.
Weather Updates : తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి … అక్కడ ఏకంగా జీరో డిగ్రీ ఉష్ణోగ్రత..!!
Hyderabad Weather : తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది.ఉదయం, రాత్రి వేళ ఇళ్ళలోంచి బయటకు వచ్చేందుకు తెలుగు ప్రజలు భయపడిపోతున్నారు… అంత చల్లగా వుంటోంది వాతావరణం.
Ads
పల్లెల్లోనే కాదు పట్టణాల్లోనూ ప్రజలు చలికి గజగజా వణికిపోతున్నారు. బారెడు తెల్లారేవరకు సూర్యుడు కనిపించడంలేదు… దీంతో తెల్లారిపోయినా చలి తగ్గకపోవడంతో ప్రజలు కూడా ముసుగుతన్ని పడుకుంటున్నారు.
గత రెండుమూడు రోజులుగా అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. ఈ నెలంతా ఇదే పరిస్థితి వుంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సంక్రాంతి సమయంలో చలి మరింత పెరిగే అవకాశాలుంటాయి… కాబట్టి పండక్కి పిల్లాపాపలతో పల్లెలకు వెళ్లేవారు జాగ్రత్తగా వుండాలని సూచిస్తున్నారు.
రోజురోజుకు చలి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో అత్యల్ప ఉష్ణోగ్రతలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో నమోదవుతున్నారు. ఇక తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా నమోదయ్యాయి. ఇలా ఎముకలు కొరికే చలితో అప్రమత్తంగా వుండాలని ఆ ప్రాంత ప్రజలకు హెచ్చరించారు. చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం వుండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసారు.
ఏపీలో జీరో ఉష్ణోగ్రత :
ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖ మన్యం ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. డిసెంబర్, జనవరి నెలల్లో ఈ ప్రాంతమంతా చలిమంటలు కనిపిస్తుంటాయి. తెల్లవారుజామున పొగమంచుతో ఆ పల్లెలన్నీ కప్పేసి వుంటాయి.
ఇలా ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ శీతాకాలంలో ఇప్పటివరకు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆంధ్రా కాశ్మీర్ గా పిలిచే లంబసింగిలో అయితే 0 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. రాబోయే రోజుల్లో మరింత చలి పెరిగి మైనస్ డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలుంటాయి.
ఇక అల్లూరి జిల్లాలోని సుందర పర్యాటక ప్రాంతం అరకులో కూడా ఉష్ణోగ్రతల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇక్కడ అత్యల్పంగా 3.8 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యింది. చింతపల్లిలో 4 డిగ్రీలు, డుంబ్రిగూడలో 6 డిగ్రీలు, జి. మాడుగులలో 8.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఎక్కడంటే :
తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతుంటాయి. ఇలా ఇప్పటికే ఇక్కడ చలి చంపేస్తోంది… చాలాప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
అత్యల్పంగా సిర్పూర్ లో 6.5, సంగారెడ్డిలో 6.9 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఆదిలాబాద్ జిల్లాల్లో 7.1 డిగ్రీ సెల్సియస్ గా నమోదయ్యింది… కుమురం భీం, నిర్మల్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి వుంది. కాబట్టి ఈ మూడు జిల్లాల్లో రెండు రోజులపాటు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. మెదక్, సిద్దిపేట, భూపాలపల్లి,నారాయణపేట,జగిత్యాల జిల్లాల్లోనూ 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఇక రాజధాని హైదరాబాద్ లో కూడా గత రెండుమూడు రోజులుగా చలి వణికిస్తోంది. రాత్రి, తెల్లవారుజాము సమయాల్లో నగర రోడ్లను పొగమంచు కమ్మేస్తోంది. ఈ చలికి ఉదయం వాకింగ్, జాగింగ్ కు వెళ్లేవారితోపాటు రోడ్లు ఊడ్చే, చెత్తను సేకరించే జిహెచ్ఎంసి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్ లోనే ఈ పరిస్థితి వుంది… మరి చుట్టుపక్కల జిల్లాలో చలి తక్కువగా వుంటుందా… అక్కడ కూడా చలి పంజా విసురుతోంది. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా వుంది. రేపు కూడా ఇలాగే అత్యల్ప ఉష్ణోగ్రతల నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది…
.
ఇదండీ వార్త… ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే..? లంబసింగి కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లో కావచ్చు వెదర్ టూరిస్టులకు ఉన్న సౌకర్యాలు ఏమిటి అని… ఏపీ ప్రభుత్వం లీస్ట్ బాదర్డ్… ఇంతకుముందు చెప్పుకున్నాం కదా… నేచర్ విలేజ్ టూరిజం, లేదా వెదర్ టూరిజం మీద మన పాలకులకు ఎలాగూ సోయి లేదు, దండిగా దండుకునే ఐఏఎస్ అధికారులు ఎందుకూ పనికిరారు… వాళ్ల సంపాదన యావ వాళ్లది…
హోటళ్ల రేట్లు, దాష్టికం, అమర్యాద, ప్రైవేటు ట్యాక్సీల దోపిడీ, అడ్డగోలు ఫుడ్ రేట్లు… ఇలా గోవాను ఆల్రెడీ దెబ్బతీశాయి… ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ టూరిస్ట్ స్పాట్లు దోపిడీ కేంద్రాలయ్యాయి… రష్, రద్దీ… కనీసం లంబసింగి ఎట్సెట్రాలను కాస్త డెవలప్ చేయండర్రా…
వసతి, ఫుడ్, ట్రాన్స్‌పోర్ట్, సెక్యూరిటీ… ఇవీ సగటు టూరిస్టుకు కావల్సినవి… అఫ్‌కోర్స్ ప్రైవసీ కూడా… అదిరా ఆలోచించాల్సింది… దిక్కుమాలిన పాలకుల్లారా..! తెలంగాణా గురించి మాత్రం ఎవరూ ఏమీ అడక్కండి… ఇదెప్పుడో దారి తప్పింది..! కొత్త పాలన కోణాలు, ఆచరణ మచ్చుకైనా కానరాని ప్రభుత్వం ఇది..! లక్నవరం తప్ప ఇంకేమీ సోయి లేదు దీనికి..!!
Share this Article