Subramanyam Dogiparthi….. సామాజిక విప్లవ చిత్రం . కె విశ్వనాథ్ కళా తపస్వి మాత్రమే కాదు . సామాజిక తపస్వి కూడా . Social saint . 1972 లో వచ్చిన ఈ కాలం మారింది సినిమా సామాజిక దురాచారమయిన అంటరానితనానికి వ్యతిరేకంగా తీయబడింది . ఇంతకన్నా గొప్పగా పామరుడికి కూడా అర్ధమయ్యేలా 1981 లో ఆయనే సప్తపది సినిమాను అందించారు .
సామాజిక స్పృహలో మన తెలుగు వారు చాలా గొప్పవారు . 1938 లో గూడవల్లి రామబ్రహ్మం గారి మాల పిల్ల , 1959 లో పి పుల్లయ్య గారి జయభేరి , 1968 లో కె బి తిలక్ గారి పంతాలు పట్టింపులు , 1975 లో దాసరి నారాయణరావు గారి బలిపీఠం , ఇలా ఎన్నో . ఇంక ఈ సినిమాకు వద్దాం .
ఆనాటి దురాచారం అస్పృశ్యతను ఎండగడుతూ , మనుషులు అందరూ ఒకటే అనే సందేశాన్ని కె విశ్వనాథ్ చాలా చక్కగా , సున్నితంగా , సునిశితంగా ఇచ్చారు . పాలేరు బిడ్డను స్వంత బిడ్డగా పెంచే తండ్రిగా గుమ్మడి పాత్ర , నటన హృదయాలను తాకుతుంది . తనకు పూర్తిగా ఇష్టం లేకపోయినా , భర్తను అనుసరించే ఆదర్శ భార్యగా అంజలీదేవి పాత్ర , నటన అద్భుతం .
Ads
ఆ తర్వాత చెప్పుకోవలసింది శారద . శోభన్ బాబు- శారదలు ఇలాంటి సందేశం కల సినిమా మరొకటి కూడా నటించారు . దాసరి వారి బలిపీఠం . కాలం మారింది సినిమాలో శారద అంటరాని కులంలో జన్మిస్తే , బలిపీఠంలో ఆ పాత్రలో శోభన్ బాబు నటించారు . ఈ సినిమాలో ప్రతీ పాత్రను ఆచితూచి తీర్చిదిద్దారు విశ్వనాథ్ .
యస్ రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో పాటలు కూడా హిట్టయ్యాయి . బాగా హిట్టయిన పాట ముందరున్న చిన్నదాని అందమేమో చందమామ సిగ్గు చెంది సాగిపోయే దాగిపోయే పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది . ఏ తల్లి పాడేను జోల ఏ తల్లి ఊపేను డోల పాట కూడా చాలా శ్రావ్యంగా ఉంటుంది . చిత్రీకరణ కూడా చాలా బాగుంటుంది . మరో సందేశాత్మక పాట . నిజం తెలుసుకోండి ఓ యువకుల్లారా ఓ యువతుల్లారా పాట కూడా .
ఛాందసురాలయిన సూరేకాంతానికి ప్రమాదం జరగటం , రక్తం పోవటం , ఎవరి రక్తమూ సరిపోకపోవటం , ఒక్క శారద రక్తమే సరిపోవటం , సూరేకాంతంలో పరివర్తన రావటం విశ్వనాథ్ గొప్పగా చూపారు . సినిమా మొత్తంలో నాకు బాగా నచ్చిన పాత్ర గుమ్మడిది . మానవత్వం , ప్రేమ , తాను నమ్మిన సర్వ మానవ సమానత్వ భావం మీద పట్టుదల వంటి సున్నితమైన భావాలను గుమ్మడి బాగా చూపుతారు .
ఇతర పాత్రల్లో సాక్షి రంగారావు , పుష్పకుమారి , చంద్రమోహన్ , గీతాంజలి ,నిర్మలమ్మ , రావు గోపాలరావు , అల్లు రామలింగయ్య ప్రభృతులు నటించారు . దేవదాస్ కనకాల అరంగేట్రం ఈ సినిమా ద్వారానే . 1972 వ సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా బంగారు నందిని పొందింది ఈ సినిమా .
ఎంత సందేశాత్మక చిత్రం అంటే ఇలాంటి సినిమాలను ప్రతీ స్కూల్లో ప్రదర్శించాలి . దురదృష్టం ఏమిటంటే యాభై ఏళ్ళ తర్వాత కూడా కాలం మారకపోవటం . శారీరకంగా అంటరానితనం పోయి ఉండవచ్చు , మానసికంగా ఎక్కువయింది . చట్టాలతో పాటు బుర్రల్ని కూడా రిపేర్ చేయాలంటే చిన్న వయసు నుండే మానసిక పరివర్తన అవసరం .
ఈ గొప్ప సందేశాత్మక చిత్రాన్ని మహాత్మాగాంధీకి అర్పించారు విశ్వనాధ్ . సినిమా టైటిల్లో కూడా మహాత్ముని చిత్రం ఉంటుంది . సినిమాలో చాలా చోట్ల మహాత్ముని సందేశాలను , ఆశయాలను ప్రస్తావిస్తారు . కాలేజీ రోజుల్లో మా నరసరావుపేటలో సత్యనారాయణ టాకీసులో చూసా . టి విలో కూడా చూసా . యూట్యూబులో ఉంది . చూడనివారు తప్పక చూడండి .
Share this Article