Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చంద్రబోసు, యండమూరీ… ఆ విరోధాభాసం వదిలి ఈ భాష చదవండి…

January 3, 2023 by M S R

Heights of Language: ఏ భాష దానికదిగా గొప్పది కాదు; అలాగే తక్కువదీ కాదు. ఆ భాషలో ఉన్న గ్రంథాలు, భాషా చరిత్ర, అనేక ప్రక్రియలకు అనువుగా ఉండడం లాంటి అంశాలతో భాష గొప్పతనాన్ని బేరీజు వేయడం సాధారణం. లేదా అత్యధిక మంది వాడే భాష సహజంగా గొప్పది అనుకుంటాం. ఈ కోణంలో చూసినప్పుడు ఆధునిక కాలంలో నిత్యవ్యవహారంలో వాడుకలో లేనే లేని భాష- సంస్కృతం. ఆ సంస్కృతం గొప్పది అనుకోవడానికి కొన్ని కారణాలున్నాయి.

1. వేదాలు, పురాణాలు ఇతర భారతీయ పురాతన గ్రంథాలన్నీ మొదట సంస్కృతంలోనే ఉండేవి.
2 . ఆధ్యాత్మిక సాహిత్యం, మంత్ర భాగం సంస్కృతమే.
3. స్వాతంత్ర్యానికి ముందు వరకు రాజులు ఎక్కువ ప్రోత్సహించిన భాష- సంస్కృతం.
4 . శాస్త్ర గ్రంథాలన్నీ మొదట సంస్కృతంలోనే ఉండేవి.
5. భారతీయ భాషలన్నిటికి సంస్కృతం మూలం అన్న నమ్మకం.
6. ఇప్పుడు ఇంగ్లీషు మాట్లాడితేనే మనుషులుగా గుర్తిస్తున్నట్లు…ఒకప్పుడు సంస్కృతం తెలిస్తేనే గొప్పవారిగా గుర్తించేవారు.
7. పొరుగింటి పుల్లకూర రుచి.
8. ఆధిపత్య ధోరణి.
9. అగ్రవర్ణాలు ఎక్కువగా ప్రోత్సహించడం
ఇంకా అనేకానేక కారణాలున్నాయి కానీ…ఇక్కడ అనవసరం.

Ads

“నిండు నూరేళ్లు చల్లంగ ఉండు”
అన్నది పదహారణాల అచ్చ తెలుగు మాట.
“శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి”
అన్నది సంస్కృత వేదాశీర్వచనం.
నిజానికి అర్థంలో రెండూ ఒకటే. కానీ మనకు “చల్లంగ ఉండు” అంటే మొరటుగా, పట్టించుకోనట్లుగా, తేలికగా అనిపిస్తుంది. “శతమానం భవతి” అనగానే గంభీరంగా, మహా మంత్ర ఆశీర్వచనంగా, చాలా పవిత్రంగా, గొప్ప మర్యాదగా అనిపిస్తుంది.
భాషకు సంబంధించి మన మనసులో ఉన్న అభిప్రాయాలను బట్టి వీటి విలువలు ఆధారపడి ఉంటాయి. ఇంతకంటే ఈ చర్చలోకి వెళితే సంప్రదాయవాదుల మనసు గాయపడుతుంది. వదిలేద్దాం.

“కట్టెదుట వైకుంఠము కాణాచయిన కొండ;
 తెట్టెలాయె మహిమలే
తిరుమల కొండ”
అని అన్నమయ్య ఏరికోరి తెలుగును నూరి నూరి పదం పాడితే వెంకన్న నాలుగు మాడవీధుల్లో ఆనందపరవశంతో చిందులేశాడు.

“లావొక్కింతయు లేదు…”
 అని పోతపోసిన తెలుగులో పోతన గజేంద్రుడు ఏడిస్తే అలవైకుంఠపురంబు వదిలి శ్రీమన్నారాయణుడు నేరుగా వచ్చాడు.
“ఓరామా!
నీ నామమెంత రుచిరా?”
అని రామదాసు తెలుగు కండ చక్కెర కలిపి పాడితే ఆ తీపి రుచిని భద్రాద్రి రామయ్య కూడా ఆస్వాదించాడు.
“నగుమోము కనలేని నా జాలి తెలిసీ…”
అని త్యాగయ్య తమిళగడ్డ మీద అచ్చ తెలుగులో గొంతెత్తితే జాలిగల రాముడు అయోధ్య వదిలి మనోవేగంతో కావేరీ తీరానికి వచ్చాడు.

అన్నమయ్య, పోతన, రామదాసు, త్యాగయ్యలు సంస్కృతంలో అపార పాండిత్యం ఉన్నవారు. అయితే వారు తెలుగువారు. తెలుగు భాషాభిమానులు. ఇలాంటివారు పట్టుమని పదిమంది పట్టుబట్టి తెలుగులో రాయడం వల్ల తెలుగు ఈమాత్రమయినా బతికి బట్టగట్టగలిగింది.

సంస్కృతం మీద మన ప్రేమ కంటిని మించిన కాటుక వంటిది. కంటికి కాటుక అందం. కానీ కన్ను కనపడనంతగా కాటుక పులుముకుంటే కళ్లు పోతాయి. చూడ్డానికి కూడా అసహ్యంగా ఉంటుంది. భాషా పరిణామక్రమంలో ఎంతో కొంత మూల రూపాలు, ఇతర భాషల పదాలు వస్తాయి. సంస్కృతాన్ని నెత్తిన పెట్టుకుని తెలుగును చిన్న చూపు చూసిన మన నిర్లక్ష్యం ఇప్పుడు మన వేలితో మన కంటినే పొడుచుకున్నట్లు ఉంది.

తెలుగు కూడు, బువ్వ, ముద్ద, ఎంగిలిపడు మొరటు, అనాగరికం. 
సంస్కృత భోజనం, ఆహారం, ఉపాహారం, అన్నం చాలా గొప్పవి. నాజూకయినవి.
మొక్కుకు దిక్కు లేదు. నమస్కారం సంస్కారవంతమైనది. చదువు పనికి రానిది. విద్య గొప్పది.
తుండు గుడ్డ పనికిరానిది. ఉత్తరీయం మహా గొప్పది. కాపు కాయకూడదు. ఫలసాయమే రావాలి. తిండి గింజలు తినకూడదు. ధాన్యమే ధ్యానంగా తినాలి. ఎండ పొద్దు వద్దు. మధ్యాహ్నం ముద్దు.

ఇలా తెలుగు భాషలో అందంగా, అద్భుతంగా, సహజంగా ఉన్న మాటలను వాడడం మానేసి సంస్కృతం మాటలను వాడడం శతాబ్దాల క్రితమే మొదలు పెట్టాం. తెలుగు అధికార భాష, తెలుగు మాతృ భాష అన్న మాటల్లో కూడా అధికార, మాతృ మాటలు తెలుగు కాదు. సంస్కృతం.

భాషకు సంబంధించి మనది ప్రతీకాత్మక లేదా సంకేత బాధ. నిజం బాధ కాదు. తెలుగు మీడియా ప్రామాణిక భాషలో పారిభాషిక పదాలన్నీ సంస్కృతమే.
 ఐక్య రాజ్య సమితి, 
అణ్వాయుధం
, శిఖరాగ్ర సమావేశం
, శీతలీకరణ కేంద్రం,
 ప్రశ్నోత్తర సమయం
, సభాపతి, 
అనంతర పరిణామం
, స్నాతకోత్సవం, 
విద్యాభ్యాసం,
 గృహ ప్రవేశం, 
ప్రత్యక్ష ప్రసారం
 ఇవే మాటలకు తమిళంలో ఏయే మాటలు వాడుతున్నారో తెలుసుకుంటే తెలుగులో తెలుగు ఎంతో తెలిసిపోతుంది.

మనం రోజూ వాడే మాటల్లో ఏది తెలుగో? ఏది సంస్కృతమో? తెలుసుకుంటే మన సంస్కృతం మోజు ఎంత బలమయినదో పాలు తాగే పసిపిల్లలకు కూడా అర్థమైపోతుంది. గడచిన యాభై ఏళ్ళల్లో తెలుగులో సంస్కృతం స్థానాన్ని ఇంగ్లీషు ఆక్రమించింది.
ఈ పరిణామ క్రమంలో చూసినప్పుడు తెలుగు తనకు తానుగా ఎందుకు వెనక్కు వెళ్ళిపోతోందో? ఎవరికి వారు అర్థం చేసుకోవచ్చు.

వినరో భాగ్యము విష్ణు కథ సినిమా. “అందులో వాసవహాస సుహాస…” అని పల్లవి సంస్కృతం. చరణం తెలుగు. మమేకవాక మధుసూధనా! ఒత్తు లేని చోట కూడా బాగా ఒత్తి అల్లు అరవింద్ ప్రెజెంట్స్ గీతా ఆర్ట్స్-జి ఏ2 పాట అని ఒక పి డి ఎఫ్ సామాజిక మాధ్యమాల మీదికి వదిలారు. రచయిత తప్పు రాశారో? అల్లువారి పబ్లిసిటీ డిజైనర్ తప్పు రాశారో? కానీ…సంస్కృతం తెలిసినవారికి దీన్ని చదవడమే కోటి జన్మల తపస్సుగా ఉంది.

“వినరో భాగ్యము విష్ణుకథ;
 వెనుబలమిదివో విష్ణుకథ…” అని పదకవితా పితామహుడు పదహారణాల తెలుగులో అరటిపండు ఒలిచిపెట్టినంత తేలికగా తెలుగువారికి అర్థమయ్యేలా రాసి…పాడితే…
అదే పల్లవిని సినిమాగా తీసిన అల్లువారు చిక్కటి నారికేళపాక మహా గంభీర వినూత్న సంస్కృతపదబంధాలతో రాయించారు.

మమేకవాక మధుసూధనా! మదనా!
విన్నావా? సంస్కృత భాగ్యము!

-పమిడికాల్వ మధుసూదన్, madhupamidikalva@gmail.com…. Pamidikalva Madhusudan…. 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions