ఏమాటకామాట… కేసీయార్ ఆశించిన ప్రయోజనం వేరు కావచ్చుగాక… కానీ విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా తనకు టీఆర్ఎస్ పలికిన ఘనస్వాగతం, వేల వాహనాల ర్యాలీ బహుశా యశ్వంత్ తన పొలిటికల్ కెరీర్‌లోనే మరిచిపోనివి… ఊహించనివి… తను ఎప్పుడూ కేసీయార్‌ను కృతజ్ఞతాభావంతో గుర్తుంచుకునేవి ఇవి… బీజేపీ తనను వదిలేశాక ఈ కాయస్థ మాజీ బ్యూరోక్రాట్ కమ్ కాషాయవాది ఇలా దండల్ని, దండాల్ని ఎంజాయ్ చేసిందెక్కడ…!! అయితే, పాపం శమించుగాక, ఈ ఘన స్వాగతం తన సుదీర్ఘమైన పొలిటికల్ కెరీర్‌కు ఓ ఘనమైన వీడ్కోలు కూడా అనుకోవాలేమో…!! ఎందుకంటే..?
విపక్షాల ఉమ్మడి అభ్యర్థి, బీజేపీ ప్రత్యర్థి కాబట్టి… ప్రతి రాష్ట్రానికీ వెళ్లి వోట్లు అడగడం పరిపాటే… వెళ్తాడు… ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాస్త ఎక్కువ ఆదరణ కనిపించవచ్చు… ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే వోట్లేసేవాళ్లు కాబట్టి పరిమితంగానే పరిచయ, స్వాగత, మద్దతు ప్రకటన కార్యక్రమాలు ఉంటాయి… నిజానికి ఈ పర్యటనలు కూడా మర్యాదపూర్వకమే… లాంఛనమే…
హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలు జరుగుతున్నాయి కాబట్టి, మోడీ సహా బీజేపీ యంత్రాంగం అంతా దిగిపోతున్నది కాబట్టి… ఆ వార్తల కవరేజీని మళ్లించడానికి ఓ మార్గంగా యశ్వంత్ సిన్హా రాకను ఉపయోగించుకున్నాడు కేసీయార్… హంగామా, హడావుడి, అట్టహాసం… స్వయంగా స్వాగతం చెప్పడం కూడా… (మోడీకి కేసీయార్ స్వాగతం చెప్పకపోవడం ప్రొటోకాల్ ఉల్లంఘన అనే విమర్శల్ని ఇక్కడ పట్టించుకునే పనిలేదు… మోడీ వచ్చేది అధికారిక పర్యటన మీద కాదు… అచ్చంగా తమ పార్టీ పని మీద… ముఖ్యమంత్రే వెళ్లి స్వాగతించకపోవడాన్ని తప్పు పట్టే పనిలేదు… ఐనా తలసానిని విమానాశ్రయానికి పంపించాడు కదా…)
Ads
ఇదే కేసీయార్ రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై చర్చిద్దాం రండీ అని పిలిస్తే వెళ్లలేదు… ఠాట్, ఆ కాంగ్రెస్ పాల్గొనే మీటింగుకు నేను రానుపో అన్నాడు… అసలు రాష్ట్రపతి ఎన్నికనే లైట్ తీసుకున్నాడు… తీరా ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పేరు ప్రకటించాక, ఇప్పుడు లటుక్కున అతుక్కుపోయాడు… మరి యశ్వంత్‌కు కాంగ్రెస్ కూడా మద్దతునిస్తోంది కదా… మరి ఇప్పుడు ఎందుకు కావల్సిన వ్యక్తి అయిపోయాడు తను..? సరే, బీజేపీకి ప్రత్యర్థి కాబట్టి మన మిత్రుడే అనుకుందాం… మరి ఉమ్మడి అభ్యర్థిత్వం ఖరారుకు రమ్మంటే వెళ్లకపోవడం ఏమిటి..?
యశ్వంత్ ఓడిపోవడం ఖాయం… ఇది ఎవరో చెప్పలేదు… మమతా బెనర్జీ చెప్పింది… మొన్నటిదాకా యశ్వంత్ ఆమె పార్టీ నాయకుడే… ఎవరెవరినో అడిగి చూశారు… ఎవరూ మేం పోటీచేయం అన్నారు… దాంతో ఈ యశ్వంత్‌ను బరిలోకి దింపింది ఆమె… ఇప్పుడు ఆమే చెబుతోంది… ‘‘ద్రౌపది ముర్ముకే విజయావకాశాలున్నాయి… ముందే ఆమె పేరు చెబితే బాగుండేది’’…. తను గిరిజన అభ్యర్థిత్వానికి వ్యతిరేకిని కాను అని కవరింగు ఇచ్చుకోవడానికి మమత ప్రయత్నిస్తున్నా సరే, ఈ వ్యాఖ్యలతో యశ్వంత్ అభ్యర్థిత్వం పట్ల విపక్షాల్లో సీరియస్‌నెస్ లేమి ఇంకా పెరిగింది…
పేరుకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి… కానీ ఎవరికి పుట్టిన బిడ్డరా అన్నట్టుగా ఎవరూ ఓన్ చేసుకోరు… చేసుకోవల్సిన మమత (కామన్ కేండిడేట్ కోణంలో తనే లీడ్ తీసుకుంది, తన పార్టీ మనిషి) పుల్లవిరుపు మాటలకు దిగింది… కాంగ్రెస్ ఎలాగూ పట్టించుకోదు… కేసీయార్ ఏ అవసరం రీత్యా యశ్వంత్‌ను ఓన్ చేసుకున్నా, ఆ వాతావరణంలోకి వెళ్లడం ఇష్టం లేక కాంగ్రెస్ లైట్ తీసుకుంది హైదరాబాదులో…
హేమంత్ సోరెన్ మా ఆడబిడ్డ పేరిట ద్రౌపదికే జై అంటున్నాడు… నవీన్ పట్నాయక్ కూడా అదే చెబుతున్నాడు… ఆప్ మొదటి నుంచీ ఉమ్మడి అభ్యర్థిత్వం పట్ల ఆసక్తిగా లేదు… మరిక సీరియస్‌గా ఆర్గనైజ్ చేసేదెవరు..? బాధ్యత మీదేసుకుని వర్క్ చేసేదెవరు..? ఇదేకాదు, దీని ప్రభావం రాబోయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వం మీద కూడా పడబోతోంది…!! బహుశా ఉపరాష్ట్రపతి పోటీకి విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎవరూ ఉండకపోవచ్చు కూడా…!!
Share this Article