Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇద్దరి ఇంటి పేర్లూ ఒకటే… కుల బంధువులే… మరెక్కడ పుట్టింది కీచులాట…

October 26, 2023 by M S R

Nancharaiah Merugumala……..   కుత్బుల్లాపూర్‌ గౌడ ‘కూన’లు ఎంతగా కలబడినా ‘కొలను’ రెడ్డికి ఫాయిదా ఉండదు! ఇది హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ ఏరియా… కాకినాడ రూరలో, రామచంద్రపురమో కాదు…

…………………………………..

బుధవారం సూరారం రాంలీలా మైదానంలో– జాబిలీ హిల్స్‌లో భూమి విలువేగాక, హైదరాబాద్‌ నగర శివార్లలోని నేల ఖరీదెంతో తెలిసిన ఓ కృష్ణా జిల్లా ‘సెటిలర్‌’ యాజమాన్యంలోని ఓ తెలుగు టీవీ న్యూజ్‌ చానల్‌ నిర్వహించిన బహిరంగ చర్చలో… ఒకే కులానికి చెందడమేగాకుండా ఒకే ఇంటి పేరున్న ప్రస్తుత ఎమ్మెల్యే కూన పాండు వివేకానంద గౌడ్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ గొడవ పడడం ‘సంచలనం’ సృష్టించింది. ఈ ఇద్దరు ‘భూమిపుత్రుల’ తాతముత్తాతలు అన్నదమ్ములని, ఈ రకంగా వారిద్దరూ రక్తసంబంధీకులని, దగ్గర బంధువులని చెబుతున్నారు.

Ads

అయితే, 2009లో మరో ‘కూన’ నేత పోటీ వల్ల కాంగ్రెస్‌ టికెట్‌ మిస్సవడంతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన శ్రీశైలం గౌడ్‌ కుటుంబసభ్యులకు, బీటెక్‌ బంజారాహిల్స్‌ ముఫకంజా ఇంజనీరింగ్‌ కాలేజీలో పూర్తిచేసిన వివేకానంద గౌడ్‌ ఫ్యామిలీ మాదిరిగా పెద్దగా సదువులు లేవని కూడా ఈ ఇద్దరిని ఎరిగిన ఆంధ్రా మిత్రులు తెలిపారు. దాయాదులైన ఇద్దరు గౌడ ‘యువరత్నాల’ మధ్య మంచి కుటుంబ సంబంధాలే ఉన్నా అక్కడక్కడా నేల తల్లిపై ఉన్న స్థలాల వివాదాలే వారి మధ్య విభేదాలకు కారణమంటున్నారు.

బీటెక్‌ చదివి అమెరికా యూనివర్సిటీలో ఎంఎస్‌ చదవాలనుకున్న వివేకానందుడి కల నెరవేరలేదు. కుత్బుల్లాపూర్‌ గౌడ కుటుంబంలో పుట్టి, మొదట గ్రామ సర్పంచ్, తర్వాత కుత్బుల్లాపూర్‌ తొలి పురపాలకసంఘ చైర్మన్‌ అయిన ‘పెద్ద కూన’ కేఎం పాండు కుమారుడైన కేపీ వివేకానంద గౌడ్‌ మొదట తెలంగాణలో బీసీల పక్షపాతిగా ముద్రేసుకున్న తెలుగుదేశం తరఫున 2014లో కుత్బుల్లాపూర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత తోటి రాజేంద్రనగర్‌ గౌడ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌ గౌడ్, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి వంటి పార్టీ శాసనసభ్యులతో కలిసి తన నియోజకవర్గ అభివృద్ధి కోసరం పాలకపక్షమైన టీఆరెస్‌ లో చేరాడు వివేకానంద.

కుత్బుల్లాపూర్‌ అసెంబ్లీ స్థానం పుట్టుకతోనే మొదలైన కూనల పోరు!

……………………………………………………………………………….

2009లో కాంగ్రెస్‌ టికెట్‌ రాకున్నా నాటి కాంగ్రెస్‌ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారి ‘ఆశీర్వాదబలం’ పుష్కలంగా ఉన్న శ్రీశైలం గౌడ్‌ తన సమీప టీఆరెస్‌ అభ్యర్థి కేపీ వివేకానందను 23 వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఇలా నియోజకవర్గం పుట్టుకతోనే మొదలైన దాయాదుల మధ్య పోటీ నిరవధికంగా సాగుతోంది. 2014లో తెలుగుదేశంలో చేరిన వివేకానంద నాటి ఎన్నికల్లో తన సమీప టీఆరెస్‌ అభ్యర్థి కొలను హనుమంతరెడ్డిని దాదాపు 40 వేల ఓట్ల మెజారిటీతో ఓడించారు. దాయాది కాంగ్రెస్‌ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌ మూడోస్థానంలో మిగిలారు.

2018 ఎన్నికల్లో వివేకానంద టీఆరెస్‌ టికెట్‌ పై పోటీచేసి హస్తం పార్టీపై బరిలోకి దిగిన కూన శ్రీశైలం గౌడ్‌ ను 41,500 ఓట్ల మెజారిటీతో ఓడించారు. ఇప్పుడు తాజాగా బలపడిందని భావిస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థిగా కొలను హనుమంతరెడ్డి ఎంపికయ్యారు. నిజాంపేట్, ప్రగతినగర్‌ ప్రాంతాల్లో పలుకుబడి ఉన్న ఈ కొలను రెడ్డి గారి గెలుపు అంత ఈజీ కాదు. 2014లో రెండో స్థానంలో నిలిచిన కొలను రెడ్డి ఇప్పుడు ఆ స్థాయికి చేరుకోవడం కుదరకపోవచ్చు.

ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా ఎంపికైన శ్రీశైలం గౌడ్‌ తన బంధువు వివేకానందుడికి గట్టి పోటీ ఇవ్వొచ్చేమో. కుత్బుల్లాపూర్‌ లో కాంగ్రెస్‌ గాలి 150 కి.మీ వేగంతో వీస్తే తప్ప నేలతల్లి బిడ్డలైన గౌడ అభ్యర్థుల్లో ఒకరి గెలుపును హనుమంతరెడ్డికి ఆపడం అసాధ్యం. అందుకే నిన్న సూరారంలో ఇద్దరు గౌడ సోదరులు కలబడుతుంటే కొలను రెడ్డి మనకెందుకులే అన్నట్టు కూసున్నాడే గాని ‘కూనల’ మధ్య పోరు తన వంటి రెడ్డి వ్యాపారికి పోలింగ్‌ రోజున మేలు చేస్తుందని ఫాక్స్‌ సాగర్‌ చెరువులా పొంగిపోలేదు.

అదీగాక, హైదరాబాద్‌ మహానగరంలో శివారు ప్రాంతమైన కుత్బుల్లాపూర్‌ లో ఆంధ్రా సెటిలర్లు ముఖ్యంగా కోస్తా ప్రాంతాల గౌడ, శెట్టి బలిజ (కల్లుగీత నేపథ్యం ఉన్న గౌళ్ల సోదర కులం) కులస్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అంతేకాదు వారెవరూ పార్టీలపై ఇష్టాన్ని బట్టి ఓటేస్తారేగాని కులాభిమానంతో కాదు. ఇదే, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్, రామచంద్రపురం అసెంబ్లీ స్థానాల్లో ఓబీసీ కులమైన శెట్టి బలిజ అభ్యర్థులు రెండుచోట్లా రెండు ప్రధాన పార్టీల తరఫున నిలబడితే కులం ఓట్లు చీలిపోతాయి. మూడో అభ్యర్థిగా పార్టీ తరఫునో, ఇండిపెండెంట్‌ గానో పోటీచేసే కాపు అభ్యర్థి తన జాతీయుల్లో ఉండే ఐక్యత ఆసరాతో తేలికగా గెలిచిపోతాడు.

1994లో రామచంద్రపురంలో ఇండిపెండెంట్‌ కాపు అభ్యర్థి తోట త్రిమూర్తులు తన ప్రత్యర్థులైన ఇద్దరు శెట్టి బలిజ నేతలను ఓడించి తొలిసారి అసెంబ్లీ మెట్లెక్కారు. అలాగే, 2009లో కొత్తగా ఏర్పడిన కాకినాడ రూరల్‌ నుంచి పోటీచేసిన పెద కాపు జర్నలిస్టు, పీఆర్పీ అభ్యర్థి కురసాల కన్నబాబు గారు కూడా ఇద్దరు శెట్టి బలిజ అభ్యుర్థులను ఓడించి మొదటిసారి ఏపీ శాసనసభకు ఎన్నికయ్యారు. తెలంగాణలో కులం ప్రభావం సమాజంలో బాగానే ఉన్నా ఎన్నికల్లో ఆంధ్రాలో ఉన్నంత ఎక్కువగా ఉండదు. ఈ లెక్కన కుత్బుల్లాపూర్‌ అసెంబ్లీ స్థానంలో దాయాదులు, రక్తసంబంధీకులైన ఇద్దరు ‘కూనలు’ ఎంత బాహాటంగా కలబడినా వారిలో ఒక్కరికి మాత్రమే ఓటమి ప్రమాదం ఉంటుందిగాని, ఇద్దరికీ కాదని మన తెలంగాణ ఎన్నికల విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు.,,

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 
  • అసలెవరీ “సుండలోడు”….” సుండలాయన”….” సుండల్‌క్కారన్”….?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions