హీరో అంటే ఎవరు..? కలల్ని కనేవాడు, ఆ కలల్ని సాధించేవాడు… మన తెలుగు హీరోల్లా ఆర్టిఫిషియాలిటీ కాదు… ఈయన పేరు రాతూరి దేవ్… వయస్సు 46 ఏళ్లు… ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తెహ్రి గర్వాల్ జిల్లాలోని కేమ్రియా సౌర్ అనే మారుమూల ఓ కుగ్రామంలో… పర్వతగ్రామంలో పుట్టాడు… అది ప్రకృతి ఒడి…
తండ్రి ఓ రైతు… దేవ్‌కు చిన్నప్పటి నుంచీ సాహసాల మీద, స్టార్‌డమ్ మీద ఇష్టం… అవే కలలు కనేవాడు… కానీ నెరవేరేదెలా..? బ్రూస్‌లీకి డైహార్డ్ ఫ్యాన్.., తన అడుగుజాడల్లోనే తనలాగే ఎదిగిపోవాలని కోరిక… ఓసారి ముంబై వెళ్లాడు, సినిమాల్లో చాన్సుల కోసం ప్రయత్నించాడు… అక్కడ తనలాగే వేల మంది… నిండీనిండని కడుపులతో స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఆశలు చావక అనేకమంది…
దేవ్ వారిలో ఒకడు… అన్ని ప్రయత్నాలూ ఫెయిల్… బాలీవుడ్ ఇలాంటి ఆశావహుల్ని పురుగుల్లాగే చూస్తుంది… ఇక ఇక్కడ వర్కవుట్ కాదని తేల్చుకుని, అక్కడే ఆ వీథులనే పట్టుకుని వేలాడలేదు… ఏదైతే అదైంది… కొత్త మార్గం కావాలి… 2005లో చైనా వైపు అడుగులేశాడు… మన ముంబైలో కానిది, మనమంటే శత్రుభావమున్న ఆ చైనీస్ ‘లిమిటెడ్, క్లోజ్డ్’ వాతావరణంలో సాధించేదేముంది అనుకోలేదు…
Ads
అవును, ఎక్కడ ఎవరికి ఏ భవిష్యత్తు రాసి ఉందో ఎవరికి తెలుసు… అక్కడి కల్చర్ తెలియదు, ఆ భాష రాదు… ఓ వెయిటర్‌లా జీవితాన్ని ప్రారంభించాడు… కడుపు నిండుతోంది… బాగానే ఉంది… కానీ అలా ఎన్నాళ్లు..? మాండరిన్ కూడా రెండేళ్లలో ఫుల్లు నేర్చేసుకున్నాడు… మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకోవాలని అనుకున్నాడు… బ్రూస్‌లీ కావాలంటే మార్షల్ ఆర్ట్స్ రాకపోతే ఎలా..? కానీ జేబులో డబ్బుల్లేవ్… నేర్పేవాడూ లేడు…
త్వరలోనే వెయిటర్ జాబ్ నుంచి మేనేజర్ అయ్యాడు… నాలుగు పైసలు సమకూరగానే ఓ రెస్టారెంట్ ఓపెన్ చేశాడు… డబ్బు వస్తోంది… మేజర్ చైనీస్ నగరాల్లో బ్రాంచులు ఓపెన్ చేశాడు… ఇప్పుడు ధనికుడు తను… చేతి నిండా డబ్బు… సినిమా కల ఎక్కడో మనస్సు లోతుల్లోకి జారిపోయింది…
ఒకసారి ఓ చైనీస్ నిర్మాత దేవ్ రెస్టారెంట్‌కు వచ్చాడు… తనకు ఓ మంచి లొకేషన్ కావాలని వెతుకుతున్నాడు… అలాగే తను తీయబోయే ఒక లోబడ్జెట్ మూవీకి యాక్టర్లను కూడా వెతుకుతున్నాడు… అదీ ఆన్‌లైన్ మూవీ… థియేటర్ మూవీ కాదు… ఏమోయ్, మా సినిమాలో చేస్తావా అన్నాడు ఆ నిర్మాత చనువు తీసుకుని… వై నాట్, మీదే ఆలస్యం అన్నాడు దేవ్…
హీరో కాదు, చిన్న రోల్… అదీ నెెగెటివ్ రోల్… ఐతేనేం, అలా చైనా ఫిలిమ్ ఇండస్ట్రీలోకి అడుగుమోపాడు… ఆగలేదు… ఒకదాని వెంట మరొకటి రోల్స్ వస్తున్నాయి… తనకు మెరిట్ ఉంది, వైవిధ్యమైన పాత్రలు వస్తున్నాయి… కెరీర్ వెలిగిపోతోంది… రెస్టారెంట్లను మేనేజర్లకు అప్పగించాడు… షూటింగ్, షూటింగ్, షూటింగ్… రోజూ అదే బిజీ…
చైనా ప్రేక్షకులు కూడా ఆదరించారు… తన భారతీయత తనకేమీ అడ్డంకి కాలేదు… అంతేకాదు, పిల్లలు తన స్పూర్తిగా తీసుకుంటున్నారు… తన ప్రతిభ, తన పయనం వెండితెరను కూడా దాటేసి ఏకంగా పాఠ్యపుస్తకాల్లోకి ఎక్కింది… నిజం… చైనా పాఠ్యపుస్తకాల్లో ఓ ఇండియన్… జియాన్ సిటీలో ఏడో తరగతి పాఠ్యపుస్తకాల్లో రాతూరి దేవ్ పాఠమూ పొందుపరచబడింది… సో, బలమైన కలలకు హార్డ్ వర్కే ఆలంబన… దేశాలు, సాంస్కృతిక సరిహద్దులు ఏవీ ఆపలేవు… దేవ్ ప్రస్థానమే ఓ పక్కా ఉదాహరణ…
Share this Article