సాధారణంగా ఆహా ఓటీటీలోని కంటెంటు మీద పెద్దగా సదభిప్రాయం ఉండదు… తొలిసారి కాస్త చూడబుల్ అనిపించింది బాలయ్య అన్‌స్టాపబుల్ షో… గొప్పగా ఉందని కాదు… కొత్త బాలయ్యను చూపించింది ఆ షో… అలాగని తీసికట్టుగా కూడా ఏమీ లేదు… ఇప్పుడు ఇండియన్ ఐడల్ షో ఇంకాస్త చూడబుల్… ఇదీ అంతే… గొప్పగా దుమ్మురేపుతుందని కాదు… ఇతర టీవీల్లో వచ్చే సంగీత ప్రధాన షోలతో పోలిస్తే నాలుగైదు మెట్లపైనే ఉంది… ప్రత్యేకించి శని, ఆదివారాల్లో పెట్టిన బాలు నివాళి ఎపిసోడ్స్ బాగున్నయ్…
ఆహా ఓటీటీని మెచ్చుకునే సందర్భం వస్తుందని అనుకోలేదు… గుడ్… షో నిర్మాణ విలువలు చాలా పూర్… కానీ కంటెస్టెంట్లు జెమ్స్… భలే ఎంపిక చేశారు… థమన్ గతంలో కూడా ఏదో షో చేశాడు గానీ ఏదో పెద్ద ఫోజు కొడుతూ కనిపించేవాడు… కానీ ఈ షోలో ఓ కొత్త థమన్‌ను చూస్తున్నాం… పాట నిశిత పరిశీలన, నిర్మొహమాటపు వ్యాఖ్య, అభినందన, తోటి జడ్జిలతో సరదా సంగతులు… ప్రత్యేకించి కంటెస్టెంట్లతో ఓ ప్లజెంట్ బాండ్ ఏర్పడటం… అదే కాదు, థమన్, కార్తీక్, శ్రీరామచంద్ర, నిత్య స్వతహాగా మంచి దోస్తులు… రారాపోరా కొట్టుకునేంత… సో, సమన్వయం బాగా కుదిరింది…
థమన్ ఇచ్చే ఇన్‌పుట్స్ బాగుంటున్నయ్… హుక్ అప్స్, పిచ్చింగ్, ల్యాండింగ్ వంటి మ్యూజికల్ వర్డ్స్ కొత్త కొత్తగా సంగీత పరిచయం లేనివాళ్లనూ ఆసక్తిగా వినేలా చేస్తున్నయ్… బాలు నివాళి ఎపిసోడ్‌కు శాస్త్రీయ సంగీత విద్వన్మణి కల్పన వచ్చింది… కళ వచ్చింది… హిందీ ఇండియన్ ఐడల్‌లో కూడా ప్రతి పాటకు ఆహా ఓహో అని డప్పు కొట్టేవాళ్లు… ఈ షో నిర్మాతలు ఓ మంచి పనిచేశారు… కంటెంటుకు సంబంధించిన జడ్జికి చాన్స్ ఇవ్వలేదు… ఇది సంగీత పోటీ, ఆ పాటల్లో సాహిత్య విశ్లేషణకు ఈ కంటెస్టెంట్లు బాధ్యులు కాదు… నిత్య సింగరే కావచ్చు, కానీ సంగీతంలో పెద్దగా నైపుణ్యం లేనట్టుంది… బట్ వోకే…
Ads
ప్రత్యేకించి కార్తీక్ గురించి చెప్పాలి… మొహమాటం లేదు… బాగా పాడితే అభినందన, లేదంటే వోకే, బాగానే పాడారు అనడం… 16వ ఎపిసోడ్‌లో ఓ ఘట్టం బాగా నచ్చింది… ఇప్పుడున్న కంటెస్టెంట్లలో వయస్సులో చిన్నవాళ్లు వైష్ణవి, వాగ్దేవి… ఇద్దరూ జెమ్స్… పైగా వైష్ణవి కల్పన శిష్యురాలు… ఓ పాపా లాలీ పాడారు… కానీ థమన్ దాదాపుగా తిట్టేశాడు… సమన్వయం లేదు, సింక్ లేదు, చెడగొట్టారు అని… కల్పన కూడా అదే చెప్పింది… కానీ ఓసారి పాడాలని కార్తీక్‌ను కోరింది… అద్భుతంగా, అలవోకగా పాడాడు…
ఎస్, పాడి చూపించాలి, తప్పు ఎక్కడ దొర్లిందో చెప్పాలి… ప్రత్యేకించి ఒక పాటకు మ్యూజికల్ బేసిక్స్ ఎంత ప్రధానమో, ఎక్స్‌ప్రెషన్ అంతకన్నా ప్రధానం అనే విషయాన్ని పాడి చెప్పాడు కార్తీక్… దానికి థమన్ డ్రమ్స్ వాయించాడు, కల్పన కోరస్ పాడింది… పాటలో ఇన్వాల్వ్‌మెంట్ అది… ఇదే ఎపిసోడ్‌లో శ్రీరాంచంద్ర ఓ పాట పాడాడు… తన వీర ఫ్యాన్ కల్పన కోరిక మేరకు… శ్రీరాంచంద్ర పాటకు ఢోకా ఏముంది..? తనను తాను నిరూపించుకున్న సుగాత్రమే కదా అది…
కాకపోతే తను హోస్ట్ కాబట్టి ఎక్కడా ఓ పాటగాడిగా వ్యవహరించడం లేదు… సరదాగా షో నడిపిస్తున్నాడు… అంతకుముందు ఓ పాటలో ధరమ్‌శెట్టి శ్రీనివాస్ ఎర్రాని కుర్రదాన్ని పాటలో గోపాల గోపాల అని సరిగ్గా హమ్ చేయలేకపోతే కార్తీక్, థమన్ ఇద్దరూ స్టేజి మీదకు వెళ్లి మరీ టీజ్ చేశారు… ఫన్ కోసమే అయినా ర్యాగింగ్ కాస్త ఎక్కువైనట్టు అనిపించింది… ఓవరాల్‌గా ఆహా ఓటీటీలో ఈ ఎపిసోడ్ మటుకు హాయిగా చూడొచ్చు… ప్రత్యేకించి ఇతర టీవీ చానెళ్లలో మ్యూజిక్ షో పేరిట స్క్రాప్ ప్రసారం చేసే నిర్మాతలు, దర్శకులు తప్పకుండా చూడాలి…!!
Share this Article