నిస్సందేహంగా ఈ విషయంలో తప్పంతా విజయసాయిరెడ్డిదే… జర్నలిజంలో గానీ, రాజకీయంలో గానీ ఓ సూత్రం ఉంటుంది… ఎవరైనా సర్పంచో, మండలాధ్యక్షుడో ప్రధానిని తిడుతూ ఓ రాజకీయ ప్రకటన జారీ చేస్తే, పత్రికాఫీసుల్లో దాన్ని చెత్తబుట్టలో పడేస్తారు… అంటే, స్థాయీభేదం… ఇక్కడ ప్రధాని గొప్పోడని, సదరు మండలాధ్యక్షుడు కాదనీ కాదు..! విమర్శ, ప్రతివిమర్శ, స్పందన, ఖండన… ఏదైనా సరే ఈ సూత్రాన్ని పాటిస్తుంటారు…
ఏపీ రాజకీయాల్నే తీసుకుందాం… జగన్ కేవలం చంద్రబాబు విమర్శలకే స్పందిస్తాడు… అదీ ఎవరో మంత్రులకు చెబుతాడు రియాక్ట్ కావాలంటూ..! అంతే తప్ప తను నేరుగా ప్రెస్‌మీట్ పెట్టేసి, చంద్రబాబును తిట్టేయడు… ఎక్కడైనా పొలిటికల్ మీటింగు పెడితే మాత్రం అక్కడ చంద్రబాబును ప్రస్తావిస్తాడు… ప్రతి దానికీ ఓ లెక్క ఉంటుంది… తను ఓ ప్రత్యర్థి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శలనే పెద్దగా పట్టించుకోడు, రియాక్ట్ కాడు…
సేమ్, చంద్రబాబు కూడా ఇతర పార్టీలకు చెందిన ఎవరెవరో ఏవేవో విమర్శలు చేస్తే స్పందించడు… కానీ విజయసాయిరెడ్డి బండ్ల గణేష్‌తో ట్విట్టర్‌లో పెట్టుకున్న వాగ్వాదం ఆశ్చర్యపరిచింది… వైసీపీలో విజయసాయి చాలా కీలకనేత… మరి బండ్ల గణేష్… అసలు తనది ఏ పార్టీ..? తన మాటలకు ఉన్న విలువేమిటి..? తనతో ఈ ట్వీట్ల పంచాయితీ ఏమిటి..?
Ads
ఇక్కడ బండ్ల గణేష్‌ను సమస్కంధుడిగా భావిస్తున్నట్టా..? విజయసాయి ఒకటి అంటే బండ్ల పది అంటాడు… తనకు పోయేదేముంది..? ఏ టీవీ5 ఆఫీసులోనో కూర్చుని, ఏ మూర్తికో ఇంటర్వ్యూలు ఇస్తుంటాడు… నిజానికి బండ్ల గణేష్ అయినా, విజయసాయి అయినా… ఇతర లీడర్లు అయినా సొంతంగా ట్వీట్లు రాస్తూ కూర్చోరు… వాటిని ఆపరేట్ చేయడానికి వేరు మనుషులుంటారు…
అయితే వాళ్లు ఏం రాస్తున్నారు..? ఏం పోస్ట్ చేస్తున్నారనేది అప్పుడప్పుడూ చూసుకోవాలి… విజయసాయి ట్వీట్ ఆపరేటర్ ఎవరో గానీ ఉత్సాహం ఎక్కువే… కానీ వాడే భాష సాయిరెడ్డికి సూటయ్యేది కాదు కొన్నిసార్లు… అలాగే ప్రతి అంశం మీదా స్పందించడం అనవసరం… ఒకవేళ బండ్ల గణేష్ ట్వీట్లు తనకు చిరాకు కలిగించినా సరే సాయిరెడ్డి స్పందించకుండా ఉండాల్సింది…
రాజకీయాల్లో ఉన్నప్పుడు అనేకమంది అనేకరకాలుగా నిందిస్తుంటారు… మెచ్చేవాళ్లు ఉంటారు, తిట్టేవాళ్లు కూడా ఉంటారు… సహజం… అయితే వేటికి స్పందించాలనేదే ఇక్కడ ముఖ్యం… ఒక ముఖ్యమైన స్థానంలో ఉన్నప్పుడు ప్రతి పదాన్ని ఆచితూచి వాడాలి… అది అవసరమైనవాళ్ల మీదే వాడాలి… సో, బండ్ల గణేష్‌తో సాయిరెడ్డి ట్వీట్ల వివాదంలో తప్పు సాయిరెడ్డిదే… ఒక డౌట్… తన పేరిట వస్తున్న ట్వీట్లను ఆయన ఎప్పుడైనా చూసుకుని, సమీక్షించుకుంటాడా..?!
Share this Article