విద్యాబాలన్… మంచి నటి… వీసమెత్తు సందేహం లేదు… ఆమె హఠాత్తుగా ప్రఖ్యాత గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి జయంతి సందర్భంగా ఓ ఫోటో షూట్ చేయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఆసక్తి రేపుతోంది… విశ్వ స్వరవీథుల్లో భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని వినిపించిన ఆమెది పరిపూర్ణ, సార్థక జీవనం… ఆమె కథ ఖచ్చితంగా ఓ బయోపిక్ చిత్రానికి అర్హం… ఆమె కథ సినిమా కథల్ని మించిన కథ…
ఈమధ్య కొన్నాళ్లుగా బాలీవుడ్ నిర్మాతలు ఎవరో సుబ్బులక్ష్మి బయోపిక్ తీయాలని సంకల్పించినట్టు వార్తలొచ్చాయి… నిజానికి బాలీవుడ్ దాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయలేదేమోననీ, కోలీవుడ్ మాత్రమే ఆ సబ్జెక్టును సరిగ్గా డీల్ చేయగలదనీ అభిప్రాయాలు కూడా వచ్చాయి… ఒకింత నిజమే అనిపిస్తుంది… అవును, ఒక స్మిత తాలూకు డర్టీ పిక్చర్ వేరు, ఒక సుబ్బులక్ష్మి కథ వేరు…
సుబ్బులక్ష్మి సంగీతంలోని ఆత్మను పట్టుకోవాలంటే అది బాలీవుడ్‌తో కాదు… సరే, ఆ వార్తలు రాగానే ఆ సినిమాలో కీర్తిసురేష్ నటిస్తుందనీ వినిపించింది… తను ఆ పాత్రలో ఇమడగలదానే సందేహాలు కూడా ఉన్నాయి… తను ఆ పాత్రను చేయగలదు, కానీ తనకన్నా విద్యాబాలన్ బెటర్ అనే అభిప్రాయాలూ ఉన్నాయి… విద్యాబాలన్‌కు కూడా ఆ ఆశ ఉంది… ఆ పాత్ర చేయాలని… తను విపరీతంగా అభిమానించే సుబ్బులక్ష్మి పాత్ర తన లైఫ్ యాంబిషన్ అన్నట్టుగా తరచూ చెబుతుంది కూడా…
Ads
ఎస్, ఈ ఫోటో షూట్ కూడా ఆమె ఆలోచనను, ఆమె సంకల్పాన్ని బయటపెట్టడం కోసమే అన్నట్టుగా ఉంది… ఏమో, డర్టీ పిక్చర్‌లో చేసినందుకు ఎక్కడో ఏ మూలో కాస్త గిల్టీ ఫీల్ ఉన్నట్టుంది… (నిజానికి అవసరం లేదు, ఆ పాత్రను పాత్ర తత్వానికి తగినట్టు బాగా పర్‌ఫామ్ చేసిందామె…) దాన్ని చెరిపేసుకోవడానికి కూడా సుబ్బులక్ష్మి పాత్ర ఉపయోగపడుతుందనే భావన ఏదో కనిపిస్తోంది… అప్పట్లో ఆ పాత్రను ఆమె చేయడం మీద నెగెటివ్ విమర్శల్ని కూడా భారీగానే ఎదుర్కొంది ఆమె… (స్మిత కథను కూడా కమర్షియల్ నిర్మాతలు ఎక్స్‌ప్లాయిట్ చేశారనే విమర్శలు కూడా..) అవన్నీ విద్య ఎలా మరిచిపోగలదు..?
‘‘చిన్నప్పటి నుంచీ ఆమె పాడిన సుప్రభాతం వింటూ లేచాం, ఆమె పాటలు వింటూ పెరిగాం, ఆమె గొంతులో ఆమె గానంలో ఏదో తెలియని ఆధ్యాత్మిక శక్తి ఉంది… ఈ ఫోటోలు ఆమెకు నివాళులర్పించడం మాత్రమే’’ అంటోంది విద్యాబాలన్… కాదు, అంతకుమించి ఏదో ఆశ, ఏదో ప్రయత్నం… తన సన్నద్ధతను, తన ఇష్టాన్ని నిర్మాతలకు ఇలా తెలియపరుస్తోంది ఆమె.,
ఐదారు ఫోటోలు… అచ్చంగా సుబ్బులక్ష్మి ఆహార్యంతో ఉన్నయ్ ఫోటోలు… నిజంగా ఆమె ఆ పాత్రను సరిగ్గా నప్పుతుంది అన్నట్టుగా ఉన్నాయి… మొహంలో ఆ ప్రశాంతత, ఆ నిండుతనం కనిపిస్తున్నాయి… ‘‘సుబ్బులక్ష్మి చీరలు స్పెషల్, అవి ఆమె హుందాతనానికి నిండుతనం తీసుకొస్తాయి’’ అంటుంది విద్యబాలన్…
అందుకే అచ్చంగా సుబ్బులక్ష్మిని పోలినట్టే… రెండు ముక్కుపుడకలు, కొప్పు, మల్లెపూలు, రెండు బొట్లు, భుజాలపై నుంచి పైట… భారతీయ స్త్రీ మూర్తి ఆమె… సుబ్బులక్ష్మి మనమరాలి సహకారం కూడా తీసుకుని అలాగే తయారైంది… మనసులో ఆ తాదాత్మ్యతను నింపుకుని మరీ కనిపిస్తోంది విద్యాబాలన్… ఆమె ఇన్‌స్టా పోస్టుకు ఐదున్నర లక్షల లైకులు, 6500 కామెంట్లు… అందులో అధికభాగం ఆమే ఆ పాత్రకు అర్హురాలు అని చెబుతున్నాయి… విద్యాబాలన్ మంచి నటి మాత్రమే కాదు, తెలివైన మార్కెటింగ్ స్ట్రాటజిస్టు కూడా..!!
Share this Article