Prasen Bellamkonda………. ఇష్టమైన రచన ఉంటుందే తప్ప ఇష్టమైన రచయిత ఉండకూడదనేవారు యండమూరి. పోపోవోయ్ అని యండమూరి రాసిన చాకలి పద్దు కూడా నాకిష్టం అనేవాడిని నేను అప్పట్లో. అదో పిచ్చి. ఇష్టమైన పిచ్చి.
మధుబాబు డికెష్టి నడకనూ యద్దనపూడి డ్రీమర్ శైలినీ కలిపి నాలాంటి కొన్ని లక్షల మందిని తన పద్దులో రాసేసుకున్నారాయన. ఆ తరువాత తన కధన రీతిని వ్యక్తిత్వ వికాస డ్రై ప్రవచనాలకు జోడించి నవలల స్థాయికి మార్చేసారాయన. బహుశా చాలా మందికి విజయానికి అయిదు ఆరు మెట్ల పుస్తకాలు ఇప్పటికీ భగవద్గీతలే.
Ads
చదవడం పట్ల ప్రేమను పెంచింది కచ్చితంగా ఆయన రాతలే . నేనైతే ఆయననుంచి వాక్య నిర్మాణం నేర్చుకున్నాననుకుంటున్నాను. రచనలో నడకను నేర్చుకున్నాననుకుంటున్నాను. ఇవేవీ నాలో లేవని మీరనుకుంటే ఆ తప్పు నాదే ఆయనది కానే కాదు.
ఇష్టమైన కళా , సాహిత్యకారులను వ్యక్తిగతంగా కలవకూడదు అని నేనో నియమం పెట్టుకున్నాను అప్పట్లో. మీది తెనాలే మాదీ తెనాలే టైపులో యండమూరిదీ ఖమ్మమే. ఆయన పీక్ లో ఉన్నపుడు ఖమ్మం గర్ల్స్ హైస్కూల్ కి ఓ మీటింగ్ కి వచ్చారు. “త్రిపురనేని గోపిచంద్ నాకు ఆదర్శం. ఆయన మూడు ఫ్లాప్ లు తీసాడు, నేను రెండు ఫ్లాప్ లు తీసాను. ఇంకా ఒకటి తీయాల్సుంది” అని సినిమాల నుద్దేశించి అన్నపుడు భలే అన్నాడే అనుకున్నా.
సభ తరవాత చాలా మంది ఆటోగ్రాఫ్ ల కోసం ఆయన చుట్టు మూగారు. గమ్మత్తేమిటంటే ఈ మూగిన వాళ్ళ దగ్గరా యండమూరి దగ్గరా పెన్ను లేదు. ఆయన తడుముకుంటుంటే నా పెన్నిచ్చా. ఆయన ఆటోగ్రాఫింగ్ చేస్తున్నంత సేపూ అక్కడే నిలబడ్డా. అది చూసి యండమూరి “ఈ పెన్ను ఇక నీకిచ్చేది లేదు” అన్నారు. “అంతకంటే ఏం కావాలి ఉంచేసుకోండి” అన్నా. “నీ పేరేంటి ” అడిగాడాయన. “ప్రసేన్” అన్నాన్నేను. ” ఏమిటీ ” మళ్ళీ అడిగారాయన. “ప్ర..సే..న్” అని చెప్పాన్నేను. “బాగుందే నా తరవాతి నవలలో హీరో పేరు ఇదే” అన్నారాయన.
ఇది నాకు ఆయనతో మొదటి అనుభవం. ఆ తరవాత ఆయనను చాలా సార్లు కలిసాను. డిన్నర్లలో కూడా కూర్చున్నాను కానీ ఇష్టమైన రచయితలకు వ్యక్తిగతంగా దగ్గరవకూడదన్న నా సిద్దాంతానికి మాత్రం భంగం కలగనివ్వలేదు. నాకు గుర్తున్న మేరకు ఆయనతో అయిదారు సార్లు గడిపాను. కానీ సాహిత్య చర్చ గానీ నా హీరో పేరెక్కడ అని కానీ అడగలేదు. ఆయన ఒక పెన్నో ఒక నా పేరున్న పాత్రో రుణపడివుండడమే నాకు గర్వం. (అచ్చంగా ఇలాంటి అనుభవమే నాకు కొమ్మూరి వేణుగోపాలరావ్ గారితో కూడా ఉంది. ఆయన కూడా నాపేరు విని అలాగే స్పందించి తన ఓ నవలలో హీరో కు నా పేరే పెట్టారు.)
Ads
ఇప్పుడొక యండమూరి అత్యవసరం. పుస్తకం మరణిస్తోందనీ సాహిత్యం చదవడం పట్ల యువతలో ఆసక్తి చచ్చిపోతోందనీ అందరూ గుండెలు బాదుకుంటున్న వేళ ఆ ఆసక్తిని పెంచే ఒక పెన్ను అవసరం. ఇంగ్లీషు నవలల్ని టెలుగు చేసాడు, క్షుద్ర రచనలు చేసాడు వంటి విమర్శలను పక్కన పెడితే ఆయన ఒక తరానికి చదవడం అలవాటు చేసాడు. నాలాంటి వాళ్ళు ఆయనను దాటుకుని సీరియస్ సాహిత్యం వైపు వెళ్ళినా పునాదులు ఆయనవే.
Share this Article