ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ మీద ప్రసారమైన తెలుగు ఇండియన్ ఐడల్ షో ఫస్ట్ సీజన్‌లో సింగర్ వాగ్దేవి విజేతగా నిలిచిందనీ, ఫినాలేకు చీఫ్ గెస్టుగా వచ్చిన చిరంజీవి చేతులు మీదుగా ట్రోఫీ అందుకుందనీ రెండుమూడు రోజులుగా కొన్ని సైట్లలో, యూట్యూబ్ చానెళ్లలో వార్తలు వస్తూనే ఉన్నాయి… బహుమతి ప్రదానం సందర్భంగా వాగ్దేవి తండ్రి ఎలా ఎమోషనల్ అయ్యాడో, ఏమని మాట్లాడాడో కూడా రాసేశాయి… అయితే హఠాత్తుగా ఎన్టీవీ, దిశ వంటి సైట్లలో ఆ వార్తను తీసేశారు…
ముందే విజేత పేరు తెలిస్తే ప్రోగ్రాం మీద ఆసక్తి పోతుందని సదరు ఓటీటీ వాళ్లు అడిగితే డిలిట్ కొట్టేశారో.., లేక కన్‌ఫరమ్ కాని న్యూస్ కాబట్టి, అబద్ధం అయితే పరువు పోతుందనుకుని వీళ్లే డిలిట్ కొట్టేశారో తెలియదు… సరే, వాళ్ల బాధ వాళ్లది… వాగ్దేవి విజేత కావడానికి అర్హురాలే… నెల్లూరుకు చెందిన వాగ్దేవి బీఆర్క్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్… అక్కతో కలిసి పోటీలకు వచ్చింది… లక్కీగా తనకే చాన్స్ దక్కింది…
చిన్నప్పుడు పాడతా తీయగా ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ చేసింది… ‘‘అలై పొంగెరా’’ అనే అరుదైన పాటతో జడ్జిలను ఆకట్టుకుంది… ఆ పాట గురించి మనం ఆల్‌రెడీ చెప్పుకున్నాం ఓసారి… యూనిక్ కంఠస్వరం, వాయిస్ కల్చర్ ఆమెకు ప్లస్ పాయింట్లనీ, ఇప్పటికే ఆమెతో పాడించడానికి మ్యూజిక్ డైరెక్టర్లు రెడీగా ఉన్నారనీ, టాలీవుడ్ మ్యూజిక్‌ను ఆమె ఏలుతుందనీ థమన్ పదే పదే ప్రశంసించాడు… సో, వాగ్దేవి గెలిచే చాన్సెస్ ఉన్నట్టు ఊహిస్తున్నదే…
Ads
అయితే తనతో పోల్చితే ఫైనలిస్టుల్లో ఉన్న ప్రణతి గానీ, వైష్ణవి గానీ ఏమీ తక్కువ కాదు… చాలా టఫ్ ఫైట్ ఇచ్చినట్టే… ప్రత్యేకించి వైష్ణవి సింగర్ కల్పన శిష్యురాలు… ఆల్‌రెడీ థమన్ క్యాంపులో బీమ్లానాయక్ సినిమా కోసం ఏదో బిట్ పాడింది కూడా…! ప్రయోగశీలి… పెద్దపల్లికి చెందిన జయంత్ గానీ, మరో సింగర్ శ్రీనివాస్ గానీ సమర్థులే… కాకపోతే పోటీ అన్నాక కాస్త తేడాలో ఎవరైనా గెలవొచ్చు, ఎవరైనా ఓడిపోవచ్చు…
ఆర్కెస్ట్రాలో సాయి, పవన్, ప్రత్యేకించి వయోలినిస్టు కామాక్షికి కూడా ప్రేక్షకుల అభినందనలు దక్కాయి… మొత్తానికి అయిదారుగురు గాయకుల్ని ఈ షో టాలీవుడ్‌కు అందించినట్టే… జీటీవీలో వచ్చే ‘‘సరిగమ’’ షో కూడా పర్లేదు… కానీ స్వరసరుకు తక్కువ, హంగామా ఎక్కువయిపోతోంది… మాటీవీలో వచ్చే షో జూనియర్స్ కంపిటీషన్… అదీ అంతే… అట్టహాసం భారీ, అసలు క్వాలిటీ ఖాళీ… ఈటీవీలో వచ్చే ‘‘పాడతా తీయగా’’ గురించి పెద్దగా చెప్పుకునే పని లేదు… గ్రాండ్ ఫినాలే నిర్వహించారు ఈమధ్య… నాలుగైదు రోజుల్లో జస్ట్ 4 లక్షల వ్యూస్ వచ్చాయి యూట్యూబ్‌లో… కానీ వీళ్ల ఆర్కెస్ట్రా మాత్రం అదుర్స్… ఈవిషయంలో ఈటీవీని అభినందించాల్సిందే… విజేత గాయత్రి టోన్, వాయిస్, మెరిట్ బాగున్నయ్…
హిందీ ఇండియన్ ఐడల్ షోలో షణ్ముఖప్రియను మొదటి నుంచీ మెచ్చుకునీ, మెచ్చుకునీ, ఎత్తుకుని, తీరా ఫినాలే వచ్చేసరికి ఢామ్మనిపించారు… వాగ్దేవిని కూడా ఇలాగే మెచ్చీ, మెచ్చీ, చివరకు ఏం చేస్తారోననే సందేహం ఉండేది… ఆమెకు మైనస్సులేవా అంటే… ఉన్నయ్… కీలకమైన శ్వాస నియంత్రణ ఉండటం లేదు..!! ఏమాటకామాట షో నిర్వాహకుల ప్లానింగ్ వెరీ పూర్… ఫినాలే కోసం వచ్చిన రానా, చిరంజీవిలను రెండు గంటలపాటు ఖాళీగా కూర్చోబెట్టారు… వాళ్లు విసిగి ఇళ్లకు వాపస్ వెళ్లిపోతే, మళ్లీ వెళ్లి, బతిమిలాడి పట్టుకొచ్చి, ఫినాలే నిర్వహించారు..!!
Share this Article