రాత్రి 1.10 ని. లు… స్టేడియం అంతా సందడి… ఉత్కంఠ… పోటీలో పాల్గొనే క్రీడాకారులు ఒక్కొక్కరుగా వస్తున్నారు. జమైకాకు చెందిన Kishane Thompson సింహ గర్జన లాంటిదేదో చేసి వచ్చి తన లైన్లో నిలుచున్నాడు. అమెరికాకు చెందిన Noah Lyles తన అంత ఎత్తు ఎగురుతూ, దుంకుతూ దాదాపు 100 మీ. లు ముందే ఉరికి వచ్చాడు. చాలా అతి అనిపించింది. వీడు ఖచ్చితంగా చివరగా ఉంటాడు అనుకున్నాను.
రేస్ మొదలైంది. మైదానం అంతా చెవులు చిల్లులు పడేంత గోల… ఉత్సాహం… నరాలు తెగే ఉత్కంఠ… గుండె పోటుతో పోతారేమో అన్నంత తీవ్రంగా Commentators అరుస్తున్నారు. అసలు వాళ్ళు మనుషులా, యంత్రాలా అన్నట్టు అథ్లెట్స్ పరిగెడుతున్నారు. 50 మీ.ల వరకు Thompson చాలా స్పష్టమైన అధిక్యంలో ఉన్నాడు. కానీ అతని పరుగులో శ్రమ కనిపించింది.
Lyles మెల్లగా ఒక్కొక్కరినీ దాటుకుంటూ చివరి 10 మీ. లలో రెండో స్థానానికి వచ్చాడు. ఇప్పటికీ Thompson గెలిచేలానే కనిపించాడు. కానీ ఎందుకో అతనిని ఒక అర సెకను ఉదాసీనత అవరించినట్టు అనిపించింది. చిరుత పులుల్లా వారంతా stop line దాటారు. Thompson నెగ్గినట్టే కనిపించాడు. Commentator కూడా అదే అభిప్రాయం వ్యక్తపరిచాడు.
Ads
పది సెకన్లయ్యింది. big screen పైన ఇంకా ఫైనల్ standings display కాలేదు. ‘C’mon man, c’mon man’ అని ఓ రెండు సార్లు Thompson తన అసహనాన్ని, ఒత్తిడినీ బయటపెట్టాడు. Lyles మాత్రం Thompson వెనకాలే నిల్చుని పెద్ద screen వైపు చూస్తున్నాడు. నిజానికి అతడు కూడా Thompson ను అభినందించడానికి సిద్ధమైనట్టు కనిపించాడు.
ఆశ్చర్యం… Lyles ను విజేతగా ప్రకటిస్తూ big స్క్రీన్ పైన standings ప్రత్యక్షమయ్యాయి. Thompson నిశ్చష్టుడయ్యాడు. ప్రారంభంలోనే ఎగిరి దుంకిన Lyles సాపేక్షంగా చాలా మంద్ర స్థాయిలో సంబరం చేసుకున్నాడు. Thompson చాలాసేపు షాక్ లో ఉండి, తేరుకున్నాక జర్నలిస్టులకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.
Lyles మైదానమంతా కలియ తిరుగుతూ తన శిక్షకుడు, తల్లి, ఇతర కుటుంబ సభ్యులతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. కన్నీటి బొట్లు రాల్చాడు. ఉద్వేగభరితుడయ్యాడు.
నిర్దేశిత గీతను Lyles, Thompson కంటే సెకనులో 5/1000 వంతు సమయం ముందుగా దాటాడు! 5 మిల్లి సెకన్ల వ్యత్యాసం! సమయం సాపేక్షం అంటే ఏమిటో అర్థమయ్యింది.
జీవితాన్ని గురించి, జీవితపు తాలూకు వైరుధ్యాలను, absurdityనీ ఆటలు చెప్పినంత గొప్పగా మరేవీ చెప్పలేవేమో! పైన చెప్పిన ప్రతీ క్రీడాకారుడి ప్రదర్శన ఒక వ్యక్తిత్వ వికాస పాఠం. గడబిడగా ఉంటావో, గంభీరంగా ఉంటావో… అణిగి ఉంటావో, అతి చేస్తావో… ముభావంగా ఉంటావో, అల్లరిచిల్లరగా కనిపిస్తావో… గెంతుతూ వస్తావో, ఎగురుతూ నిష్క్రమిస్తావో… అంతా నీ ఇష్టం. నీకేది సౌకర్యమో, యుద్ధం ముందర నిన్నేది ఉత్సాహపరుస్తుందో, నీకేది ప్రేరణనిస్తుందో, నీ మనస్సుని లగ్నం చేసేలా సాయపడుతుందో అదే చెయ్యి. ప్రపంచాన్ని పట్టించుకోకు… [ by ముడుంబై మాధవ్ ]
Share this Article