ఒకప్పుడు తెలంగాణ భాష అన్నా, సంస్కృతి అన్నా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చిన్నచూపు, ఎగతాళి, వెక్కిరింపు… ఇప్పుడదే తెలంగాణ భాష, ఆట, పాట, కల్చర్, సామాజిక జీవన నేపథ్యం అన్నీ కొత్త ట్రెండ్… హీరోహీరోయిన్లు కూడా తెలంగాణ పాటలు పాడతారు, ఈ యాసలోనే మాట్లాడతారు… ట్రెండ్ కాబట్టే ఇండస్ట్రీ నెత్తిన పెట్టుకుంటోంది అనేది నిజం… ప్రేమతో కాదు అనేది సారాంశం…
బలగం, దసరా సినిమాలే కాదు, ఈమధ్య పలు సినిమాల్లో సగటు తెలంగాణ కుటుంబ జీవనమే కథావస్తువే… కట్ చేస్తే… యూట్యూబులో కూడా తెలుగు ప్రైవేటు ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్నయ్… అనేక మంది కళాకారులు సినిమా పాటల్లాగే చిత్రీకరిస్తున్నారు, ట్యూన్లు కడుతున్నారు… డాన్సులు సరేసరి… కొన్ని పాటలకైతే 20, 30, 40 లక్షల వ్యూస్ కనిపిస్తున్నయ్… కట్ చేస్తే…
ఆమధ్య ఓ పాట… నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా… తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపింది… మోహన భోగరాజు పాడిన ఈ పాట 35 కోట్ల వ్యూస్ సాధించినట్టు గూగులమ్మ చెబుతోంది… స్ల్పెండిడ్… దాన్ని అనుకరించి, కాపీ చేసిన పాటలకు కూడా లక్షల్లో వ్యూస్… ఇక ఫంక్షన్లలో ఎక్కడ చూసినా అదే పాట… ఆ స్థాయిలో మళ్లీ జనాదరణ పొందిన పాటల్లో ప్రముఖమైంది ఉరుముల రమ్మంటినే మెరుపుల రమ్మంటినే… (ఒరిజినల్ సాంగ్‌లో నాగదుర్గ డాన్స్ చేసిందనుకుంటా, సైటీవీ..?)…
Ads
ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… షార్ట్స్, రీల్స్‌లో ఈమధ్య ఈ పాటకు చేసే డాన్సులు విపరీతంగా కనిపిస్తున్నయ్… మామూలు గృహిణులు, కాలేజీ పిల్లలు, చిన్న పిల్లలు కూడా దీనికి డాన్సులు చేస్తూ నెట్‌లో పెట్టేస్తున్నారు… బరాత్‌లు, పెళ్లి ఫంక్షన్లలో ఈ డీజే పెట్టేసి అందరూ ఎగురుతున్నారు… నిజానికి ఈ పాట కూడా ప్రైవేటు ఆల్బమే… రెండేళ్లయినట్టుంది పాట రిలీజై… కానీ ఈమధ్యే రీల్స్, షార్ట్స్ బాగా కనిపిస్తున్నయ్… ఇక్కడే మరో ముచ్చట…
బుల్లెట్ బండెక్కి పాట తరువాత ఆ రేంజులో జనం గంతులేస్తూ పాడుకునే పాట మరొకటి రాలేదు… దసరా సినిమాలో కీర్తిసురేష్ డాన్స్ చేసిన బ్యాండ్ మ్యూజిక్ హిట్… అదే సినిమాలో చమ్కీల అంగీలేసి కూడా హిట్… అనేక మంది ఆ డాన్స్ చేస్తూ షార్ట్స్, రీల్స్ పెడుతున్నారు ఇంకా… వీటిలో బ్యాండ్ మ్యూజిక్ డాన్స్ అందరూ చేయలేరు, చమ్కీల అంగీలేసి సాహిత్యం బాగున్నా ట్యూన్ చరణాల్లోకి వచ్చేసరికి గందరగోళం చేశారు… అందుకని మళ్లీ కొంతమంది ఆ పాత బుల్లెట్ సాంగ్ చేయడం మొదలెట్టారు…
నిజానికి శ్రీలీల డాన్సిన పల్సర్ బైక్, దండకడియాల్, జింతాక్ పాటలు కూడా మార్కెట్‌లో పెద్ద హిట్టే… కానీ శ్రీలీల రేంజులో డాన్స్ చేతకాక ఎవరూ ఆ పాటల షార్ట్స్ జోలికి పోవడం లేదు… సో, షార్ట్స్, రీల్స్ మేకర్స్‌కు ఈజీగా చేయదగిన పాట ఉరుములా రమ్మంటినే… సరళమైన పదాలు, మంచి బీట్, మనకు తోచిన డాన్స్ చేసుకోవచ్చు… అందుకే హఠాత్తుగా ఆ వీడియో బిట్లు ఎక్కువగా కనిపిస్తున్నయ్… ఈ పాటకు కాపీ వీడియోలు కూడా లక్షల్లో వ్యూస్ సంపాదించినయ్…
సంగీత్ కార్యక్రమాలు కాదు… అదంటే డాన్సుల్లో శిక్షణ, రికార్డింగ్ డాన్సులు మన్నూమశానం… కానీ మంగళస్నానాలు, ఎంగేజ్‌మెంట్, పెళ్లి వేడుకల సందర్భంగా పిల్లలు, మహిళలు, మగపురుష్ కూడా కాసేపు సరదాగా కొన్ని హిట్ పాటలకు పదం కలుపుతున్నారు… రీసెంట్‌గా అందరూ బాగా ఆసక్తి చూపిస్తున్న పాటల్లో చమ్కీల అంగీలేసి, ఉరుమల రమ్మంటినే, నీ బుల్లెట్ బండెక్కి ఎక్కువగా వినిపిస్తున్నయ్, కనిపిస్తున్నయ్… గుడ్… బలగంలో పొట్టి పిల్ల పాట కూడా రీల్స్, షార్ట్స్ లో హిట్… ఇగ చెప్పుకుంట పోతే ఒడవదు… ఇప్పటికి సెలవు… ఉరుముల పాట పూర్తిగా ఇదుగో…
ఉరుముల రమ్మంటినే మెరుపుల రమ్మంటినే
ఉరుముల్లా మెరుపుల్లా నిన్నే రమ్మంటినే
ఓ బావో, ఓ బావో సూసి పొమ్మంటినే
నా బావో ఎంట తీసుకపొమ్మంటినే
సినుకై రమ్మంటినే… తనువే తాకంటినే
సినుకై రమ్మంటినే… తనువే తాకంటినే
తొలుసూరి మొలకల్లే ముస్తాబైతుంటినే
కడపల కూసుంటినే… కనులు మూసుకుంటినే
కడపల కూసుంటినే… కనులు మూసుకుంటినే
కలలోనైనా నిన్ను కలిసిపొమ్మంటినే
అలుకలు మానంటినే… సిలుకై రమ్మంటినే
అలుకలు మానంటినే… సిలుకై రమ్మంటినే
ఎంగిలి జెయ్యని జామై ఎదురుసూస్తుంటినే
మాటకు సై అంటినే… ఆశగా కూసుంటినే
మాటకు సై అంటినే… ఆశగా కూసుంటినే
నీ ఊసులు తలుసుకుంటు… గోసల నేనుంటినే
Share this Article