అంతా బాగానే ఉంది కదా, మరో రెండు కన్నీళ్లు కార్చుతూ మరో వీడియో ఏమైనా రిలీజ్ చేద్దామా..?
వద్దు సార్, వేక్సిన్ పాలసీ మీద జనం బండబూతులు తిడుతున్నారు, అదేమైనా కౌంటర్ చేయగలమా..?
వద్దు, వద్దు… జనాన్ని మభ్యపెట్టే పోస్టులు, వీడియోలు కావాలి, అంతే… మన ఎల్లా కృష్ణ, మన పూనావాలా… వ్యతిరేకంగా పోలేం…
Ads
ఎందుకు సార్…
చెప్పింది చేయండ్రా ఇడియట్స్… కొత్త కంపెనీలు రావద్దు, కొత్త వేక్సిన్లు రావద్దు… మన భారత్ బయోటెక్కుడు, మన పూనావాలుడు బాగుండాలె…
కానీ జనం తిట్టిపోస్తున్నారు…
పిచ్చిజనం, తెరవెనుక ఏం జరిగిందో వాళ్లకెందుకు…
కానీ…
నేను చెప్పిందే ఫైనల్, సర్కారులో ఎవడూ మాట్లాడొద్దు, వాళ్ల ధర వాళ్లిష్టం… కుమ్ముకోనీ… పెట్టిన పెట్టుబడికి లాభం ఆశించరా ఏం..? వ్యాపారం అది… మనం అడ్డు తగలొద్దు, పోతేపోనీ, ఓ లక్ష ప్రాణాలు పోతయ్, అంతేగా…
ఈ రెయిన్ బో ఫంగస్ తల్నొప్పి..?
రానీ, రానీ… ఆ ఫార్మా కంపెనీలనూ లైన్లో పెట్టండి…
వాడెవడో ఆనందయ్యట…
తొక్కేయండి, మందును చంపేయండి, జగన్‌కు ఫోన్ కలిపి ఇవ్వండి, మాట్లాడతా…
సెకండ్ డోస్ దొరకదు, విదేశీ కంపెనీలు మీతో తప్ప స్టేల్ సీఎంలతో డీల్ చేయవట… తిడుతున్నారు బాస్…
పోతేపోనీ పోరా… పేరుకు అంతా రాష్ట్రాల ఇష్టం అందాం, ఎవడైనా సప్లయ్‌కి ముందుకొస్తే చెప్పు…
సార్, అన్యాయం సార్, లత్త కొడుతుంది సార్…
పిచ్చోడా… నాకు తెలియని మార్గమా ఇది..?
మంచి నిర్ణయాలు తీసుకుంటే, ప్రపంచవ్యాప్తంగా మంచి పేరొస్తుంది కదా సార్… మనిషిగా జీవనసార్థకత కూడా ముఖ్యమే కదా సార్…
ఎవడ్రా అక్కడ…? వీడిని డిస్మిస్ చేస్తున్నాను, బయటికి తీసుకెళ్లండి…
వోకే సార్…
రాజకీయమంటేనే దుర్మార్గం… ఎన్ని వేల శవాల మీదుగా నడిస్తే సుస్థిర రాజ్యం స్థాపించగలం… ఆ ట్విట్టర్ వాడిని మూసేయండి… మీడియాను కంట్రోల్ చేయండి, నెమళ్లు రెడీయా…? ఫోటోషూట్ ఆరంభిద్దామా..?
………. ఇదంతా మోడీ వ్యతిరేక మీడియా ప్రచారం అనే కదా మీ భావన…. కాదు, సగటు భారతీయుడి ఆత్మవేదన… గమనించండి, హస్తినలో వేక్సిన్ల మీద ఎవరూ మాట్లాడరు… ఎవడి రేట్లు వానివి… ఎవడి పాలసీ వాడిది… ప్రభుత్వ సంస్థల్ని వాడుకుని వేక్సిన్ తయారీ చేసిన భారత్ బయోటెక్ వాడు కూడా ఎవడికీ టెక్నాలజీ ఇవ్వను అంటాడు… శివసేన, వైసీపీ కాదు, చివరకు ఏ గడ్డ మీద వేక్సిన్ ఉత్పత్తి జరుగుతుందో ఆ తెలంగాణ ప్రభుత్వం కూడా మాట్లాడదు… గ్లోబల్ టెండర్లు అంటారు, మీ కేంద్రాన్ని కాదని ఒక్క వయల్ కూడా ఇవ్వం అంటాయి విదేశీ కంపెనీలు… ఫస్ట్ డోస్ మాత్రమే సెకండ్ డోస్ లేదు, అదేమంటే స్టాక్ లేదు… మరి స్టాక్ లేనిది ఫస్ట్ డోస్ ప్లానింగ్ ఏమిట్రా అంటే ఎవడూ జవాబివ్వడు… ప్రైవేటులో అమ్ముకొండి అంటారు, కోవిన్ యాప్ అంటారు, అది పనిచేయదు…
ప్రభుత్వ వేక్సిన్ తయారీ కంపెనీలున్నయ్, ల్యాబులున్నయ్…. పనిచేయవ్… మన ప్రభుత్వ సంస్థలు కార్పొరేటు పాదాల మీద పాకుతూ ఉన్నయ్… టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తే, వారం రోజుల్లో వేక్సిన్ ఉత్పత్తి చేస్తయ్, చేయనివ్వరు, చేయడానికి అనుమతించరు, పాలసీ ఉండదు… 18 నుంచి 44 ఏళ్ల వారికీ వేక్సిన్ అంటారు… రాష్ట్రాల ఇష్టం అంటారు, అసలు రాష్ట్రాల దగ్గర వేక్సిన్ ఉంటే కదా… అదేమంటే ఒక్కడూ జవాబిచ్చేవాడు దొరకడు… పైగా పిల్లలకు డోసులు, బూస్టర్ డోసుల పేరిట లక్షల కోట్ల దందాకు మార్గాలు వేస్తున్నారు… కోవిడ్ చికిత్సకు ఓ శాస్త్రీయ ప్రోటోకాల్ ఖరారు చేయని దరిద్రం పుణ్యమాని వైట్, బ్లాక్, యెల్లో ఫంగసులు… ఇంకేం వస్తాయో, ఇంకేం మింగుతాయో తెలియదు… ఓ డ్రగ్ పాలసీ లేదు, ఓ వేక్సిన్ పాలనీ లేదు, ఓ కరోనా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ లేదు… లిటరల్లీ స్టాండ్ స్టిల్… దుర్మార్గమైన నిశ్శబ్దం, స్తబ్దత… ఇవన్నీ నిజాలు… శ్మశానాల్లో కాలిపోతున్న వందలు, వేల శవాల సాక్షిగా నిజాలు… ఎవడు అంగీకరించకపోయినా కనిపించే నిజాలు…
చివరకు ఐవర్‌మెక్టిన్ వంటి పశుచికిత్స డ్రగ్ కూడా రెండుమూడు రెట్ల ధర పెరిగింది… ఎవడిష్టం వాడు… కంట్రోల్ లేదు, అసలు పాలన లేదు… ఎవడెంత దోపిడీ చేసుకుంటే వాడి సత్తా… అంతే… మరి ఇదంతా మోడీ సర్కారు వైఫల్యమా..? అరాచకమా..? అసమర్థతా..? పేరు ఏదయితేనేం..? వేలాదిగా ప్రజల ఉసురు పోసుకుంటున్నది ఎవరు..? ఓ దిక్కుమాలిన ప్రభువు… నిష్ఠురంగా ఉంది కదా… నిజానికి అదే నిజం…! ఒక ఆనందయ్య కరోనా మందుకు అడ్డుపడే నైచ్యానికీ, జాతీయ స్థాయిలో ఫార్మా సంపాదనలో వాటాలు వెతుక్కునే గుణానికీ పెద్దగా తేడా లేదు…! (కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన ఓ వాస్తవ క్షతగాత్రుడి ఆవేదన… ఖండిస్తాం, ట్రోల్ చేస్తాం అనేవాళ్లకూ…. కుటుంబాలున్నయ్, పిల్లలున్నారు… దేవుడున్నాడు… అన్నట్టూ ఓ క్లారిటీ…. మోడీ అంటేనే బీజేపీ, మోడీ అంటేనే ఆర్ఎస్ఎస్ కాదు… ఒక మోహన్ భాగవత్, ఒక బీకేఎస్, సుబ్రహ్మణ్యస్వామి వంటి ఎంపీలు మోడీ పాలసీలను ఖండిస్తున్నారంటే దాని వెనుక ఎంత వేదన ఉందో, ఏ మథనం ఉందో అర్థం చేసుకోవాలి…) మరి రాష్ట్ర ప్రభుత్వాలకు, ముఖ్యమంత్రులకు బాధ్యత లేదా అంటారా..? హెల్త్ ఎమర్జెన్సీ పెట్టి, మొత్తం అధికారాల్ని తీసుకుని, జనానికి మంచి చేసే ఒక్క నిర్ణయం తీసుకో… ముఖ్యమంత్రులూ రాజకీయ నాయకులే కదా… శుద్దపూసలా..? సమర్థులా..? ఈ ఉసురు తీసుకునే పాపాల్లో ఎవరి వాటా వాళ్లదే…!!
Share this Article