నన్ను వేధించిన వేటూరి… వేటూరి సుందరరామ్మూర్తిగారితో నా తొలి పరిచయం 2005 లో.
ఓ రోజు షడన్ గా అటెండర్ వచ్చి సార్ వేటూరి అంట.. ఓ ముసలాయన వచ్చారు .. కిందే ఉంచి పైకి వచ్చాను అన్నాడు ..
నాకు ఒక్కసారి భయం వేసి లిఫ్ట్ వైపు కూడా చూడకుండా కిందకి పరిగెట్టా !
నిజమే సాక్షాత్తు వేటూరి సుందర రామమూర్తిగారే…
అయ్యా నమస్కారం మీరేమిటి ఇలా వచ్చారు అన్నా ఖంగారుగా …
నా సిరికాకొలను చిన్నది పుస్తకం ఆవిష్కరణ ప్రెస్ ఇన్విటెషన్ ఇద్దామని వచ్చా .. ఈ పని సీవీఎల్ చూసుకుంటా అన్నాడు.. అయినా నేనే ఇలా తెగబడ్డా అన్నారు.
ఈ సీన్ జరిగిన ఓ నాలుగేళ్లకు ఆయన ఇంటికి వెళ్లా ..
ఏమిటి విషయం అన్నారు…
పింగళి నాగేంద్రరావు గారి నాటకాలు అచ్చు వేస్తున్నా అన్నా ..
ఒకే కుటుంబం దొరికిందా? అన్నారు ఆయన.
లేదు వెతుకుతున్నా అన్నా ..
మా బావే దాని పబ్లిషరు నాగేశ్వర్రావు .. వాడి కూతురు బెజవాడ స్త్రెల్లా కాలేజి లో పని చేస్తోంది… వెళ్ళు దొరికేస్తుంది అని అరిచారు.
సరే అని మర్నాడు బెజవాడ వెళ్లి ఆవిడ్ని కలిశాను…
మావయ్య చెప్పారండి నేను మీరొస్తారని పుస్తకం తోనే కాలేజ్ కు వచ్చా..అన్నారావిడ. పుస్తకం చేతిలో పెట్టి.
అది డిటిపి కి ఇచ్చేసి మళ్లీ వేటూరి దగ్గరకు వెళ్ళా..
గమ్మత్తు చావు దొరికిందా? అన్నారు మళ్లీ ..
లేదు అన్నా .. అది కృష్ణా పత్రికలో వచ్చింది..
సాధనాల స్వామి నాయుడు అని ఖమ్మంలో ఉంటాడు..
ఆయన కృష్ణా పత్రిక ఇండెక్స్ చేశాడు..
ఆయన్ని కలిస్తే .. అన్నారు.
నేను పొద్దున్నే వెళ్ళిపోయి పని చూసుకుని వచ్చేశా…
ఇలా….
పింగళీయం పేరుతో పింగళి నాటకాలు రెండు సంపుటాలుగా తీసుకురావడంలో … వేటూరి ఓ చెయ్యి వేశారు .
కానీ
ఆయనతో వచ్చిన గొడవేంటంటే…
ఆ పుస్తకానికి తానే ముందుమాట రాస్తాను అన్నారు వేటూరి.
ఇంకెవరితో అయినా రాయిస్తే ఊరుకోను అని వార్నింగ్ కూడా…
Ads
రోజూ సాయంత్రం ఆరింటికి అమీర్ పేట వారింటికి వెళ్లేవాణ్ణి.
పదకొండు వరకు ఆయనతో ఏవేవో సాహిత్య సామాజిక రాజకీయఅంశాలపై చర్చా గోస్టి నడిచేది.
ఏ రోజైనా వెళ్లకపోతే ఫోన్ చేసి ఎక్కడున్నావ్? నేను అక్కడికే వచ్చేయనా అనేవారు.
అయ్యా మీరు ఉండండి నేను వచ్చేస్తున్నా అని బండేసుకుని వెళ్లిపోయేవాణ్ణి.
అతను నేను రాయను కావాలనే వేధిస్తున్నాను అనుకుంటున్నాడేమో?
అతనితో మాట్లాడుతూ నన్ను నేను సిద్ధం చేసుకుంటున్నా అది అతనికి చెప్పండి అని మండలి బుద్ధప్రసాద్ గారితో ఫోన్ చేయించారు ఓసారి.
ఇలా టైప్ అయిపోయిన తర్వాత ఓ రెండు నెల్లు వెయిట్ చేసి…
సార్ ఈ నెల 22 నేను ప్రింటింగ్ కు వెళ్లిపోతున్నా అన్నా…
ఇరవైన ఆయన్ని కలిసా…
అయితే నువ్వు ప్రింట్ మొదలెట్టు నేను నీకు మెయిల్ చేయిస్తా అన్నారు.
సరే అని అమీర్ పేటలోనే బెజవాడ బస్సెక్కి వెళ్లిపోయా…
21 ప్రింటింగ్ కు ఇచ్చేసా..
22 ఫోను … వేటూరి వెళ్లిపోయారు అని…
ఒక్కసారి ఏడుపొచ్చింది…
ఇలా చేశాడేమిటి ఈయన అని కోపం…
పుస్తకం ఆయన ముందుమాట లేకుండానే వచ్చేసింది…
అయితే తర్వాత తెల్సిన విషయం ఆయన రాయడం ప్రారంభించారు…
కాకపోతే ముందుమాట పరిధి దాటి ఓ రీసెర్చ్ పేపర్ లా నడిచింది…
అందుకే ఆలస్యం అయ్యింది…
ఆ రాసినంత వరకూ రీ ప్రింట్ లో వాడుతున్నా…
వేటూరి గారింటితో అనుబంధం కొనసాగుతూనే ఉంది.
వారి కుమారుడు రవిగారి కోసం
ఇప్పటికీ వారింటికి వెళుతూనే ఉంటా…
……
ఆయన గాంధేయుడు… కొంత యాంటీ కాషాయం ఉండేది…
ఈ కామన్ ఏరియా … ఉండడం వల్లే ..
ఆయనతోనూ … డివి నరసరాజు గారితోనూ కన్వీనియంట్ గా ఫీలయ్యేవాణ్ణి..
ఇద్దరిలో కామన్ ఏమిటంటే మాట్లాడడం మొదలుపెడితే ఎక్కడెక్కడికో వెళ్లిపోయేవారు…
అలా వినడం ఓ భోగం… (Rangavajhala bharadwaja)
Share this Article