అనంత శ్రీరాం మొదట్లో కాస్త బాగానే రాసేవాడు సినిమా పాటల్ని… కొన్ని పార్టీల పాటల్ని కూడా రాసినట్టున్నాడు… అలవోకగా పదాల్ని అల్లేయగలడు కాబట్టి సినిమాల్లోనూ దూసుకుపోయాడు… పదాల అల్లిక కూడా వీలైనంత అర్థరహితంగా ఉండేలా చూసుకోవడానికి ఈమధ్య బాగా ప్రాధాన్యం ఇస్తున్నాడు, పిచ్చి పదాల్ని పేరుస్తున్నాడు కాబట్టి సినిమావాళ్లకు భలే కుదిరాడు… అందుకే ఇప్పుడు టాప్ ప్లేసులో కూర్చున్నాడు…
ఆమధ్య దిగుదిగునాగ పాటలో బాగా భ్రష్టుపట్టిపోయింది కదా తన పేరంతా… కొన్నాళ్లు నిశ్శబ్దాన్ని ఆశ్రయించి, అదేదో స్వప్న ఇంటర్వ్యూలో ఓ విఫల సమర్థనకు ప్రయత్నించాడు… ఇప్పుడు పకపకా నవ్వొచ్చిన విషయం ఏమిటంటే…? అనంత శ్రీరాం సిద్ శ్రీరాంను సపోర్ట్ చేయబోయి, తనకు మేలు చేయలేదు సరికదా, సిద్ శ్రీరాం ఇజ్జత్‌ను నిలువునా తీసేశాడు… అంతేకాదు, అనంత శ్రీరాం సందర్భశుద్ధి, విజ్ఞతలపైనా సందేహాలు ముసురుకున్నాయి…
సర్కారువారి పాట సినిమా ప్రమోషన్ కోసం నిర్మాతలు ఒక్కోరోజు ఒక్కొక్కరి ప్రెస్‌మీట్లు ప్లాన్ చేశారు… మొన్న థమన్, నిన్న అనంత శ్రీరాం… మీడియాకు కావల్సిందేముంది..? కుమ్మిపడేస్తారు హేపీగా… గతంలో లేదు గానీ, ఈమధ్య కాస్త కెలకడం రిపోర్టర్లు అలవాటు చేసుకున్నారు… (అంటే మరీ డీజే టిల్లును లవర్ పుట్టుమచ్చల ప్రశ్న అడిగినట్టు గాకుండా…) సంయమనం ఉంటే తప్ప సెలబ్రిటీలు వాటిని దాటవేయలేరు… లేకపోతే బుక్కయిపోతారు…
Ads
అనంత శ్రీరాం తను బుక్కవడమే కాదు, సిద్ శ్రీరాంను కూడా అడ్డగోలుగా బుక్ చేశాడు… సిద్ శ్రీరాం బేసిక్‌గా తమిళుడు… తెలుగు తెలియదు, తెలుగు పదాల ఉచ్చారణే రాదు… అయితేనేం థమన్ విపరీతంగా ప్రేమిస్తాడు తనను… స్వరదోషాలు, ఉచ్చారణ దోషాలు ఎలా ఉన్నా సరే ఎంకరేజ్ చేస్తుంటాడు… సరే, సినిమా పాటల్లో ఏది ఎలా ఉంటే ఎవడిక్కావాలి..? సిద్ శ్రీరాం పాపులరైపోయాడు… అయితే సోషల్ మీడియా ఊరుకోదు కదా… సిద్ శ్రీరాం దోషాలన్నీ ఎప్పటికప్పుడు ఎండగడుతోంది… బట్టలిప్పి బజారులో నిలబెడుతోంది…
ఇప్పుడొస్తున్న సర్కారువారిపాట సినిమాలోనూ కళావతీ పాట సూపర్ హిట్… అది పాడిందీ సిద్ శ్రీరామే… అసలు ఆ పాట సాహిత్యమే నాలుగైదు పదాల వింత అల్లిక… అంతకుముందు ఏదో సినిమాలో వినిపించిన ట్యూన్‌ను తన సహజ ధోరణిలో థమన్ కాపీ కొట్టేశాడు, అందులో అనంత శ్రీరాం పదాలు పొదిగాడు… అయితే ఈ పాటలోనూ సిద్ శ్రీరాం ఉచ్చారణ దోషాల్ని నెటిజన్లు కబడ్డీ ఆడేశారు… నిన్నటి ప్రెస్‌మీట్‌లో ఎవరో విలేకరి ఆ ప్రశ్న అడగనే అడిగేశాడు…
నిజానికి ఓ గాయకుడి ఉచ్చారణ దోషాలతో ఆ పాట రచయితకు పనిలేదు… అది సంగీత దర్శకుడి బాధ్యత… ఇక్కడ థమన్‌కే తెలుగు పదాల ఉచ్చారణ తెలియదు, ఇక సిద్ శ్రీరాం దోషాల్ని ఎలా పట్టుకోగలడు..? అయితే సిద్ శ్రీరాం ఉచ్చారణ దోషాలు పదే పదే విమర్శల పాలవుతున్నాయి కాబట్టి ఈ అనంత శ్రీరాముడు దగ్గరుండి పాడించాడట… తనే ప్రెస్‌మీట్‌లో చెప్పాడు… హహహ… చివరకు పాటల రచయిత దగ్గరుండి పాడిస్తే తప్ప సిద్ శ్రీరాం సరిగ్గా ఓ పాట పాడలేని దురవస్థలో ఉన్నాడన్నమాట…
గాలికిపోయే కంపను ఇంకెవరి డ్యాష్‌కో తగిలించినట్టు… తన ప్రెస్‌మీట్‌లో ఎవరో సిద్ శ్రీరాం గురించి అడిగితే స్పందించే అవసరం అనంత శ్రీరాంకు ఎందుకు..? తీసుకెళ్లి సిద్ శ్రీరాం పరువు తీయడం దేనికి..? ఇక్కడ ఆగిపోయిందా, లేదు… ఏమంటున్నాడో వినండి… ‘‘కళావతి పాట ఉచ్చారణలో దోషాలు లేవు, పాట మిక్స్ చేసినప్పుడు కొన్ని ఎఫెక్ట్స్ వేస్తారు, అందుకని పదాలు కొన్ని వేరేగా వినిపించవచ్చు, పెరిగిన టెక్నాలజీకి మన చెవులు ఇంకా సిద్ధపడలేదని నా భావన’’ అంటున్నాడు…
ఇది ఇంకా నవ్వొచ్చే యవ్వారం… “ఒక బుల్లెట్ పేలిస్తే కనిపించదు… కానీ సినిమాలో దాన్ని స్లో మోషన్ లో చూపిస్తే అది అసహజమే అయినప్పటికీ చూస్తున్నాం కదా… ప్రతి దాంట్లో టెక్నాలజీ వస్తోంది. దీనికి కళ్ళు ఎలా సిద్ధపడుతున్నాయో చెవులు కూడా అలా సిద్ధపడాలి…” అంటున్నాడు… అంటే ఎవరు ఏమైనా రాయనీ, ఎలాగైనా కూయనీ, సంగీతం పేరిట ఏమైనా వాయించనీ… మన చెవులదే తప్పు అన్నమాట… థమన్ చెవులో, సిద్ శ్రీరాం చెవులతో, అనంత శ్రీరాం చెవులతో వినాలి తప్ప ఏ ప్రేక్షకుడూ తమ సొంత చెవులతో వినే సాహసం చేయకూడదు అన్నమాట… అదేమంటే… తప్పంతా టెక్నాలజీ మీదకు దొబ్బేస్తే సరి…. అంతేనా శ్రీరావుడూ… యాణ్నుంచి ఒస్తర్ర భయ్ మీరంతా…!!
చివరగా…. మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చే పాట రాస్తే, రచయితకు రెమ్యునరేషన్‌తోపాటు రాయల్టీ కూడా ఇస్తున్నారా..? నిజమేనా..? అసలు చాలా పాటలు, ట్రెయిలర్లు ఎట్సెట్రా యూట్యూబ్ వీడియోస్‌కు వ్యూస్ సంఖ్య అనేదే పెద్ద ఫేక్… ప్రమోటెడ్… ట్యాంపర్డ్… దానికి రెవిన్యూ లెక్కకట్టి, అందులో రచయితకు రాయల్టీ ఇస్తారా నిర్మాతలు, భలే భలే… పాటలపై ఫస్ట్ సంగీత దర్శకులకు, తరువాత గాయకులకు రాయల్టీ ఇస్తున్నారు… ఇప్పుడు రచయితలకు కూడా, అదీ సోషల్ మీడియా వ్యూస్ ఆధారంగా రాయల్టీ ఇస్తున్నారంటే… పెద్ద విశేషమే…!!
Share this Article