.
నిన్న ఇంగ్లిషు మీడియాలో కనిపించిన ఈ వార్త ఆసక్తికరంగా ఉంది… “గోల్డెన్ ఆర్మ్ మ్యాన్” గా ప్రసిద్ధి చెందిన ఆస్ట్రేలియన్ రక్తదాత జేమ్స్ హారిసన్ 88 సంవత్సరాల వయస్సులో కన్నుమూశాడు…
ఫిబ్రవరి 17న NSW సెంట్రల్ కోస్ట్, ఆస్ట్రేలియాలోని పెనిన్సులా విలేజ్ నర్సింగ్ హోమ్‌లో ఆయన మరణించినట్టు ఆస్ట్రేలియన్ రెడ్ క్రాస్ లైఫ్ బ్లడ్ ధృవీకరించింది…. ఇదీ వార్త…
Ads
అసలు ఎవరాయన..? ఎందుకు తన గురించి చెప్పుకోవాలి…? ఇదీ అసలు ప్రశ్న… సింపుల్‌గా చెప్పాలంటే ఈయన అరుదైన రక్తం 24 లక్షల మంది శిశువులను కాపాడింది… మళ్లీ చదవండి… 24 లక్షల మంది పిల్లలను… అబ్బురం కదా… కానీ ఎలా..?
1954లో కేవలం 18 సంవత్సరాల వయస్సులో ఆయన రక్తదానం చేయడం ప్రారంభించాడు…తన జీవితకాలంలో, 81 సంవత్సరాల వయస్సులో 2018లో రక్తదానం ఆపేసేవరకు ఆయన 1,173 సార్లు రక్తదానం చేశాడు…
అంటే, 18 ఏళ్ల వయస్సు నుంచి 81 ఏళ్ల వయస్సు దాకా అలుపెరగకుండా, కాదనకుండా, ఓ యజ్ఞంలా తన రక్తాన్ని ధారబోస్తూ వచ్చాడు… అవును, చాలామంది వందలసార్లు రక్తదానం చేసినవాళ్లు ఉన్నారు కదా, ఈయన రక్తానికే ఎందుకు అంత విలువ అంటారా…? ఉంది, దానికీ ఓ కథ ఉంది… చెప్పుకుందాం.,.
అన్నిసార్లు రక్తదానం చేస్తుంటే తన సొంత పిల్లలు ఏమీ అనలేదా..? అనలేదు… దేవుడిలా చూశారు… ఆయన కుమార్తె ట్రేసీ మెల్లోషిప్ ఆయనను “”humanitarian at heart” అని పిలిచి, ఆ ధన్యజీవికి ధన్యవాదాలు అని ఓ ప్రకటనలో పేర్కొంది…
లైఫ్‌బ్లడ్ CEO స్టీఫెన్ కార్నెలిస్సెన్ ఈ జేమ్స్ హారిసన్ అసాధారణ ఔదార్యాన్ని, దాని ప్రపంచ ప్రభావం గురించి ప్రశంసించాడు… “జేమ్స్ అద్భుతమైన, నిబ్బరమైన దయగలిగినవాడు… ఏళ్లకేళ్లు ఉదారంగా రక్తాన్ని ఇస్తూనే వెళ్లాడు… తన భార్య బార్బరా మరణం వంటి వ్యక్తిగత నష్టాన్ని ఎదుర్కొన్నప్పటికీ, హారిసన్ ఇతరులకు సహాయం చేయడానికి తన చెక్కుచెదరని అంకితభావాన్ని ప్రదర్శిస్తూ క్రమం తప్పకుండా రక్తదానం చేస్తూనే వచ్చాడు…’’
తన రక్తంలో విశేషం ఏమిటంటే..? అత్యంత అరుదైన యాంటీ-డి అనే యాంటీ బయాటిక్స్ కలిగి ఉంది ఆయన నెత్తురు… అదెలా వచ్చిందో శాస్త్రవేత్తలు కూడా చెప్పలేకపోయారు… బహుశా ఆయనకు 14 ఏళ్ల వయస్సులో ఏదో కారణంతో భారీ రక్తమార్పిడి జరిగింది, తరువాతే ఈ వరం దక్కింది ఆయనకు, ప్రపంచానికి…
1960 మధ్యకాలంలో యాంటీ-డి చికిత్స రాకమునుపు ప్రతి ఇద్దరు శిశువుల్లో ఒకరు మరణించేవారు హీమోలిటిక్ డిసీజ్, హెచ్‌డిఎఫ్ఎన్ వల్ల… అంటే తల్లికి, శిశువు లేదా పిండానికీ నడుమ ఆర్‌హెచ్‌డి నెగెటివ్, పాజిటివ్ తేడాలు ఉన్నప్పుడు శిశువుకు ప్రాణాంతకం అవుతుంది…
ఇదుగో జేమ్స్ రక్తంలో ఉన్నట్టు యాంటీ-డీ ఉన్న రక్తాన్ని ఎక్కిస్తే తల్లి సేఫ్, శిశువూ సేఫ్… ఇలాంటి యాంటీ-డీ యాంటీ బాడీస్ ఉన్నవారిని చాలామందిని గుర్తించారు… చాలాచోట్ల ఈ రక్తమార్పిడి కామన్ అయిపోయింది… కానీ 67 ఏళ్లుగా తన రక్తాన్ని ఏకంగా 1173 సార్లు దానం చేసి, 24 లక్షల మంది పిల్లలకు ప్రాణదానం చేయడం అంటే మాటలు కాదు కదా… ధన్యజీవివి జేమ్స్…!
Share this Article