Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పొగడపూల పరిమళమే విమల ‘వగరు జ్ఞాపకాల నవ్వు’..!!

October 20, 2024 by M S R

.

పొగడపూల పరిమళమే
విమల ‘వగరు జ్ఞాపకాల నవ్వు’

……………………………………….
కల్లోలిత ప్రాంతాలను కవిత్వంగా మార్చగలదు.
విరిగిపోయిన కలలకు కట్టు కట్టగలదు.
నిరాశల నీడల మీద నీలిపూల వాన కురిపించగలదు.
పాడులోకపు శోకాన్ని తన గొంతులో పలికించగలదు. ఎండిన కన్నీటి చారికల వెనక దాగిన విషాదాన్ని గొంతెత్తి పాడగలదు.
అమర వీరుల సమాధుల మీద పున్నాగ పూలై పరిమళించగలదు. అడవి దారుల్లో చీకటి రాత్రుల్ని అక్షరాల వెన్నెల దీపాలతో వెలిగించగలదు.
ఈ బతుకున్నదెందుకు? బతకడానికేగదా అని నిట్టూర్పో, వోదార్పో తెలియకుండా రాయగలదు. భాషా సౌందర్య రహస్యాన్ని ఏనాడో కనిపెట్టిన ఈ కవి, అమోఘమైన, ఇంద్రియాతీతమైన అనుభూతి ఇవ్వగలిగే రచయిత్రి… ఇంతకీ కవిత్వం అంటే ఏమిటి? అని మన కళ్లల్లోకి సూటిగా చూస్తూ అడగ్గలదు.

Ads

కవిత్వం ఒక కల. ఆ కల పేరు విమల.
ఇక్కడే హైదరాబాదులోనే పుట్టింది. ఈ నగరంలోనే చదువుకుంది. ఉద్యమాలై ప్రవహించిన ఒక తరంతో కలిసి నడిచింది. నినాదాలై గొంతు చించుకుంది. ఆగ్రహ ప్రదర్శనల్లో పిడికిలి బిగించింది. యోగ్యతా పత్రంలో చలం అన్న రైటియస్ ఇన్డిగ్నేషన్ కి నిజమైన అర్థంలా తిరుగుబాటు కవిత్వంతో షాక్ చేసింది. ‘సౌందర్యాత్మక హింస’ రాసి రెబెల్ గా, ఫైర్ బ్రాండ్ ఫెమినిస్టుగా, బాధితులకు బ్రాండ్ అంబాసిడర్ గా పేరుతెచ్చుకుంది.

2009లో వెల్లువలా వచ్చిన విమల కవిత్వం ‘మృగన’ చదివారా? అందులో చివరి కవిత
‘ఓ నా ప్యారీ జాన్’ గుర్తుందా?
‘అడవి ఉప్పొంగిన రాత్రి’లోని కవితలు అనుభూతి గీతాలై మిమ్మల్ని అల్లుకున్నాయా?
ఇపుడు వచ్చిన కొత్త పుస్తకం ‘వగరు జ్ఞాపకాల నవ్వు’… ఎంత చక్కని పేరు!
ఎన్ని కన్నీళ్లను దాచుకున్న బాధో ఇది!
గాయపడిన జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్న వేదనకి అక్షర రూపమే విమల కవిత్వం.
నిస్సహాయతనీ, నిరసననీ, మండుతున్న నిప్పులుగా మార్చిన కవి మద్దూరి నగేష్ బాబుకి అక్షరాలా ఫిమేల్ కౌంటర్ పార్ట్ విమల.
సత్యమూర్తి వాగ్దానం చేసిన రేపటి సూర్యోదయపు తొలి వెలుగు విమల.
ఎర్ర శాలువా కప్పుకుని, రివాల్వర్ పట్టుకుని
మన మధ్యే తిరుగుతున్న కవి దొంగ
కామ్రేడ్ కృష్ణశాస్త్రి విమల!

***
విమల గారు నాకు కొద్దిగా తెలుసు. పరిచయం మాత్రమే! రక్తాశ్రవులతో రాసే ఆమె కవిత్వం మాత్రం బాగా తెలుసు. హైదరాబాద్, ఆనంద్ నగర్ కాలనీలో మా ఇల్లు… ఖైరతాబాద్ దగ్గర్లో ఆర్టిస్టు మోహన్ ఆఫీసు… మధ్యలోనే విమలగారిల్లు. ఆమె ‘మృగన’ కవితా సంపుటికి బొమ్మల కోసం మా ఆఫీసుకు వచ్చేది. ఒక పెద్ద కవినీ, ఒక పెద్ద ఆర్టిస్టునీ చూసి నేనెంతో మురిసిపోయేవాడినని విమలగారికి కానీ, మోహన్ కు కానీ నేనెప్పుడూ చెప్పలేదు. మృగన కవర్ పేజీ మోహన్ ఎంతో ప్రేమతో వేశాడు. ప్రపంచ ప్రఖ్యాతమైన జపాన్ లెజండరీ ఆర్టిస్టు హొకుసాయ్ వేసిన కల్లోల సముద్ర కెరటాన్ని మోహన్ కాపీ చేశాడు. ఆ కెరటం మీద ఒక చిన్న సీతాకోక చిలుకను వేశాడు. ఎగసిన విప్లవోద్యమ కెరటం మీద రెక్కలల్లార్చుతూ వాలుతున్న కవిత్వమే విమల.

అయ్యో, నేను కూడా తక్కువాడినేమీ కాదు. విమల అనే మహాకవికి మంచినీళ్లిచ్చిన అదృష్టవంతుడిని. టీ కూడా ఇచ్చానులెండి.
ఓ రోజు, మద్రాసులో కవి అజంతా రోడ్డు మీద నడిచి వెళుతున్నాడు. ఎదురుగా వస్తున్న వ్యక్తిని దూరం నుంచే చూసి గుర్తుపట్టాడు. చటుక్కున తిరిగి పక్క వీధిలోకి తప్పుకున్నాడు అజంతా. ఎందుకలా? అని ఒక మిత్రుడు అడిగితే, ఎదురుగా వస్తున్నవాడు శ్రీశ్రీ అని చెప్పాడు అంజంతా.
అంత కాంతిని భరించడం కష్టం కదా మరి!
విమల గారి కవిత్వం అంటే ఎంత ఇష్టం వున్నా, ఆమెకు దూరంగా ఉండటానికే ఇష్టపడ్డాన్నేను. నిలువెల్లా కవిత్వమై నడిచి వచ్చే విమలగార్ని చూడటమే చాలు కదా!

హియాలయాల్లో వందేళ్లకోసారి పూసే అరుదైన కవితా పుష్పం పేరే విమల మోర్తల!
ఎం.ఎస్.నాయుడి కవిత్వం గురించి ఒక సభలో విమల మాట్లాడారు. మోహన్ సంతాప సభలో ఆమె ఉద్వేగం నన్ను కకావికలు చేసింది. మొన్నటికి మొన్న కృపాకర్ మాదిగ సభలో విమల ప్రసంగం ఒక అద్భుతం. ఎంత క్లారిటీ!
ఎంత కన్సర్న్! ఎంత గొప్ప ఎక్స్ ప్రెషన్ ఆమెది, రాసినా… మాట్లాడినా… ప్రొటెస్ట్ చేసినా!

***
పుచ్చలపల్లి సుందరయ్య అనే పెద్ద నాయకుడు తాను రెడ్డినని ఎప్పుడూ చెప్పుకోలేదు. పేరు నుంచి ఆ రెండక్షరాల్ని తొలగించారు. ఈ మోర్తలోళ్ల అమ్మాయి విమల కూడా ఏనాడూ రెడ్డినని చెప్పదు. అలా చెప్పుకోడానికి ఇష్టపడదు. చివర కులం పేరు తగిలించుకోవడానికి సిగ్గుపడే, చిరాకుపడే ఒక పాత తరానికి చెందిన మనిషి ఆమె. ఆదర్శంగా నిలవాలనే తపన ఆమెది.
విమలంటే కేవలం కవిత్వమే కాదు. ఎన్నెన్నో వ్యాసాలు రాసింది. ఇప్పటికీ రాస్తోంది. నిరుపేద పాకీ వాళ్ల బతుకుల్ని అధ్యయనం చేసింది. ‘మాకొద్దీ ఛండాలం’ అనే పుస్తకం రాసింది.

‘కొన్ని నక్షత్రాలు కాసిన్ని కన్నీళ్లు’ అంటూ పదమూడు కథలతో పుస్తకం వేసింది. చదివి తీరవలసిన కధలవి. గాఢమైన తాత్వికావగాహనతో ప్రొఫౌండ్ గా చెప్పగలగడం, ఒక ఎమోషనల్ టర్మాయిల్ని శక్తిమంతమైన అక్షరాలుగా మలచడం విమల సూపర్ స్పెషాలిటీ. ఆ భావ మాలికలు, భాషా సోయగంతో మన హృదయాల మీద చెరగని సంతకం చేస్తుందీ రచయిత్రి. శిల్ప నైపుణ్యం వల్లా, ప్రాథమిక మానవతా స్పర్శ వల్లా కథనైనా, కవిత్వాన్ని అయినా అలవోకగా అనుభూతి కావ్యంగా మార్చి మెస్మరైజ్ చేయగల మన కాలపు మంత్రగత్తె విమల.

***
అలనాటి మరాఠీ కవయిత్రి బహినా బాయి చౌదరి ఫెమినిస్టు కవిత్వం గుర్తుందా?
మలయాళీ కమలాదాస్, పంజాబీ అమృతాప్రీతం కవిత్వం మిమ్మల్ని డిస్టర్బ్ చేసిందా?
ఇంగ్లీషులో రాసే సుజాతా భట్, యూనిస్ డిసౌజాల కవితావేశం మీ రక్తనాళాల్లో కలిసి ప్రవహించిందా? ఉర్దూలో రాసే మౌమితా ఆలం అక్షరాలకి నా లాగా మీరూ బానిసలేనా?
భారతీయ కళాత్మక కవితాత్మని కళ్ల ముందు కాగితాల మీద పరిచిన వీళ్లెవరికీ తీసిపోని కవి మన విమల.
పొయిట్రీ ఈజ్ ది బ్లడ్ ఆఫ్ ది సోల్ అన్న పాబ్లో నెరుడా మాటలకి నిజమైన రుజువులూ, సాక్ష్యాలూ ఈ ‘వగరు జ్ఞాపకాల నవ్వు ‘లోని
64 కవితలూ!

కవిత్వం ఒక అల్కెమీ… ఆ రహస్యం విమలకు తెలుసని ఇందులో ఏ ఒక్క కవిత చదివినా ఇట్టే తెలిసిపోతుంది. నినాద ప్రాయం అయిపోతున్న వామపక్ష రొడ్డ కొట్టుడు పోరాట కవిత్వాన్ని కన్నీళ్లతో శుద్ధి చేసి, ఒకింత వెన్నెల అద్దిన సంరక్షకురాలు విమల.
రెక్కలు చాపి రివ్వున ఎగిరే పక్షుల్నీ
సీతాకోక చిలుకల్నీ, తూనీగల్నీ ప్రేమించాను.
ఇంకా ఇసుక రేణువుల్నీ, పువ్వుల్నీ
తీరానికి కొట్టుకువచ్చే గవ్వల్నీ ప్రేమించాను….
అని రాసిన విమల విప్లవకవేనా అసలు!

ఒకప్పుడు ఆమె కవితల్లో ఎక్కడో ఓ చోట ఎర్రజెండా ఎగిరేది. నక్షత్రాలు ఎరుపెక్కేవి. చీలికలు పేలికలై ఉద్యమం వూపు తగ్గాక, ఆవేశం చల్లారినాక, తెల్లవారుజాము కలలన్నీ తలుపు సందుల్లోంచి నిశ్శబ్దంగా వెళ్లిపోయాక, ‘జ్ఞాన దిగంబరత్వపు దారి’లోకి వచ్చినట్లున్నారు విమల. హౌ మచ్ లాండ్ డస్ ఏ మాన్ నీడ్ అన్న టాల్ స్టాయ్ కథను గుర్తుచేసుకుంటూ…
నాకప్పుడు…. భూమిని సొంతం చేసుకునేందుకు
పరుగెత్తి పరుగెత్తి సూర్యుడు అస్తమించే వేళ కల్లా
నేలపై పడి మరణించిన వాడి కథ గుర్తొచ్చింది.
అచ్చం వాడిలానే నేను

జ్ఞానం కోసం వెంపర్లాడి, వెంపర్లాడి
తెగనరికిన మహావృక్ష కాండంలోని
అసంఖ్యాక కాలపు వలయాల్లా
ఎన్నెన్ని జ్ఞాపకాల్నో నాలోపల
పొరలు పొరలుగా చుట్టుకొని
ఊపిరాడక మరణించినట్లు ఒకనాడు కలగన్నాను… అని రాసుకన్నారు విమల.
రాసి, తుడిపి, మళ్లీ రాసినప్పుడే
వాక్యాలు పక్షులై ఎగురుతాయ్.
అనే అద్భుతమైన మాటలతో ఈ కవిత ముగుస్తుంది.

***
ఒక అట్టర్ డిసప్పాయింట్ మెంట్ తో కుంగి, పెను చీకటిలాంటి నిరాశలో కూరుకుపోయినపుడు ఒంటరిగా, మౌనంగా మిగిలిపోయారు విమల.
పొయిట్రీ ఈస్ ది డివైన్ సైలెంట్ దట్ ఫాలోస్ ది థండర్ అన్నారు డెరిక్ వాల్కాట్.
‘మౌనం ఒక రహస్య సంభాషణ’ అన్నారు విమల. కవిత్వం ఒక మౌన సంభాషణే కదా మరి!
ఉద్యమ వైఫల్యమూ, అడవి తగలబడిన విషాదమూ వెన్నాడి, దగ్ధగీతమై రగిలిన విమల రాసిన నిరాశ పద్యాలు, తెలుగు ఆధునిక కవితా వికాసపు రహదారుల వెంట పరిమళాలు వెదజల్లే మంచి గంధం చెట్లుగా కలకాలం నిలిచి వుంటాయి.
సముద్రమూ, నేనూ ఒకేసారి
కలిసి జన్మించిన కవలపిల్లలమేమో…
అంటున్నారీ కవి.
అనుమానం లేదు. సందేహమూ లేదు.
కవితా సముద్రమూ, విమలా
కవల పిల్లలే.
విమల- అపురూపమైన వ్యక్తి
ఆమెది- అరుదైన అభివ్యక్తి.
– తాడి ప్రకాష్
9704541559

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions