Abdul Rajahussain …….. *ఆ ‘పాత’ మధురం…”మూగమనసులు”!! *ప్రయోగాత్మక చిత్రం.. “మూగమనసులు” నిర్మాణం… కథా కమామీషు..!! *ఆత్రేయ కీర్తి కిరీటంలో కలికితురాయి….. “మూగమనసులు ” !! *ముళ్ళపూడి వెంకట రమణ గారి సినీ అరంగేట్రం ఈ సినిమాతోనే…!! *గౌరి’ గా జమున చిరస్థాయి నటన…!! *ఆదుర్తి దశ మార్చిన చిత్రం…!
ఆరోజుల్లోనే ప్రయోగాత్మకంగా నిర్మించిన మూగమనసులు సినిమా చాలామందికి బ్రేక్ ఇచ్చింది. తెలుగు చలన చిత్ర సీమలో మరపురాని క్లాసిక్
గా, మ్యూజికల్ బొనాంజగా నిలిచిపోయింది… పాటల రచయితగా ఆత్రేయకి స్టార్ డమ్ తెచ్చిపెట్టిన చిత్రం మూగమనసులు. బాబు మూవీస్ నిర్మించిన ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. అయితే చాలామందికి తెలియని విషయం మరొకటుంది. ఈ చిత్రంతోనే ముళ్ళపూడి వెంకట రమణ మాటల రచయితగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. రమణకిది తొలి చిత్రమే అయినా..సినీరంగంలో రచయితగా నిలదొక్కుకోడానికి మూగమనసులు ఎంతో దోహదపడింది.
Ads
నిజానికి ఈ సినిమా కథ లైన్ ఆదుర్తి గారిదే. దాన్ని డవలప్చేసి రాయమని ఆత్రేయ గారికి చెప్పారు. ఆత్రేయ గారితో ఎంతకూ తెమలక పోయేసరికి ముళ్ళపూడి రమణ గారికి ఆ బాధ్యత అప్పగించారు. రమణకు సినిమా కథ రాయడం కొత్త. అయినా తన వంతు ప్రయత్నం చేసి, ఆత్రేయ గారి ప్రశంసల్ని కూడా పొందడం విశేషం.
మూగమనసులు కథ లైన్ ను మొదట నాగేశ్వరరావుకు చెప్పారు ఆదుర్తి.”ఇదేదో రెండు జన్మల కథంటున్నారు. తెలుగులో ఇప్పటివరకు ఈ తరహా కథలు రాలేదు. ఈ ప్రయోగం బెడిసికొడుతుందేమో ఒకటికిరెండు సార్లు ఆలోచించుకోమని” ఆదుర్తికి సలహా ఇచ్చారట ఏఎన్ ఆర్.. అయితే ఆదుర్తి మాత్రం ఈ విషయంలో మొదటినుంచీ ఖరాఖండిగా వున్నారు. ఒకవేళ సినిమా ఆడకపోయినా నష్టం భరించడానికి తాను సిధ్ధమేనంటూ చెప్పేవారట.!
“కథ ” మొదలైందిలా..!!
ఒక అమ్మాయిగారూ, ఒక పడవ నడిపేవాడూ, తమకు తెలీకుండానే ఒకరిమీద ఒకరు మనసుపడ్డారు. ఆమె జమీందారు గారి అమ్మాయి కాబట్టి, ఇది తోటరాముడు క్యారెక్టర్ కాని పడవ నడిపేవాడి పాత్ర కాబట్టి, వాళ్ళిద్దరూ కలిసే సమస్యే లేదు. పడవకుర్రాడు మాత్రం రోజూ ఆ అమ్మాయిని పడవలో రేవు దాటించి కాలేజీకి పంపించి మళ్ళీ తీసుకువస్తూ ఉంటాడు, ఇదే రొటీను వాళ్ళకి. వాళ్ళ పూర్వజన్మ పుణ్యం వలన వాళ్ళు ఇష్టపడితే, ఏమవు
తుంది. పెళ్లా ? చావా ? కష్టాలా ? “ ఇదీ ఆదుర్తి చెప్పినస్టోరీ లైన్.
ఎందుకో గానీ ఆత్రేయ గారికి కథ లొంగలేదు. ఇక లాభం లేదని కొత్త కుర్రాడు రమణకు అప్పజెప్పారు ఆదుర్తి. ఎక్కువ ఆలోచించకుండానే మొదటిరోజే పట్టు దొరికింది రమణగారికి… ఆయన తనకు వచ్చిన ఆలోచనలన్నింటిని ఓ పుస్తకంలో నోట్స్ గా … రాసుకున్నారు. మొత్తానికి నాలుగో రోజుకి, నలభై అరఠావుల కథ వివరంగా రాసారు…
ఆరోజు సాయంత్రానికి ఆదుర్తి గారు రాగానే, రాసిందంతా ఆయన చేతికిచ్చి, భయపడుతూ, వరండాలో ఓమూలకి ఒదిగి కూర్చున్నారు రమణ. ఆదుర్తి గారు రమణ ఇచ్చిన నోట్సును తీసుకొని దానిమీద దృష్టిపెట్టారు. రమణగారిలో భయం మొదలై గుండె కొట్టుకోవడం ఎక్కువైంది. కాసేపటికి రమణా ! అంటూ ఆదుర్తి నోటి నుంచి ప్రేమ పూర్వక పిలుపు. హమ్మయ్య అనుకున్నారు రమణ. ఆదుర్తి గారు రమణను గుండెలకు హత్తు
కున్నారు, ‘గుడ్ ‘ అంటూ భుజం చరిచారు. అన్నారు,
ఆదుర్తిగారు.ఇంతకన్నా ఎక్కువ పొగిడితే ఆయుక్షీణం అన్నారు! తరువాత రమణను వెంటబెట్టుకొని ఆదుర్తి గారు ఆఫీసుకు తీసుకువెళ్లారు. రమణా నువ్వేం మాట్లాడొద్దు. ఏం తెలీనట్లే వుండు. ‘ అంటూ… హెచ్చరించారు ఆదుర్తి. రమణగారు రాసిన కాగితాలు ఆత్రేయ గారికిచ్చి నేను చెప్పిన లైన్కు ఈ కథ పనికొస్తుందేమో చూసి వెంటనే చెప్పమన్నారు ‘ ఆదుర్తి.
కాస్సేపట్లోనే రవణ రాసింది చదివేసి “చాలా బాగుందన్నారు ఆత్రేయ. “నన్నెక్కడైనా నాలుగు రోజులు వదిలేస్తే మొత్తం కథ రాసేస్తాను.” అన్నారు ఆత్రేయ. వెంటనే……హైదరాబాద్, అబిడ్స్ తాజమహల్ లో ఆత్రేయకు గది బుక్ అయింది! అన్నట్టుగానే…ఆత్రేయగారు, కథ ఫుల్ ట్రీట్మెంట్ రాసి, సమాంతరంగా, ఇంకో కథ కూడా రాశారు, ఒకవేళ అక్కినేనికి ఈ కథ నచ్చకపోతే, వేరే కథతో సినిమా తీయాలని. అయితే ఆత్రేయ గారు సొంతంగా రాసిన కథను పక్కన పెట్టేశారు.
రమణ కథనే ఫైనల్ చేసుకోమని ఆదుర్తికి చెప్పారట. “మంచి కథ. నీ రమణ ఎవడో బాగా రాసాడు. దాన్ని మార్చి అంతకన్నా బాగా రాయాలని ఈ నాలుగు రోజులూ తంటాలు పడ్డాను కానీ, కుదరలేదు.అందరూ ఆత్రేయ రాసిన సంభాషణలు ఫెయిర్ కాపీ చేస్తే, ఇవాళ నేను రమణ రాసిన డైలాగులు కాపీ చేస్తున్నాను. అక్షరం కూడా మార్చలేకపోయాను. ఇది ఆ రమణకే ఇవ్వచ్చుగానీ, నేనే రాస్తాను. ‘ అని చెప్పారట ఆత్రేయ. అంత పెద్ద రచయిత ఇష్టపడింది కాబట్టే మూగమనసులు ఓ కళాఖండంగా నిలిచిపోయింది.
స్క్రీన్ ప్లే సిద్ధం అయిపోగానే, ఆదుర్తి గారు స్టార్ మీటింగ్ ఏర్పాటు చేసారు. సావిత్రి గారు, అక్కినేని గారు, నవయుగ పంపిణీ సంస్థ వారు వచ్చా
రు. సికింద్రాబాద్ క్లబ్బులో మీటింగు. ఆ పెద్దలతో బాటు, విశ్వనాధ్ గారు, (అసిస్టెంట్ డైరెక్టర్ ) ముళ్ళపూడి వారు, ఇంకొందరు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆత్రేయ గారు కథని, చక్కగా చదువుతూ నేరేట్ చేసారు, అందరికీ నచ్చింది.
‘గోదావరి మీద పడవబ్బాయి. రాధ, గౌరి అల్లరి. ఇవన్నీ చాలా కొత్తగా వున్నాయి. చాలా బాగున్నాయి. ‘ సావిత్రి గారు అవన్నీ మా రమణ రాసాడు. ‘ అన్నారు ఆదుర్తి గారు. గోదావరిలో ఈతకొట్టడం, గోదారి నది మధ్యలో సుడిగుండాలు.. ఇవన్నీ రమణ గారి నిజ జీవిత అనుభవాలు. సంగీతం (పాటలు ) కూడా హైదరాబాదులోనే ప్లాన్ చేశారు. ఇక్కడైతేనే ఆత్రేయ గారిని పట్టిపెట్టొచ్చన్నది ఆదుర్తి గారి ప్లాన్. సంగీత యజ్ఞం ప్రారంభం అయింది.
ఆత్రేయగారు పాట రాయడం, వెంటనే మహదేవన్ ట్యూన్ కట్టడం, సాయంకాలం ఆరుగంటలకు ఆదుర్తిగారు వచ్చి పాట వినడం, ఓకే చెయ్య
డం జరిగేది. పూటకో పాట. ‘ నాపాట నీనోట పలకాల సిలకా ! ముక్కుమీద కోపం నీ ముఖానికే అందం.’ గోదారీ గట్టుంది. గట్టుమీదా సెట్టుంది . ఈనాటి ఈ బంధమేనాటిదో, మానూ మాకును కానూ. రాయీ రప్పను కానేకాను.. ముద్దబంతి పూవులో, మూగకళ్ల ఊసులో.. పాడుతా తీయగా చల్లగా ఇలా దాదాపు పాటలన్నీ ఆత్రేయగారే రాశారు. గౌరమ్మా నీ మొగుడెవరమ్మా.అనే జానపద ధోరణిలో సాగిన పాటను మాత్రం కొసరాజు రాశారు.
ఇలా ఒకదానిని మించి ఒకటి, తల్లి గోదారిలా ఉప్పొంగాయి. బాలగోదారిలా నవ్వించాయి. వరద గోదారిలా పరవళ్లు తొక్కాయి. శాంత గోదావరిలా ఠీవీగా నడిచాయి. ఎందుకో గానీ..ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచీ కూడా నెగిటివ్ టాక్ షికారు చేసింది. ముళ్ళపూడి ముంచేసాట్ట. అక్కినేని ఎదురు రొమ్ము మీద జమున కాళ్ళు పెట్టిందంట. అంతేనా, సావిత్రి అక్కినేనిని ఒరే, గిరే అంటుందంట… ‘కామెడీ పద్మనాభం సావిత్రికి మొగుడంట, ఆడు గుండెపోటొచ్చి సచ్చిపోతే, అప్పుడు సావిత్రి ఏఎన్నార్ ని పెళ్లాడతాదంట. ఇలా కథని ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు వ్యాఖ్యానించడం మొదలైంది.
ఇదంతా కథ రాసిన రమణ మీద రిఫ్లెక్ట్ అయింది. అయితే, వెక్కిరింతలు, హెచ్చరికలలోనికి దిగాయి. అక్కినేని, ఆదుర్తీ, చిన్న లోపాయకారీ మీటింగు పెట్టుకొని చర్చించారు. ‘పోనీ, హీరో గారు జమున గారి కాళ్ళు పట్టుకుని పారాణి పెట్టే సీను తీసేస్తే… ‘ అనుకున్నారు. ముళ్ళపూడి వారిని పిలిచి,’ఇది ఎక్కడైనా ఉన్నదా ? కాపీ కొట్టావా ? లేక నీ పైత్యమా ? ‘ అని అడిగారుట. ఇది నా పైత్యం కాదు, కాళిదాసు కవిత్వం. ఇలాంటివి పురాణ ఘట్టాలలో వుంటాయి.’ అని జవాబిచ్చారట రమణ గారు.
ఎలాగైతేనేం,. రతీ మన్మథులు, శివపార్వతుల ఉదాహరణలు చెప్పి రమణ గారు ఒప్పించారు. మొత్తానికి ఈ పుకార్లే సినిమా విజయానికి నిచ్చెన మెట్లయ్యాయి. సినిమా విడుదలైంది. మొదట ఓ మోస్తరు అనుకున్నారు. ఆ తర్వాత ఎత్తుకుంది. సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా పట్ల జరిగిన ఊహాగానాలన్నీ…. పటాపంచలయ్యాయి. ఈ సినిమా అంత ఒక యెత్తు… ఆత్రేయ గారు రాసిన పాటలు మరో ఎత్తు. ఆత్రేయ “మనసు ”
పెట్టి అచ్చతెలుగులో రాసిన పాటలు సినిమా విజయానికి కారణమయ్యాయి. జనం బళ్ళు కట్టుకొని వచ్చి ఈ సినిమా చూశారు.. సినిమా
లోని అమ్మాయి గారు (సావిత్రి ) గోపి (ఏఎన్ ఆర్ ) గౌరి (జమున ) పాత్రల్లో జీవించారు. జమున గారు ‘గౌరి’గా ప్రేక్షక హృదయాల్లో నిలిచిపోయారు..!!
*ఎ.రజాహుస్సేన్..!!
Share this Article