Taadi Prakash…. రామలింగం నేతబండి ఆగిపోయింది… Mohan’s tribute to our pochampalli hero
రామప్ప శిల్పం చెక్కినట్టు, కొండపల్లి శేషగిరిరావు రేఖా విన్యాసంతో బొమ్మకి సౌందర్యాన్ని అద్ధినట్టు, బంగారు పిచ్చిక, మనిషి నిర్ఘాంతపోయేంత నైపుణ్యంతో గూడు అల్లినట్టు.. చిలువేరు రామలింగం మగ్గం మీద కాంతులీనే కలనేతతో మతిపోగొడతాడు. ఆయన అల్లికతో, రంగురంగుల దారాల మేళవింపులోని సొంపుతో …చీర ఒక సృజనాత్మక సౌరభంతో వున్మీలనమౌతుంది.
తెలంగాణ, నల్గొండ జిల్లా, భూదాన్ పోచంపల్లిలో వుండే రామలింగం గారిని మనం గర్వించదగ్గ దర్శకుడు శ్యామ్ బెనెగల్ వెళ్లి కలిశాడు. రెండుతరాల కళాకారులని ప్రభావితం చేసిన ఆర్టిస్ట్ మోహన్ కూడా కలిశాడు. చాలా ఏళ్ళ క్రితం… ఒక ఆర్టిస్టుల గుంపుతో హైదరాబాద్ నించి పోచంపల్లి వెళ్లి రామలింగం గారిని కలిశాను. మగ్గం గోతి అంచున ఆయన పక్కనే కూర్చుని మాట్లాడాను. ఎంతో సాదాసీదాగా, ఒక తండ్రిలాగా తన ‘చే’నేతలోని ప్రత్యేకత గురించి చెప్పాడు.
Ads
నిరాడంబరుడు… పొగడ్తలు, పేరుప్రఖ్యాతులు ఆయన్ని ఏరకంగానూ ఎఫెక్ట్ చేయలేకపోయాయి. లోకానికి రామలింగం అరుదైన గొప్ప నేతగాడు. నాకు మాత్రం పేరున్న కార్టూనిస్టు మృత్యుంజయ వాళ్ళ నాన్న. 2003వ సంవత్సరంలో చిలువేరు రామలింగం చనిపోయినపుడు, మోహన్ ఒక వ్యాసం రాశాడు. అది 2004 అక్టోబర్ 24న ఆంధ్రజ్యోతి ఆదివారం మేగజైన్ లో ప్రముఖంగా అచ్చయింది. రామలింగం మనల్ని వొదిలి వెళ్ళిపోయి 20 సంవత్సరాలు అయిపోయింది. ఆ కళాకారుడి మరణంతో ఒక ‘పద్మశాలి’వాహన శకం అంతమైపోయింది. సెప్టెంబర్ 12… ఈరోజు రామలింగం వర్ధంతి. మోహన్ అప్పుడు రాసిన వ్యాసం… మీకోసం. ….Taadi Prakash
బొమ్మలో ఎడ్లబండి చూశారుగా. అది ఒట్టి బండి కాదు. పోచంపల్లి బండి. చేనేత బండి. దాని మీద మగ్గంలోన ఉన్నది రామలింగం. అమ్మవారి గుడికి బండి ధూంధాంగా బయల్దేరుతోంది. అప్పుడే మగ్గం మీద రామలింగం చీర నేత మొదలవుతుంది. ముందు పోతురాజులు చిందులేస్తారు. డప్పుల మోత కి జనమంతా తీన్మారేస్తారు.
నేత బండి మెల్లగా ఊళ్లో వీధులన్నీ తిరుగుతుంది. సంబరం హోరెత్తిపోతుంది. తిరిగి తిరిగి ఎడ్లబండి అమ్మోరు గుడి ముందు ఆగుతుంది. అప్పటికి రామలింగం నేత కూడా పూర్తవుతుంది.
మగ్గం మీంచి అప్పుడే దిగిన కొత్త చీరను అమ్మవారికి రామలింగం సమర్పించుకుంటాడు. ఇలా పోచంపల్లిలో దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది.
ఏటా రామలింగమే ఈ పని చేస్తాడు.
ఈ ఏడాది మాత్రం అమ్మోరికి కొత్త చీర రాలేదు. 63ఏళ్ళ వయసులో రామలింగం చనిపోయాడు. నేత బండి ఆగిపోయింది. అలా నేసే హీరో రామలింగం లేడు. మళ్ళీ రాడు కూడా. ఆయన చనిపోయిన కబురు తెలిసిన వెంటనే ఆర్టిస్టులందరం కట్టగట్టుకుని పోచంపల్లి వెళ్లాం. రోజంతా అక్కడే ఉన్నాం. ఊరంతా అక్కడే ఉంది. రామలింగం వదిలిన మగ్గం ఇంట్లోనే ఉంది. ఎలాంటి మగ్గం!
మల్లీశ్వరి సినిమా చూసినట్టుంది. మా వూళ్ళో మా ఇంటి పక్క సందు చింతచెట్టు వీధిలో కడుపు రాములు గారింటి ముందు రోడ్డు మీద పడుగుపెట్టి పుక్కిలించి గంజి ఊసే పద్మసాలీలు గుర్తొస్తారు. పాతిక డబ్బాల పంచరంగుల దారాల్ని మింగే జైంట్ వీల్ ఆసు, కళ్ల ముందు గిరగిరా తిరుగుతుంది.
ఆ మగ్గం మీద రామలింగం ఎన్నో వింతలు నేశాడు. అవి చూడ్డానికి ఆస్ట్రేలియా నించీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ నుంచీ ఎంతోమంది వచ్చి ఆ ఇంట్లోనే ఆసులో కండెల్లా సెటిల్ అయిపోయారు. రామలింగం వండర్ ని రికార్డు చేశారు. పారిస్ నుంచి వచ్చిన ఆడవాళ్ళు ఇప్పటికీ ఈ అనుభవాలు మరిచిపోలేరు. రామలింగం కొడుకు మృత్యుంజయ పొలిటికల్ కార్టునిస్ట్ కి మంచి కార్టూన్ పుస్తకాలు ఇప్పటికీ పంపుతూ ఉంటారు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన టెక్స్ టైల్ నిపుణుడు డానామెకౌన్ రామలింగం పనితనం గురించి ప్రత్యేకంగా రాశాడు. అలి జారిన్ డైలతో ఈయన రంగులు దిద్దే పద్ధతి జాతీయ ప్రఖ్యాతిని తెచ్చిపెట్టిందని చెప్పాడు. ఇక్కడా, చీరాలలో వీళ్ళు చేసే “తేలియా రుమాల్”ను ప్రత్యేకంగా పొగిడాడు.
చీరలూ, అంచులూ, డిజైన్ లూ ఎన్నెన్నో రకాలవి నేసినా చేసినా రామలింగానికి బొమ్మల మీదే ఎక్కువ పిచ్చి ఉండేది. గాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్, ఎన్టీఆర్, అంజయ్య, యిలా ఎందరివో పోర్ట్రేట్లు నేశాడు. వారికి బహూకరించాడు.
ఒక్కో బొమ్మకి రెండేసి నెలలు పట్టేది.
కానీ పోచంపల్లి పేరు మోగిపోయింది.
హైదరాబాద్ లో ఉత్తరాదిలో ఎక్కడ ఏ ఎగ్జిబిషన్ జరిగినా రామలింగానికి అవార్డు ఖాయం. ప్రశంసలు గ్యారంటీ. అందుకే అమెరికా అధ్యక్ష సౌధం – వైట్ హౌస్ ను ఈ డిజైన్ లు అలంకరించాయి. ఎంత ఖ్యాతి అంటే మన సినీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ బండి కట్టుకొచ్చేసి వీళ్ళ ఇంటి ముందు దిగాడు.
ఆ పనితనం చూసి విస్తుపోయాడు. రామలింగం జీవితం చుట్టూ అల్లిన కథని సినిమాగా తీశాడు. “సుఫ్మాన్” చిత్రంలో షబానా ఆజ్మీ, పల్లవి జోషి నటించారు. భూదాన్ పోచంపల్లిలో ఈ సినిమా తీసినపుడు శ్యామ్ బెనెగల్ మన రామలింగానికి పదివేల రూపాయలు పారితోషికంగా ఇచ్చాడు.
మూడు కొంగుల చీర, కుట్టు లేకుండా ఛెస్, కత్తిరింపులూ, అతికింపులూ లేకుండా కుర్తా పైజామా, గాంధీ టోపి, గొడుగు నేయడం రామలింగానికే చెల్లిన చిత్రాలు. టై – అండ్ డై పద్ధతికి ఆయన పెట్టింది పేరు. స్విట్జర్లాండ్ వారొచ్చినపుడు ప్రత్యేక మైన ఒక గుడ్డను నేసిస్తే వాళ్ళెంతో ముచ్చటపడ్డారు. దాని ఖరీదే కాకుండా మరో మూడొందలు రూపాయలు ఇవ్వడం మరో ముచ్చట. తాత, తండ్రుల నుంచి వచ్చిన కళని నమ్ముకుని బతికి, బాగా బతకలేకపోయిన రామలింగం కొడుకులిద్దరూ ఆర్టిస్టులే. అయితే చేనేత ఆర్టిస్టులు కాదు. మృత్యుంజయ కార్టూనిస్టుగా ఉద్యోగం చేస్తూంటే, దత్తాత్రేయ యానిమేషన్ స్టుడియోలో చేస్తున్నాడు. పోచంపల్లి ఇంటి మీద రామలింగం ఎగరేసిన చేనేత పతాకం అవనతమయినట్టే. అది ఇక ఎగరదు. చేనేతకు జరగదు.
రుమాల్ కీ కమాల్
ఇంటర్నెట్ వచ్చాక మా కార్టూనిస్టులూ, ఆర్టిస్టులూ విజృంభించారు. కేరికేచర్లు వేసే ప్రఖ్యాత కళాకారుల సైట్లను క్లిక్ చేయడం, వాళ్లతో కబుర్లు కొట్టడం, వీళ్ల బొమ్మలు పంపి అభిప్రాయం అడగడం, ఫోటోలు పంపి కేరికేచర్లు వేయించుకుని హుషారైపోవడం రొటీనయ్యింది.
బెల్జియం ఆర్టిస్టు జాన్ అబ్టివిక్ సైట్ లో అద్భుతమైన కేరికేచర్లుంటాయి. ఆయన ప్రపంచ ప్రఖ్యాతి గలవాడైనా సరే కుర్ర కార్టూనిస్టులకి ఓపిగ్గా సమాధానాలిస్తాడు. వీళ్ల కేరికేచర్లు కూడా గీస్తాడు. అలా నెట్ పెరిగాక మృత్యుంజయ ఫోటోను కేరికేచర్ చేశాడు. సమాధానమిచ్చేటప్పుడు “నేను ఇండియా వాణ్ణి, మా దేశంలో ఇంకా మీకెవరన్నా తెలుసా?” అని మృత్యుంజయ అడిగాడు. దానికి జవాబుగా ఆయన ఒకే ఒక వ్యక్తి గురించి నెట్ లో చదివాననీ, అతను మంచి ఆర్టిస్టనీ, పేరు రామలింగం అనీ చెప్పాడు. నెట్ లో దానికి సంబంధించిన “తేలియా రుమాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్” అనే సచిత్ర వ్యాసం ఉంది. అందులో మగ్గం నేస్తున్న రామలింగం ఫోటోతో సహా ఆయన టెక్నిక్ ప్రఖ్యాతి గురించి వివరంగా రాసి వుంది. మృత్యుంజయ ఆశ్చర్యంగా ఆనందపడి, ఆ రామలింగం మా నాన్నే.. అని మెసేజ్ ఇస్తే, జాన్ అబ్టివిక్ కూడా ఆశ్ఛర్యపడిపోయాడు. కాని, రామలింగానికి ఈ సంగతి బొత్తిగా తెలియదు. – ఆర్టిస్ట్ మోహన్
Share this Article