చిన్న చిన్న దెబ్బలకే కుమిలిపోతాం… చిన్న చిన్న వ్యాధులకు, కష్టాలకే మానసికంగా కుంగిపోతాం… కానీ సెరిబ్రల్ పల్సీ… అంటే మస్తిష్క పక్షవాతం… ఈ పదం కరెక్టో కాదో నాకు తెలియదు… అందులో కూడా చాలా గ్రేడ్లుంటయ్… ఈ వ్యాధి పుట్టుకతోనే వస్తుంది… మెదడుకు, ఇతర అవయవాలకు కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు… కొందరికి వినబడదు, కనబడదు… టాయిలెట్ సహా అన్ని అవసరాలకూ ఎవరో ఓ కేర్‌టేకర్ కావల్సిందే… కొందరికి మాత్రం సమస్య తీవ్రంగా ఉండదు…
కానీ ఎక్కువ శాతం కేసులు పేరెంట్స్‌కు నిత్యనరకమే… ఈ వ్యాధితో పుట్టిన వాళ్లను చూసి నిరంతరం కుమిలిపోతూ, రోజూ ఆ అవసరాలకు అటెండ్ కాలేక సతమతం అవుతూ, తమ వృత్తుల్లో కూడా విపరీతమైన స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్ చూపిస్తుంటారు… సహజం… నిజానికి చాలామంది ఈ వ్యాధిగ్రస్తులు తక్కువ ఏజ్‌లోనే మరణిస్తుంటారట… ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కొడుకు జయన్ ఈ సెరిబల్ర్ పల్సీతో మరణించాడు అనే వార్త చదివి కలుక్కుమంది…
Ads
2014లో మార్గరెటా విత్ ఎ స్ట్రా అనే హిందీ కమ్ ఇంగ్లిష్ సినిమా వచ్చింది… ఇందులో సెరిబ్రల్ పల్సీతో బాధపడే కేరక్టర్ ఉంటుంది… పాండిచ్చేరిలో పుట్టిన కల్కి కొయిచిలిన్ నటించింది… బోలెడు అవార్డులు వచ్చినయ్, ప్రశంసలు దక్కినయ్… ఆమె ఎవరో కాదు, ప్రఖ్యాత నిర్మాత, దర్శకుడు, రైటర్, ఎడిటర్, నటుడు అనురాగ్ కశ్యప్ భార్య… కాకపోతే వాళ్ల బంధం మూడేళ్లకు మించి నిలవలేదు… ఈ సినిమాలో రేవతి కూడా ఉంది… ఇలాంటి సమస్యాత్మక వ్యాధి కేంద్రంగా ఓ సినిమా రావడం బహుశా ఇండియన్ సినిమా చరిత్రలో ఇదే తొలిసారి, చివరిసారి కావచ్చు…
అరుణ్ శౌరి తెలుసు కదా… పద్మభూషణ్, రామన్ మెగసెసే అవార్డు విజేత, ప్రఖ్యాత జర్నలిస్టు, మాజీ కేంద్ర మంత్రి… ఆయన కొడుక్కి కూడా ఇదే సెరిబ్రల్ పల్సీ… వీల్ చైర్ మీదే జీవితం… తల్లి అనిత శౌరి పిల్లాడి బాగోగులు చూసుకునేది, ఏదో ప్రమాదం జరగడం, పక్షవాతం రావడం, తరువాత పార్కిన్‌సన్స్… ఇక ఇద్దరి అవసరాలూ అరుణ్ శౌరే చూడాల్సి వచ్చింది… అప్పట్లో ఈ నేపథ్యంతోనే ఓ బుక్ కూడా రాశాడు… దాని పేరు Does He Know a mother’s Heart?
కొడుకు వ్యాధి, భార్య ప్రమాదం, వాళ్ల అవసరాలు గట్రా మతాలపై, దేవుడిపై తన ధోరణులను ఎలా మార్చిందో, చివరకు తన వృత్తిని ఎలా ప్రభావితం చేసిందో కూడా అరుణ్ శౌరి అనేక ప్రసంగాల్లో చెప్పుకునేవాడు… (ఆమధ్య తనకు బ్రెయిన్ ఇంజూరీ కూడా అయ్యింది)… తన వార్తల్లో కూడా చాలా పరుషపదాలు కనిపించేవి… ఏదో అవ్యక్తమైన ఓ కసి… సహజమే… సత్య నాదెళ్ల కొడుకు మరణం వార్త చదివాక ఇవన్నీ గుర్తొచ్చాయి…
ఎంత అల్పమైంది జీవితం..? ఈ పోస్టులు, ఈ ఆస్తులు, ఈ అంతస్థులు, ఈ పలుకుబడి, ఈ అధికారం, ఈ జ్ఞానం విధి విసిరే సవాళ్ల ముందు ఎంత..? ఏం అక్కరకొస్తయ్..? కరోనా ఉధృతిలో ఎన్ని ఉదాహరణలు చూశాం… చిటికేస్తే చాలు సకల హంగులూ సమకూరేవాళ్లు కూడా అనాథలుగా చితిపైకి చేరిపోయారు… ఈ సెరిబ్రల్ పల్సీ మాత్రమే కాదు… నిత్యనరకాన్ని చూసే, చూపించే వ్యాధులు అనేకం… కర్మఫలం అని చెప్పను, చెప్పలేను… కానీ విధిరాత అనడానికి మాత్రం సాహసిస్తా…!!
Share this Article