.
సింగిల్ స్క్రీన్లకు అద్దె చెల్లిస్తూ, మల్టీప్లెక్స్‌లకు వసూళ్లలో వాటాలు ఇవ్వడం మీదే కదా గొడవంతా… పవన్ కల్యాణ్ ఉరమడంతో ఆ నలుగురి సిండికేట్ వ్యవహారాల మీద మీడియా దృష్టి సారించింది… లోతుగా వెళ్లకపోయినా సరే, ఎంతోకొంత రాస్తోంది…
ఎహె, ఆ నలుగురిలో నేను లేను, నాకున్నవే పిడికెడు థియేటర్లు అంటూ అల్లు అరవిందుడు, దిల్ రాజు విడివిడిగా ప్రెస్‌మీట్లు పెట్టి మరీ విధేయతను ప్రకటించుకున్నారు కదా… రాజకీయ అధికారంలో ఉన్నవాళ్లతో ఏ వ్యాపారీ గోక్కోడు, సహజం…
Ads
అందరూ అద్దెలు, వాటాలు, వసూళ్ల గురించి… అంటే ప్రేక్షకుడి జేబును లూటీ చేసే విషయాలే మాట్లాడుతున్నారు గానీ… పార్కింగులు, క్యాంటీన్ రేట్లు, మన్నూమశానంతో అసలు ప్రేక్షకుడు థియేటర్‌కే రావడం లేదు కదా, ఆ విషయాలేమీ ఎవరూ మాట్లాడరు…
అన్నింటికీ మించి మరో ముఖ్యమైన దోపిడీ ఉంది… అదీ ఈమధ్య చర్చల్లోకి వస్తోంది… అది వీపీఎఫ్ చార్జీలు… ఇంతకుముందు రీళ్లు ప్రతి థియేటర్‌కు వెళ్లేవి, గిరాకీ ఉన్న రోజుల్లో ఒకే డబ్బా రెండు మూడు థియేటర్లకు తిరిగేది… కాస్త గ్యాపుతో… చాన్నాళ్లు ఆ రీళ్లు పనిచేసేవి… చవక…
కానీ తరువాత ఏమైంది…? డిజిటల్ స్క్రీనింగ్… అంటే వీపీఎఫ్… QUBE, UFO ప్రధాన డిజిటల్ ప్లాట్‌ఫారాలు తెలుగులో… అడ్డగోలు చార్జీలు వసూలు చేస్తున్నారు దానికి… అదీ థియేటర్ల మీద భారమే… ఇదెవ్వరూ మాట్లాడరు అదేమిటో…
అబ్బే, ఆ నలుగురిలో నేను లేను అన్నట్టుగా… అల్లు అరవింద్ మొన్నటి ప్రెస్‌మీట్‌లో ఓ విలేఖరి (M9News) ప్రశ్నకు దాటవేసే ధోరణిలో సమాధానం ఇచ్చాడు… నో, నో, క్యూబ్‌లో నేను పార్టనర్ కాదు, యూఎఫ్ఓలో సురేష్ బాబు పార్టనర్ కాదు అన్నాడు…
కానీ మీరు తెలుగు రాష్ట్రాల్లో వాళ్లకు లైసెన్స్ హోల్డర్లు కదా, థియేటర్లపై ఆ భారాన్ని తగ్గించొచ్చు కదా అనడిగితే… దానికీ దాటవేత జవాబే… వన్-టైం ఛార్జ్ కాకుండా ప్రొజెక్టర్ రెంట్ తీసుకోవడం మొదలుపెట్టారు… అలాగే VPF కింద డిస్ట్రిబ్యూటర్ నుండి వారానికి 10,000 నుండి 13,500 తీసుకుంటున్నారు…
కొన్ని సీ సెంటర్స్ అయితే ఆ మేరకు కూడా కలెక్షన్స్ లేకపోవడంతో వారికి సినిమా ఇవ్వడమే మానేశారు… దానితో ఎన్నో థియేటర్లు మూతపడ్డాయి… డిజిటల్ విధానం వచ్చాక అదీ ఇదీ అని ఒక్కో థియేటర్ నుండే లక్ష రూపాయిలు నెలకు వసూలు చేస్తున్నారు… పైగా ప్రతీ షోకు ఇంటర్వెల్ లో వేసే యాడ్స్ రెవిన్యూ కూడా ఆ కంపెనీలవే. అంటే యాడ్స్ గాకుండా అక్షరాలా థియేటర్ల నుండి పిండుతుంది 150 కోట్లు…
ఇంగ్లీష్ సినిమాలకు, YRF, ధర్మా లాంటి పెద్ద సంస్థలు చేసే సినిమాలకుడిస్ట్రిబ్యూటర్లు VPF కట్టరు… ఆ సంస్థలే తక్కువకు అగ్రిమెంట్ చేసుకుని డైరెక్ట్ గా డిజిటల్ కంపెనీలకు డబ్బులు కడతాయి… తెలుగు సినిమాలకు మాత్రం ముక్కుపిండి VPF వసూలు చేస్తారు…
రెండు తెలుగు రాష్ట్రాలలో 70% థియేటర్లలో QUBE, 30% థియేటర్లలో UFO ఉన్నాయి. మధ్యలో చిన్నా చితకా కంపెనీలు వచ్చాయి. వాటిని Acquire చేసేయడం లేదా ఆ ప్రొజెక్టర్లు పెట్టుకున్న థియేటర్లకు సినిమాలు ఇవ్వము అని బెదిరించి వాటిని ఇక్కడ ఎదగనివ్వరు…
ఇప్పుడు కొత్తగా TSR అనే డిజిటల్ కంపెనీ వచ్చిందట… ఆ కంపెనీ నెలకు 10,000+ GST మాత్రమే వసూలు చేస్తుంది… అయితే అటువంటి డిజిటల్ ప్రొజెక్టర్ పెట్టుకుంటే ఎన్నో ఇబ్బందులు… రేట్లు ఎక్కువైనా ఈ రెండు కంపెనీలదే రాజ్యం……. ఇవీ వీపీఎఫ్ వాయింపు మీద కనిపిస్తున్న వార్తల సారాంశం…
అర్థమైంది కదా… నలుగురం కాదు, నలుగురిలో మేం లేం అని చెప్పగానే నమ్మేయడానికి ఏమీలేదు… సినిమాలకు సంబంధించిన ప్రతి అంశాన్నీ వాళ్లే రూల్ చేస్తున్నారు… వాళ్లు చెప్పిందే శాసనం..!!
Share this Article