కొన్ని వార్తలను సాక్షి రిపోర్ట్ చేసే పద్ధతి చాలా చిత్రంగా ఉంటుంది, నమ్మబుల్‌గా అనిపించవు… సో, పవన్ కల్యాణ్ నిజంగా ఇలాగే కామెంట్ చేశాడా అని డౌటొచ్చింది… వేరే పత్రికలు కూడా చూస్తే నిజంగానే దాదాపు ఇదే అర్థమొచ్చేలా పవన్ కల్యాణ్ మాట్లాడాడు… తన మాటల్లో కొంతశాతమే అర్థమవుతుంటాయి కాబట్టి ఈ సాక్షి వార్తే నిజమనుకుని చెప్పుకుందాం… ‘‘ఆంధ్రా నేతల్లో ప్రాంతీయ భావన లేకుండా కేవలం కులభావనే ఉండేది… ఈమధ్యకాలంలో కులభావన కూడా పూర్తిగా చచ్చిపోయింది… మంత్రులు వాళ్ల సొంత కులం నేతల్నే తిట్టే స్థాయికి వెళ్లారు…’’ ఇదీ తన ప్రవచనం…
నిజంగానే కొన్నిసార్లు పవన్ కల్యాణ్ మాటలు, అడుగులు, ఆలోచనలు, చేష్టలు చూస్తే నవ్వొస్తుంది… వెంటనే జాలేస్తుంది… ఏ కులం వాళ్లను ఆ కులం వాళ్లతో తిట్టించాలనే ఓ పిచ్చి సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది మీ అనుంగు మిత్రుడు చంద్రబాబే… ఆ తరువాతే ప్రతి పార్టీ ఆ గొప్ప ఆదర్శాన్ని అనుసరిస్తోంది సారు గారూ… అవునూ, రాజకీయ నాయకులు సొంత కులం వాళ్లను తిట్టకూడదనే రాజకీయ నైతిక నియమావళి ఏమైనా ఉందా సార్..?
Ads
ఎవరైనా రాజకీయ నాయకుల్లో కులభావన నిజంగానే చచ్చిపోవాలని, సొంత కులం వాళ్లకే పనులు చేసిపెట్టే కుల సంస్కృతి పోవాలని కోరుకుంటారు… కానీ ఈ సార్ గారేమో కులభావన చచ్చిపోతోందని బాధపడిపోతున్నాడు… ప్రాంతీయ భావన ఉండాలి, కులభావన ఉండాలట… తమరి నైతిక నియమావళిలో ఇంకా ఇలాంటి ఘన భావనలు ఏమేం ఉన్నాయి సార్..? బంధుభావన, కుటుంబభావన ఎట్సెట్రా కూడా ఉన్నాయా..?
కౌరవులు పాండవులకు రాజ్యాధికారం లేకుండా చేశారు కాబట్టి… వైసీపీ నేతలు కక్ష కట్టి తనను రెండుచోట్లా ఓడించారు కాబట్టి వైసీపీ వాళ్లే కౌరవులట… ఏం సూత్రీకరణ..? ఎంత గొప్ప బాష్యం..? ఎన్నికల్లో కక్షలు కట్టి ఓడించడాలు ఉండవ్… ఎత్తుగడలు ఉంటయ్, పార్టీలకు విధానాలు ఉంటయ్… ప్రజలు గెలిపించాలి అనుకుంటే ఏ పార్టీ ఎన్ని ఎత్తుగడలు వేసినా ఫలించదు… నిన్ను గెలిపించాలని ప్రజలు అనుకోలేదు… ఓడిపోయావు… అంతేతప్ప వైసీపీ కక్ష అంటే ఎలా..?
పోనీ, కనీసం ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులను ఓడించకూడదనే రాజకీయ మర్యాద సూత్రావళి ఏమైనా ఉందా..? ఏ పార్టీ అయినా సరే, ప్రత్యర్థి పార్టీ ముఖ్యులకే ఓడించాలనీ, తద్వారా నైతికంగా బలహీనపరచాలనే ప్రయత్నిస్తుంది… ఓ దశలో ఎన్టీయార్, ఇందిరాగాంధీ వంటి నేతల్నే ప్రజలు ఓడించారు… అంతెందుకు..? మీ అన్నయ్య కూడా రెండు సీట్లలో పోటీచేసి, ఒక దాంట్లో ఓడిపోయాడు కదా…
వోకే, వైసీపీ విధానాల్ని, పాలన పద్ధతుల్ని, వైఫల్యాన్ని రాజకీయంగా ఎండగట్టు, చాకిరేవు పెట్టు, నీ భాషలో తోలుతీస్తా అను, తాటతీస్తా అను… నువ్వు అనాల్సిందే, వాళ్లు పడాల్సిందే… తప్పు లేదు… జగన్ పాలన వైఫల్యాలు బోలెడు… అవి వదిలేసి ఈ ‘‘భావనల భాష’’ దేనికి..? ప్రాంతీయ భావనలు, కులభావనలు, రాజకీయ మర్యాదల గురించి, నువ్వు విస్తారంగా చదివిన 70, 80 వేల పుస్తకాల్లో ఏమీ రాసి ఉండదు… కాస్త ఆలోచించుకుని మాట్లాడాలి… అంతే…
Share this Article