.
“పోస్టుమార్టం పూర్తయ్యింది..ఇక నువ్ నీ భర్త బాడీని తీసుకెళ్ళొచ్చు..”
ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో పోలీసులు చెప్పటంతో హతాశురాలయ్యింది ఆమె !
Ads
“చంపేశారు బాబూ.. పోలీసులే చంపేశారు..అయ్యా..ఇక నాకు..నా పిల్లలకు దిక్కేవరు..”హృదయ విధారకంగా రిక్షా కార్మికుడి శవం మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది ఆమె
“ముందు శవాన్ని త్వరగా ఇక్కడ్నించి తీసుకెళ్లు..ఎక్కువసేపు ఇక్కడుండకూడదు..”హడావుడి పెట్టారు పోలీసులు
అప్పటికి సమయం తెల్లవారి ఐదు గంటలు
వెలుగు రేఖలు భూమ్మీద ఇంకా పూర్తిగా పర్చుకోలేదు
పోలీసుల మాటకు కళ్ళు తుడుచుకుని తలపైకెత్తి చెప్పింది ఆమె ,
“తీసుకెళ్లను..అన్న వచ్చేదాకా శవాన్ని ఇక్కడ్నించి కదిలించేది లేదు..”దృడంగా చెప్పింది ఆమె
“ఎవరు మీ అన్న..?” పోలీసు ప్రశ్న
“రంగన్న” మెల్లిగా అన్న పేరు చెప్పింది ఆమె
అంతే ,
పక్కలో బాంబు పడ్డట్టు ఉలిక్కిపడ్డారు
వొళ్ళంతా ముచ్చెమటలు పోశాయి
“శవాన్ని త్వరగా ఇక్కడ్నించి తీసుకెళ్లకపోతే మేమె తరలించాల్సివుంటుంది..”హెచ్చరిస్తున్నట్టుగా చెప్పాడు పోలీసు
“అన్న బయలుదేరాడు..అన్న వచ్చేదాకా శవాన్ని అంగుళం కూడా కదిలించను..” మరింత ధృఢంగా చెప్పింది ఆమె
“ఎంతసేపట్లో వస్తాడు ఆయన..?”
“ఇప్పుడే హైద్రాబాదు నుంచి బయలుదేరాడు..వచ్చేస్తాడు..సరైన టైముకే వచ్చేస్తాడు..”
పోలీసుల గుండెల్లో రాయి పడింది
చిరుత అడుగుల చప్పుడు స్పష్టంగా వినపడుతున్నాయి
అతడు ఇక్కడికొచ్చేలోగా శవాన్ని దహనం చేసేయ్యాలి..ఆలస్యం చెయ్యకూడదు.. వెంటనే పై అధికారులకు సమాచారం అందించారు
అందిన సమాచారంతో సిటీ పోలీసులు అప్రమత్తం అయ్యారు
పైగా హోమ్ మినిష్టర్ కూడా నగరంలోనే ఉన్నారు
అసలే లాకప్ డెత్ కేసు
రచ్చ కాకముందే ఆధారాలు చెరిపెయ్యాలి
పోలీసుల్లో హడావుడి మొదలయ్యింది
ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసు వాహనాలు బారులు దీరాయి
విషయం తెలుసుకున్న కమ్యూనిస్టు నాయకులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు
ఆమెను ఓదార్చి అతడి అంత్యక్రియలు తాము జరిపిస్తామని చెప్పారు
అప్పుడు ఆమె చెప్పిన మాట ఒకటే ,
“అన్న వచ్చేదాకా శవాన్ని ఇక్కడ్నించి కదిలించేది లేదు..”
విషయం తెలుసుకున్న రిక్షా కార్మికులు తండోపతండాలుగా ఆసుపత్రికి చేరుకున్నారు
అందరి మాట ఒకటే ,
‘అన్న వచ్చేదాకా కదిలేది లేదని ,
పోలీసులు టెన్షన్తో తల పట్టుకున్నారు
అతడొచ్చేలోపు బలవంతంగా తరలిద్దామంటే వందలాది రిక్షా కార్మికులు గేటుకడ్డంగా కూచున్నారు
నిమిషాలు గంటలయ్యాయి
ఎవరూ అక్కడ్నించి కదలలేదు
ఇంతలో రోడ్డు మీద కలకలం మొదలయ్యింది
ఎవరో అరిచారు
“అన్న వచ్చేసాడు..”అని
అంతే అక్కడ కూచున్న వందలాది రిక్షా కార్మికులు ఒకరొకరుగా లేచి నిలబడి అతడికి దారి ఇచ్చారు
కారు దిగి మెల్లిగా నడుచుకుంటూ రిక్షా కార్మికుడి శవం దగ్గరికి వచ్చాడు
“అన్నా..అన్యాయంగా పోలీసులు చంపేసారన్నా..ఇక నాకు..నా పిల్లలకు దిక్కెవరన్నా..”ఏడుస్తూ అతడి కాళ్ళ మీద పడింది ఆమె
అతడేమీ మాట్లాడలేదు
ఒక్క క్షణం మౌనంగా శవం వంక చూసాడు
మెల్లిగా కిందకు వంగి స్ట్రేచర్ ను తన భుజాలకెత్తుకున్నాడు
అంతే ,
ఆసుపత్రి ప్రాంగణం నినాదాలతో హోరెత్తిపోయింది
మెల్లిగా అతడు నడవటం మొదలుపెట్టాడు
అతడి వెనకే వందలాది జనం
ఆ వెనకే పోలీసులు
అనుచరులు కారు తీసుకువచ్చి డోర్ తెరిచారు
ఎక్కను..నడుస్తానని కంటి చూపులతోనే సైగ చేసాడు
రోడ్డు మీద నడక మొదలెట్టాడు
అంత్యక్రియలకు తీసుకెళ్తున్నారని భావించి పోలీసులు ఆయన వెనకే ఫాలో అవుతున్నారు
సడెన్ గా ఊరేగింపు రూట్ మారింది
పోలీసులు ఉలిక్కి పడ్డారు
ఇదేంటి స్మశానం అటు వైపుంటే ఈయన ఇటువైపు వెళ్తున్నాడు
పైగా హోమ్ మినిష్టర్ ఉన్న స్టేడియం వైపే యాత్ర రూట్ మారింది
అదే విషయం అతడికి చెప్పారు
“మీరు వెళ్లాల్సింది స్మశాననికి కదా..ఇటు వెళ్తున్నారేంటి..పైగా ఇటైపు హోమ్ మినిష్టర్ గారు ఉన్నారు.. “వెళ్లటానికి వీల్లేదన్నారు
“నేను ఇటు వెళ్తుంది హోమ్ మినిష్టర్ తో మాట్లాడటానికే..”బుల్లెట్ లా దూసుకువచ్చింది అతడి మాట
పోలీసులకు వెన్నులో చలి మొదలయ్యింది
వెంటనే పై అధికారులకు విషయం చేరవేశారు
పై అధికారులు హోమ్ మినిష్టర్ ను అప్రమత్తం చేశారు
“సార్..మీరు ఇక్కడుండటం క్షేమం కాదు..తక్షణం బయలుదేరండి సార్..అతడొచ్చేలోపు సేఫ్టీ ప్లేసుకు వెళ్లిపోవాలి..”
పోలీసు అధికారుల మాట విన్న హోమ్ మినిష్టర్ కు కోపం కట్టలు తెంచుకుంది ,
“ఎవడయ్యా వాడు..ఒక్కడి కోసం సాక్షాత్తు హోమ్ మినిష్టర్ ను నన్నే దాక్కోమంటారా.. ఎందుకయ్యా మీకు ఈ ఉద్యోగాలు..”
“సార్..ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లెం.. దయచేసి అర్థం చేసుకోండి..అతడు ఒక్కడు కాదు సార్..అతడి వెనక జనం ఉన్నారు.. ఊళ్లనుంచి లారీలకు లారీల్లో జనం బయలుదేరారు..అంతమంది జనాన్ని కంట్రోల్ చెయ్యటానికి ప్రస్తుతం మనదగ్గర ఉన్న ఫోర్స్ కూడా సరిపోదు సార్..టైము కూడా ఎక్కువ లేదు సార్..ఆల్రెడీ ఊరేగింపు గెస్టు హౌస్ కి దగ్గరగా వచ్చేసింది..”
పోలీసులు అతడి గురించి చెప్తుంటే హోమ్ మినిష్టర్ కు కూడా నుదుటి మీద చెమట పట్టింది
హోమ్ ఆలోచించేలోపే ప్రచండ వేగంతో అతడు స్టేడియం బయటకు దూసుకువచ్చాడు
పోలీసు అధికారులు అతడితో మాట్లాడటానికి బయటకు వచ్చారు
సమస్య ఏంటో తమకే చెప్పాలన్నారు
హోమ్ మినిష్టర్ తోనే తేల్చుకుంటా..బయటకు పిలవండన్నాడు
హోమ్ మినిష్టర్ బయటకు రాలేదు
పోలీసు అధికారులు అతడికి నచ్చచెప్పారు
రిక్షా కార్మికుడి మృతిపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయించటంతో పాటు రిక్షా కార్మికుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని ..అలాగే బాద్యులైన పోలీసు అధికారుల సస్పెన్షన్ కు ఆదేశాలిస్తూ అప్పటికప్పుడు హోమ్ మినిష్టర్ సంతకంతో కూడిన ఉత్తర్వులు అతడి చేతిలో పెట్టారు అధికారులు
ఉత్తర్వు కాపీలు రిక్షా కార్మికుడి భార్య చేతిలో పెట్టి శవానికి అంత్యక్రియలు జరిపించటానికి స్మశానం వైపు తీసుకెళ్లాడు అతడు
ప్రభుత్వ సాయం కాకుండా తన సొంత నిధులతో కూడా రిక్షా కార్మికుడి కుటుంబానికి ఉపాధి కల్పించాడు అతడు !
బాగా డబ్బున్న సెలబ్రిటీలకు సమస్య వస్తే వందలాది మంది పెద్దలు పరామర్శకు ముందుకొస్తారు
కానీ చేతిలో చిల్లి గవ్వ లేని కటిక బీద వాడికి సమస్య వస్తే నేనున్నాను అంటూ ముందుకొచ్చేవాడే అసలైన నాయకుడు
నాయకులు ఎక్కడ్నించో పై నుంచి ఊడిపడరు
జనంలోనుంచే పుట్టుకొస్తారు
సర్వ కాల సర్వావస్థలందు అన్నా అని పిలిస్తే నేనున్నానంటూ దైర్యంగా ముందుకువచ్చేవాడే నాయకుడిగా ఎదుగుతాడు అనటానికి ఈ సంఘటనే ఉదాహరణ
ఇది విజయవాడలో యదార్థంగా జరిగిన సంఘటనే !
వంగవీటి మోహన రంగా 36 వ వర్ధంతి సందర్భంగా నివాళులు ….. పరేష్ తుర్లపాటి
Share this Article