రమే కాదు… నిన్న ఎన్టీవీలో సుదీర్ఘ డిబేట్… అంతేకాదు, వీ6, టీవీ5 చానెళ్లలోనూ సేమ్ డిబేట్ భేటీలు ఉంటాయట… అన్నీ తనను వ్యక్తిగతంగా పైకి లేపే ప్రత్యేక చర్చాకార్యక్రమాలే… నిజానికి రేవంత్ డబ్బులిచ్చినా సరే, ఈ టీవీల పింక్ స్పేస్ దొరకదు మామూలు పరిస్థితుల్లో…! మరి అన్ని టీవీలూ ఎందుకిలా స్వాగతం పలుకుతున్నాయి తనకు..? అకస్మాత్తుగా ఆప్తమిత్రుడు ఎలా అయ్యాడు వీటికి..? ‘‘ఏ పెద్దలతో రేవంత్‌కు రాజీ కుదిరింది’’..? ఇదీ అందరిలోనూ మెదులుతున్న భేతాళ ప్రశ్న…
బీజేపీ దూకుడును నిలువరించడానికి ‘‘పెద్ద సారే’’ కావాలని కాంగ్రెస్ పార్టీని లేపే ప్రయత్నం చేస్తున్నాడనీ… ఇన్నాళ్లూ అనవసరంగా కాంగ్రెస్ పార్టీని చావగొట్టీ గొట్టీ, అనవసరంగా తనే బీజేపీకి స్పేస్ ఇచ్చానని బాధపడుతున్నాడనీ ఓ టాక్… ఐనా సరే, ప్రత్యర్థి కాంగ్రెస్‌నూ అవసరార్థం కాస్త లేపాలనుకుంటే, పెద్దలు జానారెడ్డి వంటి నేతలు కనిపిస్తారు కేసీయార్‌కు… కానీ నిత్యప్రత్యర్థి రేవంత్‌తో రాజీ ఏముంటుంది..? ఊహించగలమా..?
పోనీ.., కాంగ్రెస్‌కు కాస్త బూస్ట్, హార్లిక్స్ కలిపి ఇచ్చి కేసీయారే బలపడేట్టు చేస్తాడూ అనుకుందాం… సరే, ‘‘మన పాత యెల్లో రేవంతే కదా’’ అనే ప్రేమ టీవీ5కు ఉంటే ఉండవచ్చుగాక… కానీ వీ6 కాషాయ చానెల్ కదా… మరి రేవంత్‌కు చాన్స్ ఎందుకు ఇస్తుంది..? బీజేపీలోకి వెళ్తాడు అని జనం చెప్పుకుంటున్న మైహోం తనను ఎందుకు దగ్గరకు రానిస్తాడు..?
ఇక్కడ ఇంకో యవ్వారం ఉంది… రేవంత్‌రెడ్డిని కాదని, జగిత్యాల జీవన్‌రెడ్డికి పీసీసీ అధ్యక్షపదవి ఇస్తారట… కాళ్లనొప్పులు, కీళ్లనొప్పల కారణంగా తను ఎటుపడితేఅటు తిరగలేడు కాబట్టి కోమటిరెడ్డికి ఇస్తారనీ అంటున్నారు… జీవన్‌రెడ్డిని ఆల్రెడీ ఢిల్లీకి పిలిచారు, తను వెళ్లొచ్చాడు… మరి టీపీసీసీ అధ్యక్షపదవి గనుక దక్కకపోతే రేవంత్ ఏం చేయబోతున్నాడు..? సొంత పార్టీ పెడతాడా..? పెడితే ఎవరికి నష్టం..? బీజేపీకి, కాంగ్రెస్‌కు నష్టం… ఎందుకంటే..? యాంటీ కేసీయార్ వోటు చీలిపోతుంది కాబట్టి… సో, ఆ పరిణామాన్ని బీజేపీ ఇష్టపడదు… బీజేపీ ఇష్టపడనప్పుడు మరి బీజేపీ ప్రస్తుత ఇష్టులైన టెన్‌టీవీ, వీ6, ఎన్టీవీ ఎందుకు రేవంతుడిని ఆత్మీయంగా హత్తుకుంటారు..?
చాలారోజులుగా మై హోం, మేఘా ఎట్సెట్రా పెద్ద పెద్ద వ్యాపారులంతా ఢిల్లీలో ఉంటున్నారు… బీజేపీ ఫోల్డ్‌లోకి వెళ్లిపోయారు… ఎలాగూ కేసీయార్ కూడా బీజేపీ ఒత్తిళ్లకు లొంగిపోయాడు… సో.., టీఆర్ఎస్, బీజేపీ, రేవంత్ ఈక్వేషన్‌తో ఏదో పెద్ద వ్యవహారానికి పూర్వరంగం రెడీ అవుతున్నట్టుగా ఉంది… అదేమిటో ఇప్పుడు బోధపడదు… కొన్ని పెద్ద తలకాయల మధ్య మథనం జరుగుతూ ఉన్నట్టుంది… చూస్తూనే ఉందాం… బుల్లితెరపై..! ఇంకొన్ని సంకేతాలు అందకపోవు..!!
Share this Article