పుదుచ్చేరిలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ మర్డర్ చేసింది అని ఓ లెఫ్ట్ పత్రిక ఒకేరోజు నాలుగు వ్యాసాలు, ఓ సంపాదకీయం, ఫస్ట్ పేజీ బ్యానర్ రాసింది… పత్రికల నిండా వార్తలు… చర్చలు, విశ్లేషణలు గట్రా… అప్పటికిప్పుడు మోడీ ప్రభుత్వం అక్కడ ఇన్నేళ్లుగా ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని పీకిపారేసి, తెలంగాణ గవర్నర్ తమిళిసైకి అదనపు పగ్గాలు ఇచ్చింది… ఎమ్మెల్యేలను తనవైపు లాగిపారేసింది… ఆ ముఖ్యమంత్రి వేరే దిక్కులేక, బలనిరూపణ చేసుకోలేక, రాజీనామా చేశాడు… హహహ… అసలు రెండు నెలల్లో ఎన్నికలుండగా పాత ప్రభుత్వాన్ని కూల్చేయడమే ఓ దండుగ వ్యవహారం… ఇప్పుడు కూడా రాష్ట్రపతిపాలన పెట్టేస్తే బెటర్, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నిస్తే అదో దండుగ వ్యవహారం… కాస్త భిన్నంగా చూద్దాం… హైదరాబాదులో మల్కాజ్గిరి లోకసభ నియోజకవర్గం వోటర్ల సంఖ్య 31 లక్షల పైచిలుకు… జనాభా అరకోటి… కానీ ఈ పుదుచ్చేరి అనే ప్రత్యేక రాష్ట్రం జనాభాయే 14 లక్షలు… వోటర్ల సంఖ్య 9.7 లక్షలు… ఓ ప్రత్యేక రాష్ట్రం, ప్రభుత్వం, మంత్రులు, వేరే వ్యవస్థ… పైగా దీనికి ఇన్ని రాజకీయాలు, ఎత్తుగడలు, హంగామా… శుద్ధ దండుగ యవ్వారం… అదీ సగం సగం అధికారాలున్న రాష్ట్రం… అసలు పెత్తనమంతా కేంద్రం నియమించే లెఫ్టినెంట్ గవర్నర్దే…
ఫ్రెంచి పెత్తనం కింద ఈ ప్రాంతం మన దేశంలో విలీనమైంది మనకు స్వాతంత్య్రం వచ్చాక ఐదేళ్లకు… అంటే 1952లో… అదీ 1962 వరకు అధికారికంగా విలీనం జరగలేదు… అప్పటి నుంచి కేంద్ర పాలిత ప్రాంతంగా పరిగణించాం, అదేమైనా ఒక్కచోట ఉన్న ఏకఖండమా అంటే అదీ కాదు… గతంలో పాండిచ్చేరిగా పిలవబడిన పుదుచ్చేరి సిటీ ప్రధాన భూభాగం… అదే రాజధాని… తమిళనాడులో అంతర్భాగం అన్నట్టుగా ఉంటుంది… అదే తమిళనాడులో వేరేచోట ఉన్న కరైకల్ అనే మరో ముక్క కూడా ఈ పుదుచ్చేరి రాష్ట్రంలో భాగం… ఆంధ్రప్రదేశ్‌లో ఉండే యానాం అనే మరో ముక్క… కేరళలో ఉండే మాహె మరో అంతర్భాగం… ఇది పుదుచ్చేరికి ఎంత దూరమో మీరే అర్థం చేసుకొండి… దూరదూరంగా ఉండే ఈ నాలుగు ముక్కలు ఒక పరిపాలన యూనిట్…! యానాంను ఏపీలో, మాహేను కేరళలో, మిగతావి తమిళనాడులో కలిపేస్తే సరిపోయేది అని ఎప్పుడైనా అనిపించిందా..? ఈ సపరేట్ రాజకీయాధికార వ్యవస్థ అవసరమా..?
Ads
ఇండియన్ యూనియన్ మెల్లిమెల్లిగా కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటూ, విలీనం చేసుకుంటూ పోయింది… కేంద్రపాలిత ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వమే పాలన వ్యవహారాలను చూసేది… ఆయా ప్రాంతాల విలీన ఒప్పందాలు, స్వయంపాలన, స్థానికుల మనోభావాలు తదితరాంశాల కోణంలో నాగాలాండ్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ వంటి ఈశాన్య రాష్ట్రాల తరహాలో పూర్తి స్థాయి అధికారాలున్న వ్యవస్థల్ని, రాష్ట్రాల్ని ఇస్తే సరిపోయేది… కానీ అటూఇటూ కాని అధికారాలున్న రాష్ట్రం చేశారు పుదుచ్చేరిని… హస్తిన మనకు మొదటి నుంచీ మనకు రాజధానే కదా, దానికి ఏ విలీన ఒప్పందాలూ, షరతులూ లేవు కదా… దాన్ని కూడా అలాగే కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచేస్తే పోయేది… అదీ సగం సగం అధికారాలున్న రాష్ట్రంగా చేశారు… ఒక అండమాన్, ఒక లక్షద్వీప్ కథ వేరు… అవి రక్షణపరంగా వ్యూహాత్మక, కీలక ప్రాంతాలు… కానీ డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ ఆయా సమీప రాష్ట్రాల్లో కలిపేస్తే సరిపోయేది కదా… ఢిల్లీ, పుదుచ్చేరి ప్రత్యేక రాష్ట్రాలు అవసరమా అనేది ఓ డిబేటబుల్ ప్రశ్నే… తాజాగా లడఖ్ కొత్త కేంద్ర పాలిత ప్రాంతం… జమ్ము-కాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం… మళ్లీ ఇక్కడ వేరే స్ట్రాటజీ… ఎటొచ్చీ ఏ అధికారాలూ సరిగ్గా లేని మరీ చిన్న చిన్న రాష్ట్రాలు, వాటి ప్రభుత్వాలు, వ్యవస్థలు, వాటి ఖర్చు భారం, ఆ రాజకీయాలు, అస్థిరత అవసరమా అనేదే కీలకమైన ప్రశ్న, ప్రస్తుతానికి జవాబు లేని ప్రశ్న…!!
Share this Article