కమల్ హాసనే పెద్ద అట్రాక్షన్ తెలుసా..? 67 ఏళ్ల వయస్సులో ఆ ఫైట్లు, ఆ ఎనర్జీ… ఎహె సూపర్ పో
సర్లేవోయ్… చిరంజీవి, వెంకటేష్, రాజశేఖర్, మమ్ముట్టి, మోహన్‌లాల్, ఇంకా పెద్దాయన రజినీకాంత్ 71 ఏళ్లు… సౌత్ ఇండియాలో హీరోలకు వయస్సుతో పనేముంది..? చేసేస్తారు… సినిమా ఎలా ఉందో చెప్పు… వయస్సు కనిపించకుండా డాన్సుల్లో, ఫైట్లలో గ్రాఫిక్స్ వాడేస్తారు పర్లేదు… ఐనా కమల్ ముసలి అయిపోతున్నా సరే, ఫుల్ ఎనర్జిటిక్ అని చూడటానికి థియేటర్‌కు పోవాలా..?
హబ్బా… కమల్ మాత్రమే కాదు… విజయ్ సేతుపతి ఉన్నాడు, ఫహాద్ ఫాజిల్ ఉన్నాడు, మధ్యలో సూర్య కనిపించిపోతాడు… సూపరో సూపర్ తెలుసా..?
Ads
అది సర్లేవోయ్… కమల్ ఉన్నాక ఈ ఫాజిల్ దేనికి..? సేతుపతి దేనికి..? మధ్యలో సూర్య మర్యాద దర్శనం ఎందుకు..? ఐనా ఫస్టాఫ్‌లో అసలు ఓ పావుగంట మినహా అసలు కమల్ కనిపించడట కదా… ఇక కమల్ సినిమా అంటారేమిటోయ్…
అంటే మరి మిగతా వాళ్లకూ ప్రాధాన్యం ఉండాలి కదా…
అలాంటప్పుడు కమల్ సినిమా అనకు… జస్ట్, దర్శకుడు కనకరాజ్ సినిమా అని చెప్పు…
సరే, అలాగే… ఖైదీ, మాస్టర్ సినిమాల డైరెక్టర్… అసలు కనకరాజ్ టేకింగ్, స్క్రీన్-ప్లే, కథనం ఇరగదీసేశాడు తెలుసా..?
గుడ్, గుడ్… అంత దమ్మున్నోడు మరి ఖైదీ నుంచి, పాత విక్రమ్ నుంచి కూడా స్పూర్తి, లింక్స్ ఎందుకు పొందాడు, కమల్‌కు తోడుగా ఈ ఇద్దరు ముగ్గురు దేనికోయ్…
కథ డిమాండ్ చేసింది…
అదే అడిగేది, కథ అలా ఎందుకు డిమాండ్ చేసింది..? తనొక్కడూ సినిమాను లాగలేడు అనుకున్నాడా దర్శకుడు..? పైగా కమల్ వీరాభిమాని అంటారు తనను…
ఎహె… అది వదిలెయ్… యాక్షన్ సీన్లతో దర్శకుడు పిచ్చెక్కించాడు తెలుసా..? ఆ టేకింగ్, ఆ ఎడిటింగ్, ఆ బీజీఎం, ఆ సినిమాటోగ్రఫీ అదిరిపోయాయి…
ఓహో, యాక్షన్ అంటే ఆ ముగ్గురి నటనా..? ఫైట్లూ గట్రా ఢిష్యూం డిష్యూం సీన్లా..?
నటనలో విశ్వరూపం చూపించారు ముగ్గురూ….
వాళ్లకు వంక పెట్టడానికి ఏముందోయ్, సీన్ చెబితే అల్లుకుపోతారు… జగమెరిగిన స్టార్లు… ఇంతకీ హీరోయిన్లు ఎవరో…
అలాంటి వికారాల జోలికి పోలేదు… సినిమా అంతా దడ దడ, పేలుళ్లు, కాల్పులు… మాఫియా యవ్వారం… ఫాజల్ అండర్ కవర్ ఆఫీసర్… కమల్ అటూఇటూ ఉండే కేరక్టర్… అంటే, విలన్ అంటే ఎవడో మార్స్ నుంచి దిగిరారు, మనలోనే ఉంటారు అని చెప్పే కేరక్టరైజేషన్… ముఖ్య పాత్రలన్నీ వేర్వేరు షేడ్స్ చూపిస్తాయి…
వార్నీ, మళ్లీ అదే మాఫియా, అదే అండర్ కవర్… ఈమాత్రం కథకు ఆ ముగ్గురూ దేనికోయ్… మరి హీరోయిన్లు…
ఎవరో చోటాచోటా కేరక్టర్లు… సగటు సౌత్ సినిమా ఫార్ములా ఉండదు…
అవునా..? కామెడీ..?
ఉండదు… అంతా సీరియస్ మ్యాటర్….
సరే, ఓటీటీలో వచ్చేదాకా ఆగొచ్చునన్నమాట… టీవీలో వచ్చినప్పుడు చూసినా పర్లేదు కదా…
నో, నో… థియేటర్లలోనే చూడాలి… ఆ సౌండ్, ఆ గ్రిప్పింగ్ నెరేషన్… ప్రత్యేకించి యాక్షన్ సీన్లతో థియేటర్ దద్దరిల్లిపోతుంది తెలుసా..?
నాకు వినోదం కావాలోయ్… అంతలేసి టికెట్ రేట్లు పెట్టి, థియేటర్‌కు వచ్చి, వాళ్ల దోపిడీ భరించి చూడాలంటే… సినిమా ఓ రేంజ్‌లో నన్ను రప్పించేలా ఉండాలి కదా…
ఓటీటీలో కూడా రేట్లు పెడతారు… ఎహె, నువ్వు సినిమా ప్రియుడివి కావు… నటనలో నాలుగు శిఖరాలు కనిపించే సినిమా మళ్లీ వస్తుందా చెప్పు… ఎంజాయ్ చేయాలబ్బా…
సరే, చేద్దాంలే గానీ… ఓటీటీలో రిలీజ్ డేట్ ప్రకటిస్తే కాస్త గుర్తు చెయ్యి…
నువ్వు మారవు…
అవును, సౌత్ సినిమా మారదు, నేనెందుకు మారాలి..?! ఈ వయస్సులో ఈ కమర్షియల్, ఫార్ములా వేషాలు దేనికి..? కాస్త తనలో ఇంకా నటుడు ఉన్నాడని చెప్పుకునే మంచి పాత్రలు చేయొచ్చుగా…. ఈ ముసలి హీరోలు మారరు… మారరు… కమల్ అంటే కొత్తదనం, ప్రయోగం… కమల్ అంటేనే నాలాంటి అభిమాని అంచనాలు ఓ రేంజులో ఉంటాయి… అవి లేనప్పుడు సాదాసీదా హీరో అయినా ఒకటే… కమల్ అయినా ఒకటే… అంతే…
Share this Article