ఒకటికి పదిసార్లు కళ్లు నులుముకుని చూడాల్సి వచ్చింది… నిజమా..? కేజీఎఫ్-2 సినిమా రేటింగ్స్ మరీ అంత దయనీయమా..? హైదరాబాద్ బార్క్ రేటింగ్స్ పరిశీలిస్తుంటే… కేజీఎఫ్- చాప్టర్2 సినిమా రేటింగ్స్ జస్ట్, ఆరున్నర మాత్రమే… ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే 6.53 మాత్రమే… ఏ దిక్కుమాలిన టీవీ సీరియల్ రేటింగ్స్ చూసినా దీనికన్నా బెటర్ అనిపిస్తాయి… హాశ్చర్యం ఎందుకంటే… ఇటీవల కాలంలో దేశంలోకెల్లా సూపర్ హిట్ సినిమా కేజీఎఫ్-2…
థియేటర్లు దద్దరిల్లిపోయాయి… ప్రత్యేకించి సౌండ్ బాక్సులు… ఎగ్జిబిట్లర్లు, బయ్యర్లు, ప్రొడ్యూసర్ల గల్లాపెట్టెలు పోటెత్తి మత్తళ్లు దూకాయి… 100 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తే ఏకంగా 1250 కోట్లు కలెక్ట్ చేసింది సినిమా… టీవీ ప్రసారాలు, ఓటీటీ డబ్బులు కూడా కలిపితే ఇంకా అదనం… ఓ థండర్ స్ట్రయిక్… ఈ సమీప భవిష్యత్తులో ఈ రేంజ్ హిట్ మనం చూడకపోవచ్చు… అలాంటిది టీవీలో ప్రసారం చేస్తే మరీ చెత్త చెత్త సీరియళ్లతో సమానమైన రేటింగ్సా..? అదీ హాశ్చర్యం…
Ads
ఓ కామెడీ లేదు, వినసొంపు పాటల్లేవ్, రొమాన్స్ లేదు… ఉన్నదంతా డిష్యూం డిష్యూం… ఫుల్లు యాక్షన్… అంతకుముందు కేజీఎఫ్ తప్ప ఆ హీరో యశ్ మనకు తెలిసినవాడు కూడా కాదు… ఆ దర్శకుడు మన తెలుగువాడే గానీ, యశ్‌లాగే తను కూడా మనకు పెద్దగా అంతకుముందు పెద్దగా టచ్ లేడు… ఐతేనేం, సినిమా వీరకుమ్ముడు కుమ్మేసింది… బీభత్సమైన హిట్… లాజిక్కులు, మన్నూమశానం ఎవరూ పట్టించుకోలేదు…
ప్రసారం చేసింది జీతెలుగు టీవీలో… నెంబర్ టూ చానెల్… సో, రేటింగ్స్‌లో రికార్డు క్రియేట్ చేస్తుందని అనుకున్నారు… కానీ మరీ ఇంత చెత్తా రికార్డు కాదు… ఎందుకిలా..? మొన్నామధ్య ఆర్ఆర్ఆర్ కూడా ఇలాగే తీవ్రంగా నిరాశపరిచింది… కాకపోతే అది కాస్త నయం (19.22)… మరీ కేజీఎఫ్ స్థాయి రేటింగ్ డిజాస్టర్ కాదు…
ఎస్, ప్రేక్షకుడు మొత్తం మారిపోయాడు… ఏది టీవీలో చూడాలి, ఏది థియేటర్‌లో చూడాలి, ఏది ఓటీటీలో చూడాలి… ఓ క్లారిటీ వచ్చేసింది… థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ అవసరమున్న సినిమాలకు మాత్రమే థియేటర్లకు వెళ్తున్నాడు… వాటిని ఇక టీవీలో దేకడం లేదు… ఆర్ఆర్ఆర్ పూర్ రేటింగ్స్‌కు అదే కారణం… చూస్తే థియేటర్లలోనే చూడాలి, అంతే… సేమ్, కేజీఎఫ్… ఆ సీన్స్, ఆ షాట్స్ చూస్తే థియేటర్లలోనే చూడాలి… ఇదీ ప్రేక్షకుడి మనోగతం… కాకపోతే మరీ ఇంతగానా అనేది మనకు హాశ్చర్యం…
స్టార్ మాటీవీలో ఈవారం విక్రమ్ ప్రసారం కాబోతోంది… అది కూడా థియేటర్లలో బంపర్ హిట్… ఆ రేంజ్ సక్సెస్‌ను బహుశా నిర్మాతలు కూడా ఊహించలేదేమో… ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, విక్రమ్… ఈ మూడూ హిందీలోకి డబ్ అయ్యాక, పాన్ ఇండియా మూవీస్‌గా దేశమంతా మంచి వసూళ్లు సాధించాయి… ఇప్పుడిక విక్రమ్ రేటింగ్స్ మీద టీవీ సర్కిళ్లలో ఇంట్రస్ట్ క్రియేటవుతోంది… ప్రేక్షకులు దాన్ని కూడా ‘థియేటర్ సినిమాయే గానీ టీవీ సినిమా కాదు’ అని భావిస్తే… స్టార్ మాటీవీ మరోసారి చేతులు, మూతులు కాల్చుకున్నట్టే…!!
Share this Article