అన్నం తిన్నాక మూతి తుడిచిన చీర
బాధతో వచ్చిన కన్నీళ్లు తుడిచిన చీర
పసిపాపకు ఊయలైన చీర
Ads
పంటలకు రక్షణయిన చీర
సంస్కృతిని చాటే చీర
సంప్రదాయానికి నిలువుటద్దమైన చీర
పంచ ప్రాణాలను కాపాడింది
అయిదుగురికి జీవితాన్నిచ్చింది….. అని మిత్రుడు Basava Punnaiah Bodige వాల్ మీద చదివాను… బాగనిపించింది… చీరె గురించి చెెప్పాలంటే ఎంతో… ఎంతెంతో…
నిజంగా ఒక మహిళ తన చీరను ఇచ్చి, అయిదు రోజుల క్రితం వరద నీటిలో మునిగిన కారు నుంచి అయిదుగురిని కాపాడటానికి కారణమైంది… ధన్యోస్మి మాతా… అయితే ఆ వార్త చదువుతుంటే నాకు నిజంగా చప్పట్లతో అభినందించాలని అనిపించింది ఓ మీడియా ప్రతినిధి ప్రదర్శించిన తన్లాట… వివరాల్లోకి వెళ్తే…
ఓ అండర్ పాస్… వరద నీటితో నిండిపోయింది… ఓ కారు అందులో చిక్కుకుంది… ముందుకు కదలడం లేదు… కారు మునిగిపోయింది… డోర్లు ఎందుకు తీయలేకపోయారో తెలియదు… కానీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టెకీ భానురేఖతోపాటు ఆరుగురి ప్రాణాలు అక్కడ ఆ నీటిలో మునక ప్రమాదంలో పడ్డాయి… ఆవైపే వెళ్తున్న ఓ మీడియా ప్రతినిధి నాకెందుకొచ్చిన గోల అనుకోలేదు… మనిషిగా స్పందించాడు… థాంక్ గాడ్, టీవీ చానెల్ ప్రతినిధి కానట్టున్నాడు, వెంట కెమెరా కూడా లేనట్టుంది… లేకపోతే మన తెలుగు పాపులర్ చానెళ్ల రిపోర్టర్లలాగే లైవ్ రిపోర్టింగ్‌తో జనం ఉసురుపోసుకునేవాడేమో… రుధిర వర్షంలో తడిసిపోయేవాడేమో…
నిజానికి ఇలాంటివి కళ్లబడితే పోలీసులకు కాల్ చేస్తారు కొందరు, మరికొందరు చల్లగా జారుకుంటారు… ఇంకొందరు సిన్సియర్‌గా రక్షణ ప్రయత్నాలు చేస్తారు… సదరు మీడియా ప్రతినిధి చేసింది అదే… ఆ నీట్లోకి దూకి, కారు దగ్గరకు వెళ్లి, డోర్లు తీయడానికి ప్రయత్నించాడు, అక్కడ చిక్కుకున్న వారిని బయటికి లాగేందుకు ట్రై చేశాడు… తన వల్ల కాలేదు…
అక్కడికి వచ్చిన సర్కారీ రెస్క్యూ టీం అయిదుగురిని కాపాడినట్టు మీడియా రాంగ్ రిపోర్టింగ్ చేసింది కానీ… సదరు మీడియా ప్రతినిధి అక్కడికి చేరిన వాళ్లను ఎక్కడైనా ఓ తాడును సంపాదించాలని, అలాగైతే ఆ తాడు సాయంతో వాళ్ల ప్రాణాలు కాపాడవచ్చుననీ పదే పదే చెప్పాడు… ప్చ్, లాభం లేకుండా పోయింది… ఈలోపు అక్కడికి వచ్చిన ఓ మహిళ తన చీరను ఇచ్చింది… గ్రేట్… ఎన్నిరకాలుగానైనా గ్రేట్…
ఆ చీరను అండర్ పాస్ చివరలోని ఇనుప చువ్వలకు కట్టాడు మీడియా ప్రతినిధి… ఆ చీరను పట్టుకుని ఒక్కొక్కరిగా అయిదుగురూ ప్రాణాలు దక్కించుకున్నారు… ఈలోపు ఒకామె తన దుపట్టాను ఇచ్చింది, ఒకాయన తన షర్ట్ విప్పి ఇచ్చాడు… కానీ కారులోనే ఇరుక్కున్న భానురేఖ మాత్రం ఊపిరాడక మరణించింది… డోర్లు ఎందుకు ఓపెన్ కాలేదు..? అసలు ఈ ప్రశ్నకు జవాబు వెతకాలి కార్ల కంపెనీలు…
ఆ చీర ఓనర్ మహాతల్లి ప్రాప్తకాలజ్ఞతను మెచ్చుకోవాలి… సేమ్, మీడియా ప్రతినిధి వారి ప్రాణాల రక్షణకు తన్లాడిన తీరు కూడా మెచ్చుకోదగింది… సదరు చీర ఓనర్ అంతమందిలో చీర విప్పడానికి సంకోచించలేదు… చిన్న విషయమేమీ కాదు… అయిదు ప్రాణాలు కాపాడిన ఆమెతోపాటు అంతమందిలో ఒక్కడై కారు చుట్టూ ఈదుతూ రక్షణకు అన్ని మార్గాలూ ప్రయత్నించిన మీడియా ప్రతినిధికి హేట్సాఫ్… ఆ ప్రయత్నం రేంజ్ ఎంత, ఏమిటనేది కాదు ముఖ్యం… కాపాడటానికి అన్ని ప్రయత్నాలూ చేయాలనే తన తపన, తన సంకల్పం గ్రేట్…
Share this Article