Vani Jayaram : తమిళనాడులో పుట్టి దక్షిణాది అన్ని భాషల్లో ఇరవై వేలకు పైగా పాటలు పాడిన వాణీజయరాం గురించి చెప్పుకోవాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చింది. ఆమెకు పద్మభూషణ్ అవార్డు రావడంతో… ఆమె ఏయే భాషల్లో ఎన్ని పాటలు పాడారు? ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగారు? లాంటి అనేకానేక విషయాలు మీడియాలో వచ్చాయి. వస్తున్నాయి…
శరీర నిర్మాణ అనాటమీ కోణంలో చూస్తే ఏ మనిషికయినా అవే అవయవాలు. అదే పనితీరు. కానీ మెదడు పనితీరులో, మాటలో ఎవరికి వారు ప్రత్యేకం. గొంతులో సాంకేతికంగా అందరికీ స్వరత్వచం, స్వర తంత్రులు ఉంటాయి. ఊపిరితిత్తుల గాలి స్వరపేటిక గుండా బయటికొచ్చేప్పుడు శబ్దంగా మారుతుంది. సెకెనులో వందో వంతు సమయంలో ఇదంతా ఆటోమేటిగ్గా జరిగినట్లు అనిపించినా ఆటోమేటిక్ కాదు. మెదడు ఇచ్చే ఆదేశాన్ని బట్టి ఊపిరితిత్తుల దగ్గర మాట్లాడే మాటకు బీజం పడుతుంది. అది పరా- పశ్యంతి- మాధ్యమా- వైఖరి అని నాలుగు దశలు దాటి మాటగా బయటకు వస్తుంది. ఒక గొంతు తీయగా ఉండడానికి, ఒక గొంతు బొంగురుగా ఉండడానికి, ఒక గొంతు ముద్దగా ఉండడానికి, ఒక గొంతు కీచుగా ఉండడానికి స్వరపేటిక కారణం. శ్రావ్యమయిన గొంతు దానికదిగా పుట్టుకతో రావాల్సిందే కానీ…సాధిస్తే వచ్చేది కాదు.
Ads
సంగీత శాస్త్రం బుద్ధికి సంబంధించినది. సంగీతం చెవులకు సంబంధించినది. బిళహరులు, కాంభోజులు, కాపీలు, ధేనుకలు, ఆలాపన, ఆరోహణ, అవరోహణలు, గమకాలు సంగీత శాస్త్ర పరిభాష. ఎప్పుడూ శాస్త్రం ముందు పుట్టదు. ముందు పాట పుడితే… తరువాత ఎప్పుడో ఆ పాటకు సంబంధించిన శాస్త్రం పుడుతుంది. శాస్త్రీయంగా నేర్చుకునేవారు ఆ స్వరాల లెక్కలకు, తాళాలకు ప్రాధాన్యమిచ్చి అందులో అర్థాన్ని, భావాన్ని, ధ్వనిని గాలికి వదిలేస్తూ ఉంటారు. దాంతో “మనసులోని మర్మమును తెలుసుకో!” కాస్త “మన- సులోని మర్మమును తెలుసుకో!” అని తొడమీద తాళానికి మనమందరం సులోని మర్మం ఏమిటో తెలియక తలలు ఊపలేక బిగుసుకుపోయి ఉంటాం.
తలపండిన సంగీత పండితులకు ఎక్కాల పుస్తకంలో అంకెల్లా స్వరాల లెక్కలే ప్రధానం తప్ప…
భారత; భాగవత అన్న నామవాచకాలు భా- రత; భా- గవత
అని విరవకూడని చోట విరిగిపోయినా… పట్టింపు ఉండదు. కొన్ని శతాబ్దాల ఈ విరుపు చివరికి ఏ స్థాయికి చేరిందంటే… సంప్రదాయ సంగీత ప్రదర్శనలో సాహిత్యం అణిగిమణిగి బిక్కు బిక్కుమంటూ చివరి వరుసలో కూర్చుని… అందరికంటే ముందే లేచిపోతోంది.
వాగ్గేయకారులెవరూ ఇలా పాడి ఉండరని నా ఊహ. వారే రాసి… వారే బాణీలు కట్టి… వారే పాడి… ప్రపంచానికి వినిపించినవారు వాగ్గేయకారులు. వారికి ముందు వాక్కు ముఖ్యం. తరువాత గానం. అన్నమయ్య, రామదాసు, త్యాగయ్యల సంస్కృతాంధ్ర వ్యాకరణ, ఛందో జ్ఞానం అనంతం. అలాంటివారు సాహిత్యాన్ని గాలికొదిలి… సంగీతాన్ని మాత్రమే పట్టుకోవడానికి అవకాశమే లేదు.
ఇంతకంటే లోతుగా వెళ్లడానికి ఇక్కడ కుదరదు. శాస్త్ర పరిభాషతో ఈ సమస్య మీద చర్చోపచర్చలు చేయడం కంటే… వాణీజయరాం పాడిన కొన్ని భుజంగాలు, స్తోత్రాలు, భక్తి గీతాలు, సినిమా పాటలు వినండి. సంగీత మర్యాదలు పాటిస్తూనే సాహిత్యానికి భంగం కలగకుండా ఎలా జాగ్రత్త పడవచ్చో తెలుస్తుంది.
ఆదిశంకరాచార్యుల భవానీ భుజంగం దానికదిగా ఛందస్సు వల్ల ఒక లయతో సాగుతుంది. మహా మంత్రాలను భుజంగంలో కూర్చిన శంకరాచార్యుల రచన ఎంత గొప్పదో… వాణీజయరాం గానం అంత గొప్పగా ఉంటుంది. రాగం అనుమతించినా అనుమతించకపోయినా… శ్లోకంలో క్రియా పదాన్ని బట్టి అన్వయం సాధించడానికి వీలుగా ఆమె విరుచుకున్న పద్ధతి వెనుక బహుశా చాలా సాహిత్య అర్థాల, సంగీత స్వరాల చర్చ జరిగి ఉండాలి. లేకపోతే అంత స్పష్టత, ధ్వని సాధ్యం కాదు.
“మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా…” అని వాణీజయరాం గొంతు వింటున్న ప్రతిసారీ నేను గాల్లో తేలిపోతూ ఉంటాను. వేటూరి పదాలు గొప్పవో? ఇళయరాజా స్వరాలు గొప్పవో? వాణీజయరాం గానం గొప్పదో? తేల్చుకోలేక ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటాను. లా లా లా లా లా అని వాణీజయరాం గొంతు హొయలు పోయినప్పుడు మాత్రం అన్ని మార్కులు ఆమెకే వేసి… బాలుతో పాటు వేటూరికి, ఇళయరాజాకు వేయడానికి మార్కులు మిగిలి ఉండక గిల్టీగా ఫీలవుతూ ఉంటాను.
“పూజలు సేయ పూలు తెచ్చాను…” అని వాణీజయరాం అన్నప్పుడు కూడా దాశరథి, రాజన్- నాగేంద్రలకు నా చెవులు కొంత అన్యాయం చేస్తుంటాయి.
“ఆనతినీయరా! హరా! దొరా!…” అని వాణీజయరాం గొంతు విప్పగానే… సిరివెన్నెల, కె వి మహదేవన్ లను మరిచిపోయి… మళ్లీ బాధ్యతగా గుర్తు చేసుకుంటూ ఉంటాను. తీయటి గొంతు ఉండడం వేరు. ఆ తీయటి గొంతుతో అర్థవంతంగా పాడడం వేరు. ఈ రెండు గుణాల కలయికగా అర్థవంతంగా… తేనె ప్రవాహంలా, కోయిల పాటలా పాడే వాణీజయరామ్ కు ఇప్పుడు పద్మభూషణ్ ఆభరణం వచ్చింది. ఆమె మెడలో దశాబ్దాల క్రితమే శంకరాభరణాలు ఉన్నాయి. వాణీజయరాం గానం- ఒక పాటల బృందావనం. (ఆమె మరణానికి ముందు రాసిన కథనం ఇది… ఆమెకు నివాళి)
-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com ( 99890 90018 )
Share this Article