మహాభారతంలోనే చాలామందికి తెలియని కథ… చదవాల్సిన కథ… చెబితే భారతమంత… అందుకే సంక్షిప్తంగా చెప్పుకుందాం… ఆమె పేరు లక్ష్మణ… కురు సార్వభౌముడు దుర్యోధునుడి భార్య భానుమతి… వారణాసి రాజు బిడ్డ… ప్రతి రాజుకూ బోలెడుమంది భార్యలు… కానీ దుర్యోధనుడికి కేవలం భానుమతి ఒక్కతే… ఏకసతీవ్రతుడు… వాళ్లకు ఇద్దరు కవల పిల్లలు… మగ, ఆడ… లక్ష్మణకుమారుడు, లక్ష్మణ… లక్ష్మణకుమారుడి కథను మనం మాయాబజార్ సినిమాలో చూస్తాం…
బలరాముడి కూతురు శశిరేఖతో లక్ష్మణకుమారుడికి పెళ్లి చేయాలని అనుకోవడం, కృష్ణుడు దాన్ని భగ్నం చేయించి, అర్జునుడి కొడుకు అభిమన్యుడితో ఆ పెళ్లి జరిగేలా చేయడం, ఘటోత్కచుడి సాయం ఆ కథ… లక్ష్మణకుమారుడిని స్థాయి తగ్గించి చూపిన కథ… కానీ తను మహావీరుడు… కురుక్షేత్రంలోనే ప్రాణాలు వదిలాడు… తన కవల సోదరి లక్ష్మణ… గొప్ప అందగత్తె… నైపుణ్యం కలిగిన రథసారథి… గదతోనూ, విల్లంబులతోనూ యుద్ధం చేయగల సాహసి… పైగా కురు సార్వభౌముడి బిడ్డ… వంద మందికి గారాలపట్టి… అందుకే రాజులందరి కళ్లూ ఆమెపైనే… ఆమెను చేపట్టాలనే…
ఆమెకు వృషసేనుడి మీద అనురక్తి… కర్ణుడి కొడుకు ఈ వృషసేనుడు… రెండు కుటుంబాల నడుమ చిక్కటి స్నేహం… ఇద్దరూ చిన్నప్పటి నుంచీ కలిసి ఆడుకునేవారు… దుర్యోధనుడు ఆమెకు స్వయంవరం ఏర్పాటు చేస్తాడు… వృషసేనుడి మెడలో ఆమె హారం వేయాలి… ఇక్కడి నుంచి విధి వెక్కిరించి, ఆమె వ్యథాభరిత జీవితం ప్రారంభమవుతుంది… ఆమెపై కన్నేసినవాళ్లలో కృష్ణుడు కొడుకు సాంబుడు… కృష్ణుడి కథలో ఓ మరక తను… జాంబవతి కొడుకు… చిన్నప్పటి నుంచీ తల్లి గారాబం కారణంగా సకల అవలక్షణాలతో పెరుగుతాడు… కౌరవ యువరాణి లక్ష్మణపై కన్నేశాడు కదా, కృష్ణబలరాములకు తెలియకుండా స్వయంవరానికి వెళ్లి, లక్ష్మణను అపహరిస్తాడు…
Ads
కౌరవ ప్రముఖులు దారి మధ్యలోనే పట్టుకుని, నాలుగు తన్ని, కారాగారంలో వేస్తారు… మళ్లీ ఆమెకు స్వయంవరం ఏర్పాటు చేసినా రాజులెవరూ రారు… ఈలోపు సాంబుడి నిర్బంధం తెలిసి బలరాముడు కోపోద్రిక్తుడై హస్తినపై దాడికి వెళ్తాడు… మొత్తానికి పెద్దల రాజీ ప్రయత్నాలతో లక్ష్మణను అదే సాంబుడికిచ్చి పెళ్లి చేస్తారు… (బలరాముడి బిడ్డతో తన కొడుక్కి పెళ్లి చేయించలేకపోయిన దుర్యోధనుడు తన బిడ్డను కృష్ణుడి కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాల్సి రావడం ఓ వైచిత్రి… కృష్ణ దుర్యోధనుల నడుమ వియ్యం…
ఐనా సరే, కృష్ణుడు దుర్యోధనుడి పట్ల విముఖతను, తన సొంత బావ అర్జునుడి పట్ల అభిమానాన్ని ప్రదర్శిస్తాడు…) (దుర్యోధనుడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే కర్ణుడు ఈవిషయంలో కిక్కుమనడు… కర్ణుడి కొడుకు కూడా లోకనింద భయంతో తన ప్రేమను చంపేసుకుంటాడు… మొహం చాటేస్తాడు… లక్ష్మణకు సాంబుడి అపహరణకన్నా ఇదే ఎక్కువ బాధపెడుతుంది…)
సాంబుడిని భరించకతప్పలేదు లక్ష్మణకు… లేక లేక కలిగిన కొడుకు కాబట్టి జాంబవతి గారాబం… శివుడి కోసం తపస్సు చేస్తే ఆయన వరంతో పుట్టిన కొడుకు… అందుకే ప్రతి సందర్భంలోనూ ప్రతినాయకుడి లక్షణాలే తనకు… తండ్రి కృష్ణుడి చిన్న భార్యలతోనూ వెకిలిగా ప్రవర్తిస్తూ ఉంటాడు… ఓసారి నారదుడిని అవమానిస్తాడు, నారదుడు తెలివిగా సాంబుడిని కృష్ణుడి భార్యలు స్నానం చేస్తున్న అభ్యంతర ప్రాంతంలోకి తీసుకెళ్తాడు… వాళ్లు కోపంతో కృష్ణుడికి ఫిర్యాదు చేస్తారు… కృష్ణుడు ఆగ్రహం ఆపుకోలేక కుష్టు వ్యాధిగ్రస్తుడవు కావాలంటూ శపిస్తాడు…
జాంబవతి లబోదిబోమంటే సూర్యుడిని ఆరాధించి శాపవిముక్తుడవు కావాలని సూచిస్తాడు… దాంతో సాంబుడు ఓ పుష్కరంపాటు లక్ష్మణకు దూరమై, సూర్యుడి ఆరాధన కోసం అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు… తిరిగి వచ్చాక కురుక్షేత్రం… లక్ష్మణ కవలసోదరుడు, తండ్రి, చిన్నాన్నలు, చుట్టాలు అందరూ హతమారిపోతారు… పాండవుల దయాభిక్ష మీద బతకడం ఇష్టం లేక తల్లి భానుమతి సతీసహగమనం చేస్తుంది…
ఓసారి దుర్వాసుడిని సాంబుడు వెక్కిరిస్తే, నీ కడుపున ఇనుప రోకలి పుడుతుందని శపిస్తాడు మహర్షి… పుడుతుంది… దాన్ని అరగదీసి సముద్రంలో పారవేయిస్తాడు బలరాముడు… చివరలో మిగిలిన ఒక ముక్కను ఒక చేప మింగడం, అది జర అనే ఓ వేటగాడికి దొరికి, దాన్ని తన బాణానికి పెట్టుకోవడం మరో ఉపకథ… కురుక్షేత్రం అనంతరం మీ యాదవజాతి పరస్పరం కొట్టుకుని చస్తారని గాంధారి శపిస్తుంది… దానికి అనుగుణంగా ఓసారి యాదవులంతా తప్పతాగి తన్నుకుని చస్తారు…
జర వదిలిన బాణం తగిలి కృష్ణుడూ అవతారం చాలిస్తాడు… సముద్రం ఉప్పొంగి ద్వారకను ముంచెత్తుతుంది… మునిగిపోతుంది… కృష్ణుడి భార్యలను, లక్ష్మణతో సహా తీసుకుని అర్జునుడు హస్తినకు తీసుకెళ్తుంటాడు,.. కృష్ణుడి మహత్తు లేదు కదా, అర్జునుడి శక్తిసామర్థ్యాలు క్షీణిస్తాయి… దివ్యాస్త్రాలు కూడా పనిచేయవు… కృష్ణుడి కొందరు భార్యల్ని దారిమధ్యలోనే దొంగలు అటకాయించి, ఎత్తుకుపోతున్నా అర్జునుడు ఏమీ చేయలేకపోతాడు… లక్ష్మణ మాత్రం ఎలాగోలా హస్తినకు చేరుతుంది… తల్లి పుట్టింటికి వెళ్లడానికీ ఇష్టపడదు… అంతటి విశాల రాచపరివారంలో తనకంటూ ఎవరూ లేని, మిగలని నష్టజాతకురాలు… రకరకాల శాపాలకు గురైన సాంబుడి కారణంగా లక్ష్మణ బతుకంతా చిందరవందర… విధివంచిత…!!
Share this Article