.
చెన్నై… ప్రఖ్యాత ఏవీఎం స్టూడియో అధినేత శరవణన్ కాలం చేశాడు కదా… ఎందరో సినిమా వాళ్లను పోషించాడు తను… అనేక మంది వెటరన్, ప్రజెంట్ సెలబ్రిటీల కుటుంబాల్ని నిలబెట్టాడు… సౌత్ సినిమాకు సంబంధించి తనది ఒక చరిత్ర…
ఆయన భౌతిక దేహాన్ని అభిమానులు, ఐనవాళ్ల సందర్శన కోసం ఉంచారు… అక్కడికి ఒక ఆటో వచ్చింది… ఓ మొహంలో ప్రశాంతత, కళ్లలో కాంతి… ముసలావిడ… శరవణన్ పార్థివ దేహానికి నివాళి అర్పించింది… కన్నీళ్లు పెట్టుకుంది… తిరిగి అంతే సింపుల్‌గా మరో ఆటోలో వెళ్లిపోయింది అందరికీ నమస్కరిస్తూ… ఒక్కతే…
Ads
ఎవరామె..? కాంచన… అసలు పేరు పురాణం వసుంధరా దేవి… వయస్సు 86 సంవత్సరాలు… ఒకప్పుడు టాప్ హీరోయిన్ల జాబితాలో వెలిగిపోయిన తార… మరేమిటి, ఈ వయస్సులో ఎలా అంటారా..? మిత్రుడు Mohammed Rafee చెప్పినట్టు…
ఆమె ‘‘ఇచ్చుటలో వున్న హాయి’’ అనే సూత్రాన్ని నమ్ముకుంది, ఆచరణలో పెట్టింది… తన యావదాస్తీ తిరుమల వెంకన్నకు సమర్పించింది… తను బెంగుళూరు శివారులో ఓ చిన్న ఇంట్లో (కాటేజీ?) నిరాడంబరంగా, సమీపంలోని ఏదో గుడిలో ఆధ్యాత్మిక సేవలో సామాన్య జీవితం గడుపుతోంది…
ఉన్నదాంట్లో ఇచ్చేయడం అంటే… అది ఇష్టమైనవారికి, అంటే ఆత్మీయులు కావచ్చు, నిరుపేదలు కావచ్చు, భగవంతుడు కావచ్చు! ఎవరికైనా ఇష్టంగా ఇచ్చేసి వున్న దాంట్లో బతకడం ఏదైతే వుందో… అంతకు మించిన ఆనందం ఏముంది అంటుంది కాంచన…
అదీ ఆమె సింప్లిసిటీ..! ఆమె ఎంచుకున్న మార్గం అది… చెన్నైలో ఒకప్పుడు ఆమె కూడా దర్జాగా బతికింది… కానీ, ఉన్నదాంట్లో సర్దుకోవాలి, చివరిదశలో ఆస్తి ఎత్తుకెళ్ళేది ఏమీ లేదనే తత్వం తెలిసి, కోట్ల ఆస్తి కలిగిన భూమిని విరాళంగా ఇచ్చేసింది, అదీ ధార్మిక అవసరాల కోసమే…
(ఈ భూమి కూడా చాలా ఏళ్లు న్యాయవివాదంలో నలిగిందే, చివరకు గెలిచింది.,. ఆశలు వదిలేసుకున్న ఆస్తి ఆ వెంకన్న దయవల్లే దక్కింది అనుకుంది… ఆ దేవుడికే అప్పగించేసింది… నిజ అర్పణం…)
ఆమెది తెలుగు కుటుంబమే.., కానీ పుట్టింది బెంగుళూరులో… చదువు అక్కడే… మొదట్లో ఎయిర్‌హోస్టెస్… తరువాత నటి… తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ సినిమాల్లో బోలెడు హిట్స్… అప్పట్లోనే పాన్-ఇండియా స్టార్…
ఆమె చూపించిన దాతృత్వం కథల్లో చదువుకున్నాం, సినిమాల్లో చూసాం… నిజ జీవితంలో కాంచన జీవితంలో చూస్తున్నాం… నూటికో కోటికో ఒక్కరు ఉంటారు ఇలా… ఆడంబరాలను, విలాసాలను, ఆధునిక జీవితపు సౌఖ్యాల్ని, సౌకర్యాల్ని వదిలేసి… ఏళ్లుగా అలవాటైన రంగుల జీవితాన్ని వదిలేసి… ఆ చెన్నైని కూడా వదిలేసి… తను నమ్మిన ఆధ్యాత్మిక మార్గంలో నిశ్చింతగా సాగిపోతున్న కాంచన… ఓ కోణంలో అచ్చంగా కాంచనమే..!!
- ఎలాగంటే..? ఆమె 86 ఏళ్ల వయస్సులో కూడా ఆరోగ్యంగా ఉంది, అనేక విజయాల్ని రుచిచూసింది, ఇవ్వడంలో ఉన్న సంతృప్తి తెలిసింది, ఆధ్యాత్మిక మార్గంలో సాగుతోంది… నిశ్చింతగా, ప్రశాంతంగా… అదీ ఆదర్శం… అన్ని వ్యామోహాల్నీ వదిలేసి, ఏ బంధాలూ లేకుండా..!! ఒంటరిగా, ఆ దేవుడే తోడుగా..!! దీన్నే ముక్తిమార్గం అంటామా..?
నర్సింహస్వామి అనే మిత్రుడు కామెంట్లలో చెప్పిన మరో విషయం… ఆమె టీటీడీకి ఇచ్చిన ఆస్తి విలువ 100 కోట్లు… అంత ఆస్తిని స్వామికి అర్పించడం అంటే మాటలు కాదు… అదీ ఖరీదైన ప్రాంతంగా పరిగణించే టీనగర్‌లోని ఆస్తి అది… అక్కడ టీటీడీ పద్మావతి తాయారు గుడి కట్టారు…. కాంచన ధన్యజీవి…

Share this Article