కర్నాటకలో ఓ మంత్రి ఉన్నాడు… పేరు ఉమేష్ కత్తి… జూనియర్ ఏమీ కాదు… అరవయ్యేళ్ల వయస్సు… ఆరుసార్లు ఎమ్మెల్యే… ఆయన తండ్రి విశ్వనాథన్ కత్తి కూడా ఎమ్మెల్యేగా చేశాడు… తను మొన్న ఓ మాటన్నాడు… ‘‘ప్రధానిగా మళ్లీ మోడీ ఎన్నిక కాగానే… 2024లో కర్నాటక రెండు రాష్ట్రాలుగా విడిపోతుంది… మహారాష్ట్ర కూడా అంతే… ఉత్తరప్రదేశ్ నాలుగు రాష్ట్రాలవుతుంది… మొత్తం దేశంలో 50 రాష్ట్రాలుంటాయి… ఫైల్ రెడీగా ఉంది… నాకు విశ్వసనీయ సమాచారం ఉంది…’’
ఇప్పుడు ఈ అనవసర వివాదం దేనికిలే అనుకుని హడావుడిగా కర్నాటక సీఎం ఆ వాదనను తోసిపుచ్చాడు… కానీ ఇది అవసరమైన చర్చే… కామన్ సివిల్ కోడ్ దగ్గర నుంచి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ దాకా చాలా ప్రతిపాదనలు, వ్యూహాల, లాభనష్టాల మదింపులు బీజేపీ పరిశీలనలో ఉన్నయ్… ఎలాగూ కాంగ్రెస్ పనైపోతోంది, బలంగా కనిపించే ప్రాంతీయ పార్టీలను మరుగుజ్జుల్లా మార్చేసి, బీజేపీ బలోపేతమైన రాజకీయ శక్తిగా ఎదగాలని ప్రయత్నం… ఓ రాజకీయ పార్టీగా ఆ ఆశ సహజం… ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎదురులేని బలాన్ని, స్థిరత్వాన్ని కోరుకుంటుంది…
50 రాష్ట్రాలు అనే వ్యాఖ్య మరీ కొట్టేయదగిందేమీ కాదు… బీజేపీ సిద్ధాంతరీత్యా చిన్న రాష్ట్రాలకు అనుకూలం… చిన్న పరిపాలన యూనిట్లు ప్రజలకు శ్రేయస్కరం అని పైకి చెబుతున్నా సరే… పార్టీ అంతిమ ఆలోచన ఏమిటంటే… బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు..! దేశానికి ఉన్న సవాళ్ల నేపథ్యంలో కేంద్రం బలంగా ఉండటమే మంచిదనేది బీజేపీ భావన… చిన్న రాష్ట్రాలు ఉంటే పార్టీని వేగంగా, బలంగా విస్తరించవచ్చు అనేది మరో ఆశ… సమీప భవిష్యత్తులో ఇంత బలమైన నెట్‌వర్క్, నెట్‌వర్త్ ఉన్న జాతీయ పార్టీ కష్టం కాబట్టి, కాంగ్రెస్‌ను ఇంకాస్త తొక్కితే… ప్రాంతీయ పార్టీలను కూడా బలహీనపరిస్తే ఇక తమకు ఎదురులేదు అని బీజేపీ ఆలోచనల మర్మం…
Ads
చాలా ఏళ్లుగా చాలా ప్రాంతాలు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి కోసం పోరాడుతున్నాయి… ఆ పోరాటాల వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నయ్, నిజంగానే అవసరమున్నవీ ఉన్నయ్… వివక్షకు గురైన తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హోదాను కాంగ్రెస్ ఇస్తే… అంతకుముందు మూడు రాష్ట్రాలను బీజేపీ ఇచ్చింది… బలమైన కోరికలు రాజకీయ అనివార్యతల్ని సృష్టించినప్పుడు ఇలాంటివి తప్పవు… తప్పేమీ కాదు… చిన్న రాష్ట్రాల ఏర్పాటు అనేక అస్థిత్వ ఉద్యమాలకు, ఆకాంక్షలకు గౌరవం ఇచ్చినట్టే… పైగా ఇంకొన్ని కారణాల రీత్యా రాష్ట్రాల పునర్విభజన అవసరమే…
ఉత్తరప్రదేశ్ తీసుకొండి… అంత పెద్ద రాష్ట్రం, అక్కడ ఉన్న ఎంపీ సీట్ల సంఖ్య ఏకంగా కేంద్రంలో అధికారాన్ని డిక్టేట్ చేస్తున్నది… ఉత్తరాఖండ్ ఏర్పాటుకు ముందు ఇంకా పెద్దగా ఉండేది… అలాగే అన్ని ఆకాంక్షలు తెలంగాణ, ఏపీ విభజన అంతగా సూటిగా ఉండవు… ఏ ప్రతిపాదిత రాష్ట్రంలోకి ఏ ప్రాంతాలు రావాలనేది పెద్ద సబ్జెక్టు… భాష ప్రాతిపదిక కానప్పుడు మరి ఏ ప్రాతిపదికన విభజించాలనేది మరో చిక్కు ప్రశ్న… ఇప్పుడు కొన్ని ఉద్యమాలు వాటంతటవే చల్లబడిపోయాయి…
అధికారంలో ఉన్న పార్టీలు ‘‘మా దేహాలు ముక్కలైనా సరే, మా రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వబోం…’’ అని సమైక్య నినాదాల్ని భీకరంగా వినిపిస్తుంటాయి… తీరా అవసరం వస్తే అవే పెట్రోల్ పోస్తాయి… ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బలమైన పార్టీలు విభజనను అస్సలు అంగీకరించవు… ఉదాహరణకు గూర్ఖాల్యాండ్ అంటే చాలు మమత భగ్గుమంటుంది… కొంగునాడు లేదా దక్షిణ తమిళనాడు అంటే స్టాలిన్ కస్సుమంటాడు…
ఒకవేళ కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీ స్థిరమైన నిర్ణయం తీసుకుంటే… రాజ్యసభ, లోకసభల్లో మంచి మెజారిటీ ఉంటే… 50 రాష్ట్రాలు అసాధ్యమో, అసాధారణమో, అరిష్టమో ఏమీ కాదు… ఆయా రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదాన్ని కూడా తోసిరాజనవచ్చు… దేశ సమగ్రత, సార్వభౌమత్వ రక్షణ, మరింత మెరుగైన పాలన వంటి ఎన్ని అదనపు అంశాల్నయినా జోడించవచ్చు… ఎటొచ్చీ ఎన్నికలకు ముందు బీజేపీ తన ఆలోచనల్ని స్పష్టంగా ప్రజలతో షేర్ చేసుకుంటుందా..?!
Share this Article