Gurram Seetaramulu……. బంగారు తెలంగాణలో సిగ్గు బిళ్ళలు అయిన చీరెలు… ఈమధ్య ఊరిలో ఒక సర్వే చేశా, ప్రతి దసరాకి ప్రభుత్వం ఇస్తున్న బతుకమ్మ చీరలు ఎంతమంది కట్టుకుంటున్నారు అని… ఏదో సందర్భంగా మా మేనకోడళ్లు ఇంటికి వస్తే… అమ్మా, ఇంట్లో బతుకమ్మ చీరలు ఉన్నాయి తీసుకుపోవే అని అడిగా…
వద్దు అనకపోగా, నన్ను తిట్టినంత పనిచేసింది. అమ్మను అడిగితే ఏవో పెట్టుడు చీరెలు తేరా అని చెప్పింది. వాస్తవానికి రేట్ లో నాణ్యతలో నేను తెచ్చిన చీరెలకన్నా బతకమ్మ చీరెలు నాణ్యమైనవి కానీ బిచ్చపోల్లు కూడా కట్టుకోరు, అవ్విటివి కట్టుకోవాలా అని అన్నది మా కోడలు. అకడమిక్ ఇంట్రెస్ట్ తో ఆ చీరల మీద ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో తెలిస్తే దిమ్మ దిరిగి పోయింది.
దళిత, బహుజన, అగ్రవర్ణ… అన్ని కులాల వాళ్ళనూ అడిగా, చినిగిపోయిన పాత చీరె అయినా కట్టుకుంటాం గానీ అలగాజనాలకూ మాకూ కలిపి ఒకే చీరె ఇస్తే మా ఆయన ఊకుంటడా అన్నది ఒక పెద్దింటామె.
Ads
మా ఊరిలో పొలాలకు మిరప చేలకు చుట్టూ ఆ చీరెలు అడ్డుగా కట్టుకుంటున్నారు. ఏదో ఒక పనికి ఉపయోగ పడుతున్నాయిలే అనుకునే వాణ్ని. నిజానికి ఇది ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ గా రాయదగ్గ అంశం. మొత్తానికి తెలంగాణ వచ్చాక చీరకు రేషన్ బియ్యానికి పూచిక పుల్లకు ఉన్న విలువ కూడా లేదు అని అర్ధం అయ్యింది.
రెండు లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్ట్ లు కట్టినా, సన్న బియ్యం కిలో డెబ్భై ఎనభై రూపాయలు అయ్యింది. సిమెంట్ కట్ట నాలుగు వందలు. తెలంగాణ వచ్చాక జనాలలో కొలుగోలు శక్తి పెరిగింది కాబట్టే బియ్యానికి అంత రేటు, అది కాళేశ్వరం మహిమ అంటారేమో. నిన్న పేపర్ లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో ఒక ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాలలో ఆడపిల్లలు కాలు మడుసుకోటానికి బాత్ రూమ్ లేకుంటే, ఒక తడక చాటు చేసుకుని, దాని మీద చుట్టూ నాలుగు చీరలు అడ్డుపెట్టుకుని, తమ సిగ్గును దాచుకుంటున్నారు అని పేపర్ లో చూసా.
సిగ్గేసింది. సిగ్గులేని పాలన ఉన్నచోట సిగ్గుకు సిగ్గు బిళ్ళ కట్టే తెంపరితనం ఉన్న పాలకులు ఉన్నచోట సిగ్గుకు చోటెక్కడ ? కొంచం పరిశీలనగా చూస్తే అవి బతకమ్మ చీరెలు అనిపించింది. ఒక బాత్ రూమ్ కట్టడానికి ఇరవై వేల రూపాయలు సరిపోతాయి. ఒక లక్ష పెడితే నాలుగు గదులు కట్టి ఆడబిడ్డలకు ఆలంబన అవొచ్చు. ఈ బంగారు తెలంగాణలో చత్తీస్ ఘర్ కు ఆనుకుని మానవ నాగరికతకు ఆవల ఉన్న కాటారంలో ఉన్నవాళ్లు కూడా మనుషులే…
అక్కడొక అధ్యాపకుడు ఉంటాడు. ప్రిన్సిపాల్, పనికి మాలిన అధికారులు అంతా ఉంటారు. మరి ఆడపిల్లలు చీరెలు అడ్డుపెట్టుకుని తమ పరువుని కాపాడుకుంటుంటే పరువు గల్ల తెలంగాణ పాలకులు ఏం చేస్తున్నట్టు? ప్రగతి భవన్ లో బాత్ రూమ్ లకు పెట్టిన కోట్ల రూపాయల గురించి ఎవరో రాశారు. ఆత్మ గౌరవ పునాదిగానే తెలంగాణ వచ్చింది. ఈ పేపర్ వాడు ఇదేంటి ఇలా రాసాడు ?
బంగారు తెలంగాణలో చింపి చీరెలు ఏం ఖర్మ, బాత్రూమ్ లో అవసరం అయితే బంగారు తాపడం రేపే ఏర్పాటు చేస్తారు. మనకే సిగ్గు లేదు, అందాకా చీరె సారె ఇచ్చాం, ఇదేవరి తెలంగాణ ? మనింట్లో ముచ్చటగా మన పట్టు చీరె కట్టుకోక బిచ్చపోడు మనకి చెప్పాలా ?
అయినా చీరె వంటి మీద కట్టుకుంటే ఏమిటి, తడక లాగా కట్టుకునే దానికి కాదువయా… చీరె సారె ఇచ్చింది ఎందుకు ? ఇంటి గుట్టు బయట వేస్తారు ? ఆ కాటారం ఆడ పోరగాళ్ళు చీరెలతో సిగ్గు బయటేసుకుంటారు ? ఇదేంది వయ… బంగారు తెలంగాణలో ఇదేం ఇలవరస ? ఏం రాహుల్, ఇది నమ్మొచ్చా ? జర నువ్వయినా చెప్పు !!
Share this Article