17 రోజులుగా దేశమంతా కాంతార సినిమా మీద చర్చ సాగుతోంది… అదొక సంచలనం… ఇప్పుడు మళ్లీ ఆ సినిమా తాలూకు సమీక్షలు, కథా చర్చల్లోకి వెళ్లడం లేదు ఇక్కడ… అప్పుడే రిషబ్ శెట్టికి దక్కాల్సిన జాతీయ అవార్డుల మీద కూడా వార్తలు కనిపిస్తున్నాయి… తెలుగు కీర్తి కెరటాలు విష్ణు బాబు సినిమా జిన్నా, అభిరామ్ సినిమా అహింస తదితరాలు రాబోతున్నాయి కదా, అప్పుడే రిషబ్ శెట్టి అవార్డుల మీద ఏం జోస్యాలు చెప్పగలం..?
16 కోట్లు పెట్టి తీసిన ఇదే సినిమాను మళ్లీ ఇదే టెంపోతో మళ్లీ తీయి గురూ అంటే రిషబ్ తీయలేకపోవచ్చు… పార్ట్-2 తీస్తే ఈ ఇంటెన్సిటీ అస్సలు ఉండకపోవచ్చు… పోనీ, వేరే భాషలోకి రీమేక్ చేస్తే… సింప్లి అసాధ్యం… రిషబ్ పర్‌ఫామెన్స్ ప్రస్తుతం భారతీయ వెండితెరను ఏలుతున్న ఏ తోపు వల్ల కూడా కాదు… పాపం శమించుగాక, కమలహాసన్‌కు కూడా… మొన్నటి తన విక్రమ్ సినిమా చూస్తే అంత ఏవగింపు కలిగింది మరి…
(పొరపాటున ఎవరైనా తెలుగు రీమేక్ హక్కులు తీసుకుని, ఆ దుస్సాహసానికి పూనుకోవద్దని మనవి… ఏమో, అందులోకి ఈసారి షారూక్ ఖాన్ వస్తాడేమో… ఐటమ్ గరల్స్, సాంగ్స్, బ్రాండెడ్ కళ్లద్దాలు- దుస్తులతో రివాల్వింగ్ మెషిన్ గన్స్ అలవోకగా కాల్చే బిల్డప్పు బాబాయ్స్… ఇంకా నానా అవలక్షణాలు ఉండి చస్తాయేమో… ఏమోలే, ఇప్పుడైతే కేవలం డబ్ చేశారు, సంతోషం…)
Ads
డబ్‌కన్నా ముందే జనం ఈ సినిమా మీద మంచి టాక్‌తో నేరుగా కన్నడ వెర్షన్ చూశారు… సేమ్, హిందీ వెర్షన్ లేట్ కావడంతో పలుచోట్ల కన్నడ వెర్షన్‌నే వేశారు థియేటర్ల వాళ్లు… రిషబ్ అదృష్టం ఏమిటంటే… సరైన మౌత్ టాక్ దానికి బలమైన ఆధారంగా నిలిచింది… అదేసమయంలో సోషల్ మీడియా మేధావి బ్యాచులు ఈ సినిమా ప్రచారానికి దూరంగా ఉండటం… వాళ్లు రంగంలోకి దిగి ఉంటే ఇది మరో విరాటపర్వం అయి ఉండేది… ఆఫ్టరాల్ 2, 3 కోట్లకు కొని ఉంటాడు అల్లు అరవింద్ ఈ తెలుగు డబ్బింగ్ రైట్స్… రెండే రోజుల్లో 10 కోట్ల గ్రాస్ వసూళ్లు ఊడ్చి పారేయడం చూసి, తెలుగు సినిమా పెద్దలు కొందరి మొహాలు మాడిపోయాయి…
అయితే మళ్లీ మొదటికొద్దాం… ఇదే సినిమా ఇదే దర్శకుడు మళ్లీ ఇలాగే తీయలేడు అంటే… ఈ సినిమా అలా కుదిరింది… ఆ క్లైమాక్స్ అలా పండింది… లేకపోతే మిగతా సినిమాలో ఏముందని..? ఉత్త సాదాసీదా నాసిరకం కన్నడ సినిమా… అనేక సీన్లు బోరింగు… అయితే చూడాల్సింది దర్శకుడు వెళ్తున్న బాట ఏమిటి అని…! ఎస్… రిషబ్ తన రూట్స్ వదలడం లేదు… అవసరమైతే అప్పులు చేసి మరీ తను అనుకున్న సినిమాను తెర మీదకు తీసుకొస్తున్నాడు… సో, ఒక సినిమా గురించి చెప్పుకోవాలి ఇక్కడ…
2016లో రిషబ్ కిరిక్ పార్టీ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు… రికీ తరువాత అది రెండో చిత్రం… 4 కోట్లే ఖర్చు… (రాజమౌళీ, ఓసారి విను, 4 కోట్లు మాత్రమే ఖర్చు)… 50 కోట్లు వసూలు చేసింది… పలువురు నిర్మాతలు రిషబ్‌ను సంప్రదించారు… మరో కమర్షియల్ సినిమా తీసిపెట్టు, ఎంత బడ్జెట్ అయినా సరే, నీ రెమ్యునరేషన్ ఎంతయినా సరే అన్నారు… కానీ కేరళలో మూసేస్తున్న కన్నడ మీడియం స్కూళ్ల మీద బాధ ఉన్న రిషబ్ అప్పటికే ఓ కథ రాసి పెట్టుకున్నాడు… దాన్ని నిర్మాతలు తిరస్కరించారు… అవార్డులు వస్తాయి గానీ డబ్బులు రావుపో అని శపించారు… రిషబ్ సింపుల్‌గా నవ్వి, సినిమాను మొండిగా తీయడం ప్రారంభించాడు… సినిమా పేరు… Sarkari Hiriya Prathamika Shaale: Koduge Ramanna Rai… అంటే ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాల…
తన ఫ్రెండ్ రక్షిత్ శెట్టి ఉండనే ఉన్నాడు… మరికొందరిని సంప్రదించాడు… క్రౌండ్ ఫండింగ్… సినిమా నడిస్తేనే డబ్బు వాపస్, లేకపోతే మటాష్ అని వాళ్లకూ తెలుసు… మొత్తానికి 3 కోట్లు జమచేశాడు… సినిమా రిలీజ్ చేశాడు… సొంత భాష మీద ప్రేమ అది… సో, తను వెళ్తున్న బాటలో కొంతైనా నిజాయితీ ఉంది, ఈ వల్గర్, కమర్షియల్ ఇండస్ట్రీలో ఇంకా మూలాలు, మన కల్చర్ గట్రా ఆలోచిస్తున్నాడు అని అర్థం…
ఆ ప్రభుత్వ పాఠశాల 20 కోట్లను వసూలు చేసింది… కేరళ- కర్నాటక సరిహద్దులోని కాసరగోడులో మూసివేతకు గురయ్యే ఓ కన్నడ మీడియం సర్కారీ స్కూల్ కథ అది… పిల్లలు దాన్ని ఎలా అడ్డుకున్నారనేది కథ… (ఒక్కసారి ఊహించండి, తెలుగులో 3 కోట్లతో ఇలాంటి కథతో సినిమా తీసేవాళ్లు, చూసేవాళ్లు ఉన్నారా..?)
కన్నడ సినిమా ఇండస్ట్రీకి కొత్త దశను, కొత్త దిశను చూపిస్తున్న వీళ్లను సింపుల్‌గా ట్రిపుల్ ఆర్ అంటారు… రిషబ్ శెట్టి, రాజ్ బి శెట్టి, రక్షిత్ శెట్టి… నాటు నాటు అంటూ ఇద్దరు తెలుగు చరిత్ర పురుషుల కథల్ని భ్రష్టుపట్టించిన ట్రిపుల్ ఆర్ కారు వీళ్లు… వీరిలో రాజమౌళి అస్సలు లేడు… ఆ ప్రభుత్వ పాఠశాల సినిమాకు మళ్లీ వద్దాం…
ఇందులో కమర్షియల్ వాసనల్లేవు… ప్లెయిన్… పత్రికల్లో వచ్చే ఓ న్యూస్ స్టోరీ… కన్నడ సీమ ఆ సినిమాను కూడా గుండెకు హత్తుకుంది… కాంతారను కూడా ఆ తరహా ఆలోచనవిధానమే నడిపించింది… ఒక దశలో క్లైమాక్స్, వరాహ సాంగ్ మీద అటు నటన, ఇటు దర్శకత్వం కష్టమైపోయింది… తన దోస్త్ రాజ్‌బిశెట్టి తోడుగా వచ్చాడు… నేనున్నాను పదరా అన్నాడు… (గరుడ గమన వృషభ వాహన సినిమా ఫేమ్)… చివరి ఇంపార్టెంట్ ఎపిసోడ్స్ లో రాజ్ దే ప్రధాన దర్శకత్వ సహకారం… సినిమా ఇక ఆగలేదు, ఆ క్లైమాక్స్ అపూర్వంగా పూర్తయింది… అది అన్ని భాషల సినిమా పరిశ్రమల్ని షేక్ చేస్తోంది… గెలుపో ఓటమో జానేదేవ్… ఈ బాట విడవకు రిషబ్… ఆ వరాహదైవరూపం మీద ఆన..!!
Share this Article