మామూలుగా సినిమా ఫంక్షన్లు అంటేనే బోలెడంత హిపోక్రసీ… స్వకుచమర్దనాలు… కీర్తనలు, ఆహాలు, ఓహోలు, చప్పట్లు, ఫ్యాన్స్ కేకలు గట్రా… అదో ప్రపంచం… సినిమా పిచ్చి ఉన్నవాళ్లకు వోకే గానీ మిగతా ప్రేక్షకులకు బోర్, చికాకు, విసుగు… కానీ ఆహా ఓటీటీ ప్రతిష్ఠాత్మకంగా, భారీ వ్యయంతో, ప్రయాస పడి నిర్మించే తెలుగు ఇండియన్ ఐడల్ షో లాంచింగ్ కార్యక్రమం మాత్రం పూర్తి భిన్నంగా, ఆహ్లాదకరంగా అనిపించింది…
అఫ్‌కోర్స్, ఇది రొటీన్ సినిమా ఫంక్షన్ కార్యక్రమం కాకపోయినా సరే… ఈ మ్యూజిక్ షో మొత్తం సినిమా పాటల పోటీయే కదా… పైగా జడ్జిలు థమన్, కార్తీక్, గీతా మాధురి, హోస్ట్ శ్రీరామచంద్ర అందరూ సినిమా పక్షులే కదా… గంటన్నరపాటు వీడియో ఇది… ఆహా ఓటీటీలో ఉంది… నచ్చింది ఏమిటంటే… శ్రీరామచంద్ర, గీతామాధురి, కార్తీక్ పాటలు పాడారు ఈ షోలో… శ్రీరామచంద్ర ఎనర్జీ, స్పాంటేనిటీ చెప్పనక్కర్లేదు… డాన్స్ కూడా చేశాడు… తెలుసు కదా, తను సింగర్ మాత్రమే కాదు, డాన్సర్, హోస్ట్, యాక్టర్ సో మెనీ టాలెంట్స్…
కార్తీక్ గురించి చెప్పనక్కర్లేదు… 25 ఏళ్లుగా అనేక భాషల్లో పాడుతూనే ఉన్నాడు… వెరీ టాలెంటెడ్… గీతామాధురి పాట మాత్రం అప్ టు మార్క్ లేదనిపించింది… బహుశా ఆమె ఇదే స్థాయిలో గనుక ఆడిషన్స్‌కు వచ్చి పాడి ఉంటే రిజెక్షన్‌కు గురయ్యేదేమో…! (శ్రీరామచంద్ర వేసిన ఓ స్పాంటేనియస్ జోక్ ఆమెకు మొదట అర్థం గాక ఎడ్డిమొహం వేసింది…)
Ads
అంబడిపూడి కామాక్షి… అలియాస్ వయోలిన్ సావిత్రి… నిజమే, అలాగే కనిపిస్తుంది… ఈ షో నడిచిన గంటన్నర సేపూ ఆమె బ్యాక్ డ్రాప్‌లో కనిపిస్తూనే ఉంది, సావిత్రిలా..! 15-20 నిమిషాల పాటు ఒకసారి, తరువాత షో మధ్యలో మరోసారి ఈ ఆర్కెస్ట్రా పర్‌ఫామ్ చేసిన ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్‌లో కామాక్షి వయోలిన్ నాదమే హైలైట్… సంగీతాభిమానులను ముగ్ధులను చేసే టాలెంట్ ఉన్న ఆమెకు అభినందనలు… నిజంగా ఆమె చేతిలో మంచి వాయులీన విద్య ఉంది… కీబోర్డు ప్లేయర్, ఫ్లూటిస్టు, టీం కెప్టెన్ సాయి, పవన్ అందరూ ఎనర్జిటిక్… సీజన్ 1, 2 కూడా రక్తికట్టించింది ఈ టీం… ఈ సీజన్‌కు కూడా వీళ్లే…
కామాక్షిని ఉద్దేశించి థమన్ చేసిన సరదా వ్యాఖ్య బాగుంది… ‘‘కామాక్షి కాదు, పూనాక్షి, వయోలిన్ పట్టుకుంటే పూనకాలే… వయోలిన్ పట్టుకుంటే వయెలెన్సే…) తప్పదు… థమన్, కార్తీక్, గీతామాధురి ప్రసంగాల్లో మళ్లీ కాస్త సినిమా ఫంక్షన్ల వాసనలు కనిపించినా ఓవరాల్‌గా వోకే… మీడియా, ఆహా టీవీ, ఆర్కెస్ట్రా, మరికొందరు అతిథులే కాబట్టి ఓ ఇన్‌సైడ్ ఫంక్షన్‌లా బాగుంది..!!
అంతా బాగానే ఉంది గానీ… వీళ్లందరికీ కుర్చీ మడతపెట్టి సాంగ్ బాగా ఎక్కేసినట్టుంది… థమన్ వేదిక మీదకు వస్తుంటే అదే సాంగ్ ప్లే చేశారు… గీతా మాధురి ఎప్పుడో కుర్చీ మడతపెట్టేసింది అని థమన్ వ్యాఖ్య… రోజూ మీ పాటలు వింటూ మా ఇంట్లో కుర్చీ మడతపెట్టేస్తుంటాం అంటూ థమన్‌ను ఉద్దేశించి గీతామాధురి వ్యాఖ్య… ఇదేం భాషరా భయ్… కుర్చీ మడతపెట్టడం అంటే చలామణీలో ఉన్న అసలు బూతు అర్థమేమిటో కూడా మరిచిపోయి… ఎంచక్కా తమ భాషలో భాగం చేసేసుకున్నారు… అవునూ, థమన్‌కు ఆ సాంగే ఐడెంటిటీ సాంగా..? అంటే సిగ్నేచర్ ట్యూనా..? ప్చ్, ఫాఫం..!!
Share this Article