ఎవడి బాధ వాడిది… ఒకవైపు చూస్తే కేజీఎఫ్-2 దుమ్మురేపుతోంది… ఎవడెంత ఏడ్చినా సరే, ఇప్పుడప్పుడే దాని వసూళ్లు తగ్గే సీన్ కనిపించడం లేదు… సమీపంలో దానికి బలమైన పోటీ కూడా లేదు… కానీ దాని ఆధారంగా తమను తాము ప్రమోట్ చేసుకునేవాళ్లు, ప్రచారం చేసుకునేవాళ్లు ఎవరూ కనిపించడం లేదబ్బా అనే డౌట్ వచ్చింది… సాధారణంగా ఆ బలమైన హిట్‌ను తమకు అనుకూలంగా వాడుకునేవాళ్లు ఉంటారుగా… ఉండాలిగా… హమ్మయ్య, ఒకరు కనిపించారు…
ఓ ప్రెస్‌నోట్ కనిపించింది… ఆ వాణిజ్య, కృత్రిమ, నిర్జీవ, శుష్క భాష అందరికీ అర్థం కాదు కాబట్టి… మన భాషలోనే సారాంశం ఏమిటో చెప్పుకుందాం… సంక్షిప్తంగానే… కేజీఎఫ్-2లో పార్లమెంటు సెట్ ఉంటుంది… రాఖీ భాయ్ అలా వెళ్లి ఎవడినో అలవోకగా ఖతం చేసి వస్తాడు తెలుసు కదా… మరీ నవ్వులాటగా అనిపించి దర్శకుడిపై ఒకింత జాలి కూడా కలిగే సీన్ అది… సదరు సెట్ రామోజీ ఫిలిమ్ సిటీలో వేశారట…
సరే, వేశారులే… అందులో విశేషం ఏముంది అంటారా..? పూణెలో ఎకో యూ అని ఓ సంస్థ ఉందట… అది బిల్డింగ్ మెటీరియల్స్ ఉత్పత్తులను తయారు చేస్తుందట… వాటిల్లో ఎకో బోర్డ్ కూడా ఒకటి… సదరు ఎకో బోర్డ్ విశేషమేమిటయ్యా అంటే… చెక్క, మెటల్, కాంక్రీట్ ఎట్సెట్రా గాకుండా వ్యవసాయ వ్యర్థాలతో తయారు చేస్తారట… సో, వాట్..? అయితే ఏమిటట..!
Ads
ఇది పర్యావరణ హితం అన్నమాట… సాధారణంగా రైతులు తమ వ్యవసాయ వ్యర్థాలను పొలాల్లోనే తగులబెడుతుంటారు… అది పర్యావరణ ఇబ్బందికరం… కానీ వాటిని సేకరించి ఇలా ఎకో బోర్డులు తయారు చేయడం వల్ల ఇలా తగులబెట్టడాన్ని నిరోధించినట్టు ప్లస్ రైతులకు కొంత అదనపు ఆదాయం కూడా వస్తున్నదన్నమాట… కేజీఎఫ్ కళాదర్శకత్వ విభాగం ఈ ఎకో బోర్డులను ఎంపిక చేసుకుని, పార్లమెంటు సెట్ వేసిందట…
ఇకపై తను వేసే ప్రతి సెట్‌నూ ఇలాంటి పర్యావరణ హితమైన ఎకో బోర్డులతో వేస్తానని కళాదర్శకుడు తెలప్రోలు శ్రీనివాసరావు ఓ ప్రెస్‌నోటీ జారీ చేశాడట… ఇదండీ దాని సారాంశం.. పనిలోపనిగా సదరు ఎకో బోర్డు ఉత్పత్తి ఆహా, ఓహో, మస్త్ వింటేజ్ ఫినిషింగ్ ఉంటుందని కాస్త డప్పు కూడా కొట్టాడు… అది వేరే సంగతి… ఇది అవసరాలకు తగినట్టు వొంగుతుందట ప్లస్ ఫైర్ ప్రొటెక్షన్ బాగుంటుందట… ఈ పార్లమెంటు సెట్‌కు తమ ఎకో బోర్డులను వాడటం వల్ల కనీసం 100 చెట్లను కొట్టకుండా కాపాడగలిగినట్టు కూడా సదరు కంపెనీ డైరెక్టర్ ఏదో చెప్పాడట…
సరే, వాణిజ్య ప్రకటనలు అలాగే ఉంటాయి… సహజమే… కానీ సదరు పార్లమెంటు సెట్‌కు ఈ ఎకో బోర్డులు వాడటం వల్ల 100 చెట్లను సంరక్షించినట్టు లెక్క వేయడం నవ్వొచ్చింది… అంతేకాదు, రైతులు వ్యవసాయ వ్యర్థాల్ని తగులబెట్టడం ద్వారా గాలిలోకి వదిలే కనీసం 20 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్‌ను నిరోధించినట్టు అయ్యిందట… ప్లస్ టన్నుకు 3 వేల మేరకు రైతులు సంపాదించారట…
ఇంకా నయం… కార్బన్ క్రెడిట్స్ కింద తమకు డబ్బు ఎంత వస్తుందో లెక్క చెప్పలేదు… అవును గానీ సార్… ఇప్పుడు ఆ పార్లమెంటు సెట్‌కు వాడిన ఆ బోర్డుల్ని ఏం చేశారు..? లేదా ఏం చేస్తారు..? మరో సెట్‌కు వాడతారా..? పనికొస్తాయా..? లేక మళ్లీ పూణె నుంచి ఇంకా తెప్పించాలా..? ఈ సెట్ వ్యర్థాలను ఏం చేయాలి..? వాటిని అలా గాలికి పారేస్తారా రామోజీ ఫిలిమ్ సిటీలో..? లేక తగులబెడతారా..? మరి అప్పుడు విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్ మాటేమిటి..? అది కూడా చెప్పేస్తే ఓ పనైపోయేది…!!
Share this Article