ఒక వార్త ఆసక్తికరంగా అనిపించింది… మన తెలుగు మీడియా పెద్దలకు ఆనలేదు కానీ ఈ వార్తలో ఓ కనెక్టింగ్ ఎలిమెంట్ ఉంది… ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకర్ తనకు చిన్నప్పుడు చదువు చెప్పిన ఓ టీచర్‌ను కేరళలోని ఆమె స్వస్థలానికి వెళ్లి కలిసి ఆశీస్సులు తీసుకున్నాడనేది వార్త…
జగదీప్ 1951లో పుట్టింది రాజస్థాన్‌లోని ఓ మారుమూల కుగ్రామం కితానా… ఎక్కడి రాజస్థాన్..? ఎక్కడి కేరళ..? ఈ గురుశిష్య సంబంధం ఏమిటా అని ఆలోచిస్తున్నారా..? రాజస్థాన్, చిత్తోర్‌ఘర్, సైనిక్ స్కూల్‌లో జగదీప్ చదువుకున్నాడు… అక్కడ రత్నా నాయర్ అనే టీచర్ పనిచేస్తూ ఉండేది… తరువాత కొన్నేళ్లకు ఆమె తన స్వస్థలం కేరళకు వెళ్లిపోయింది…
అప్పుడెప్పుడో జగదీప్ ఆమెను కలిసినప్పుడు… తప్పకుండా కేరళకు వచ్చి మీ ఆశీస్సులు తీసుకుంటాను టీచర్ అన్నాడు… ఆ మాట గుర్తుంది… ఆమె చదువు చెప్పిన ఆ స్కూల్ విద్యార్థుల్లో చాలామంది చాలా మంచి పొజిషన్లలో ఉన్నారు… (ఎక్కువగా సైన్యంలో…) అలాంటివాళ్లలో జగదీప్ ఏకంగా ఉపరాష్ట్రపతి పొజిషన్‌కు చేరుకున్నాడు… తనకు కొన్నాళ్లు చదువు చెప్పిన టీచర్‌ను మరిచిపోకుండా, వెళ్లి కలవడమే ఈ వార్తలోని కనెక్టింగ్ ఎలిమెంట్…
Ads
జగదీప్ కాస్త కంట్రవర్సీ కేరక్టరే… ఫిజిక్స్‌లో డిగ్రీ చేశాడు రాజస్థాన్ యూనివర్శిటీలో… తరువాత ఎల్ఎల్‌బీ చేశాడు… లాయర్ అయ్యాడు… దేశంలోని అగ్రశ్రేణి లాయర్లలో ఒకడయ్యాడు… రాజకీయ నాయకుడిగా మారాడు… 2019లో పశ్చిమ బెంగాల్ గవర్నర్ అయ్యాడు… అక్కడ సీఎం మమత బెనర్జీతో రోజూ నిప్పుఉప్పు యవ్వారమే… అనేకసార్లు ఆయన్ని పరాభవించింది ఆమె… సరే, అదంతా వేరే కథ… సుప్రీంకోర్టు కొలీజియం మీద కూడా వ్యాఖ్యలు చేశాడు జగదీప్…
ఆయన కేరళ పర్యటనకు వెళ్లాడు మొన్న… భార్య సుదేష్ ధనకర్ కూడా ఆయనతోపాటు ఉంది… టీచర్ రత్నా నాయర్ ఇంటికి వెళ్లాడు… ఉపరాష్ట్రపతి తన ఇంటికి వస్తున్నాడని విని మొదట్లో రత్నా నాయర్ నమ్మలేదు… ఇంటికి వచ్చిన శిష్యుడికి కొబ్బరి నీళ్లు, ఇంట్లో తనే వండిన ఇడ్లీలను, అరటి చిప్స్ పెట్టింది…
జగదీప్ ‘గురుదక్షిణ’ ఏం కావాలని అడిగాడు అభిమానంతో… అంతే వాత్సల్యాన్ని ప్రదర్శించిన ఆమె… నువ్వు గురువును మరిచిపోకుండా, అభిమానంగా ఇక్కడి దాకా వచ్చావు కదా, ఈ దక్షిణ చాలు అని బదులిచ్చింది… తను బతుకుతున్న సమూహంలో ఈ వీవీఐపీ పర్యటన ఆమెకు ఎంతో విశేషమైన గుర్తింపు కదా… ఆ మర్యాదకు మించి ఏం కావాలి..?
‘‘ధనకర్ బాగా గుర్తున్నాడు… ఖాకీ యూనిఫాంలో మొదటి వరుస బెంచీలపై కూర్చునేవాడు… పాఠాల మీద బాగా కాన్సంట్రేట్ చేసేవాడు… చురుకుదనం ఎక్కువ… క్రమశిక్షణ, విధేయత కూడా గమనించాను… క్లాసు బయట యాక్టివిటీ కూడా ఎక్కువే… మంచి వక్త… మంచి ఆటగాడు కూడా…
ఇంకా గుర్తుంది… ఏడాదిలో 9 నెలలపాటు స్కూల్‌లో ఉంటారు పిల్లలు… వాళ్ల తల్లిదండ్రులతో రెగ్యులర్ మీటింగ్స్ ఉండేవి… ధనకర్ తండ్రి తన ఇద్దరు పిల్లల బాగోగులు చూడటానికి, చదువు ప్రోగ్రెస్ పరిశీలించడానికి రెగ్యులర్‌గా ఈ మీటింగ్స్‌కు వచ్చేవాడు…’’ అని చెప్పింది రత్నా నాయర్… ఉపరాష్ట్రపతి పర్యటన సమయంలో కేరళ స్పీకర్ ఏఎన్ శంషీర్ కూడా తనతో ఉన్నాడు… నో పాలిటిక్స్… అందుకే వార్త నచ్చింది…
Share this Article