హబ్బ… ఎంత బాగా చెప్పాడో కదా… సూపర్ సంఘీభావం కదా… విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కేటీయార్ మద్దతు మామూలు విషయమా..? అనేదే కదా మీ ప్రశంస…. ఒక్క ప్రశ్న…. రేప్పొద్దున మాకు కష్టమొస్తే ఎవరొస్తారు అంటున్నాడు కదా యువరాజా వారు… సింగరేణినీ, బీహెచ్‌ఈఎల్‌నూ అమ్మేస్తే ఎలా ..? ఎవడొస్తాడు..? మీకు మేము, మాకు మీరు అని అద్భుతమైన సోదరభావాన్ని వ్యక్తీకరిస్తున్నాడు కదా….. అవును సారూ… 51 శాతం వాటా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదే అయిన సింగరేణిని కేంద్రం ఎలా అమ్మగలదు..? బీహెచ్ఈఎల్ మీద తెలంగాణ హక్కులేమిటి..? నో, నో, ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు… సారు చెప్పిండు, మనం వినాలె… ఎందుకంటే… ప్రతి దానికీ పొలిటికల్ లెక్కలుంటయ్… ఏమీ లేదు… మొన్న గ్రేటర్ ఎన్నికల్లో సెటిలర్స్ వోట్లే కదా గట్టెక్కించింది… ఇప్పుడూ అదే ఆశ… అదే ధ్యాస… ఒకప్పుడు సెటిలర్స్ అంటేనే విరుచుకుపడిన పార్టీకి ఇప్పుడు ఆ సెటిలర్స్ వోట్లే ప్రాణంగా కనిపించడం ఓ వింత… నిజానికి వింత కాదు, రాజకీయాలు అంటే అలాగే ఉంటయ్… ప్యూర్ తెలంగాణ ఉద్యమ పార్టీకి, ఆంధ్రావాలా జాగో అన్న పార్టీకి జస్ట్, ఏడెనిమిదేళ్లలోనే తెలంగాణవాదుల వోట్లకన్నా సెటిలర్స్ వోట్లే ఆక్సిజెన్ కావడం విశేషం… బంగారు తెలంగాణ అంటే ఏమనుకున్నారు మరి..?!
తెలంగాణ సమాజానికి పల్లా రాజేశ్వరరెడ్డి చేసిన అద్భుతమైన సేవలు చాలవా తనను మళ్లీ గెలిపించడానికి..? ది గ్రేట్ పీవీ వారసురాలు వీణాదేవికి తెలంగాణ సమాజం మద్దతునివ్వదా..? ఆ బ్రాహ్మణ వోట్లు సరిపోవా..? మరెందుకు ఈ సెటిలర్స్ వోట్ల యావ..? అంటే… అదే మరి రాజకీయం…! మీరు ఏమీ అడగనక్కర్లేదు… నిజాం సుగర్ ఫ్యాక్టరీ దురవస్థను ప్రశ్నించనక్కర్లేదు… జస్ట్, ఈ ఎమ్మెల్సీ వోట్ల కథ ముగిస్తే చాలు… విశాఖపట్నం వెళ్లి ఎవరు ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొంటారో, ఎవరు మరిచిపోతారో చూడొచ్చు… ‘‘రేపు తెలంగాణ సమస్య వస్తే ఎవరొస్తారు’’ అంటున్నాడు కేటీయార్… సరే, వెరీ గుడ్… అమరావతి సమస్య మీద ఏమంటారు సారూ..? జగన్ వైఖరి కరెక్టా..? రాంగా..? వైఎస్ షర్మిల పార్టీ కరెక్టా..? రాంగా..? పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు, రాయలసీమ లిఫ్టు రైటా..? రాంగా..? మరి అన్నీ మాట్లాడాలి కదా…
Ads
అసలు ఆంధ్రాలోనే ది గ్రేట్, అద్భుత ప్రజాసేవకుడు, బ్రహ్మాండమైన వ్యూహకర్త, నిరంతర ప్రశ్నావాహిని జనసేనాని పవన్ కల్యాణే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకం దేశహితం కోసం అనేశాడు… ఏదో పురపాలక ఎన్నికల సందర్భంగా సాయిరెడ్డి పాదయాత్రలు గట్రా అయిపోయాయి… జగన్ లేఖల పర్వం అయిపోయింది… కొరడా పట్టుకుని మోడీ ఎక్కడ బాదేస్తాడో అనే భయంతో ఉన్న తెలుగుదేశం సైలెంట్… చంద్రబాబు ఎంత అరిచిగీపెట్టినా సరే మోడీకి వ్యతిరేకంగా పోడు… పోయే ధైర్యం లేదు… ఎన్నికల ముందు నీ అంతుచూస్తాను అని మోడీని ఇష్టారాజ్యంగా తూలనాడిన నోరు ఇప్పుడు చస్తే లేవదు… అయితే గియితే జగన్‌ను తిడతాడు అంతే… జగన్ ఏం చేయబోతున్నాడనేది బాబుకే కాదు, కేసీయార్‌కూ అంతుపట్టదు… అసలే కేసుల భయం, బెయిల్ రద్దు భయం… తన పంథా తనది… లెఫ్ట్‌ను జనం ఎప్పుడో వదిలేశారు… సీపీఐ ఆల్రెడీ తెలుగుదేశం బీ-టీంగా మారిపోయింది… కాంగ్రెస్ ఉండీలేనట్టే… ఇంకెవరు ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి..? రాజకీయ ప్రోద్బలం లేని ఉద్యమాలు సక్సెస్ అవుతాయా..? అసలు ఆ ఉద్యోగుల మీద జనంలో సానుభూతి ఉందా..? ఇక్కడ బీజేపీ చేస్తున్నది కరెక్ట్ అని కాదు… ఒక జాతి తమ మనోభావాలకు అనుగుణంగా ఉవ్వెత్తున ప్రతిఘటించే స్థితిలో ఉందా..? మనోభావాలు ఇప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఉపయోగపడుతున్నాయా..? ఈ ప్రశ్నలకు జవాబులు ప్రస్తుతానికి లేవు…! సార్, మెగా స్టార్… పాత ప్రజారాజ్యం అమ్మకాలు గట్రా మరిచిపోదాం… తెలుగుజాతి ఇంత ఇచ్చింది కదా… నువ్వు గోడల మీద ఉక్కు ఉద్యమ స్లోగన్స్ రాసినోడివి కదా… కమాన్, విశాఖలో బైఠాయిస్తావా..? జస్ట్, ఆస్కింగ్…!!
Share this Article