తల్లీ! మమ్ము తలంచి, చెయ్ పౌరోహిత్యం!
——————–
ముందుగా ఒక డిస్ క్లైమర్. ఇది వేద ధర్మం, సనాతన ఆచార వ్యవహారాల మీద శాస్త్ర చర్చ కాదు. ఆధునిక యుగ ధర్మంలో స్త్రీ పురుష సమానత్వానికి సంబంధించిన ఒక కోణం. దేశ కాల పరిస్థితులను బట్టి ఆచారాలు మారుతుంటాయి. దక్షిణాది చిదంబరంలో తడి పంచె మాత్రమే కట్టుకుని పైన ఉత్తరీయం కూడా లేకుండా ప్రదక్షిణ చేస్తే చల్లగా కరుణించే శివుడు- అదే సమయానికి ఉత్తరాదిలో గడ్డకట్టిన మంచులో కేదార్ నాథ్ లో స్నానం కూడా చేయకుండా నెత్తిన విభూతి చల్లుకుని రెండు మూడు స్వెటర్లు, మఫ్లర్లు, గ్లౌస్, సాక్స్ వేసుకుని దండం పెడితే వెచ్చగా కరుణిస్తాడు. అచారాలన్నీ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగానే ఏర్పడతాయి. అయితే చాలాసార్లు ఆచారం ప్రదర్శనగా మిగిలి, అందులో ధర్మాచరణ మాత్రం దేవతావస్త్రంగా మారుతూ ఉంటుంది.
Ads
పురోహితులుగా మహిళలను చూడడానికి మన మనసులు అంగీకరించవు. మన అమ్మ, అక్క, చెల్లి, అత్త, అమ్మమ్మ, నానమ్మ, భార్యగా ఉండవచ్చు. లోకాన్ని కని, పెంచి, లాలించి, పాలించవచ్చు. జగతి గతికి శక్తిగా పౌరోహిత్యం చేయవచ్చు. సాక్షాత్తు పరమశివుడికే అన్నపూర్ణగా వేళకింత భిక్ష పెట్టవచ్చు. సాక్షాత్తు లోకైకపతి నారాయణుడికే లక్ష్మిగా సంతకం చేసి చెక్కులు ఇవ్వవచ్చు. బ్రహ్మ నాలుగు తలల్లో నాలుగు నాలుకల మీద నాలుగు వేదాలుగా సరస్వతి పలకవచ్చు. శక్తి స్టాటిక్, డైనమిక్ అని రెండు రకాలు. అంటే స్థిరమయినది. కదిలేది అని అర్థం. శివుడు, విష్ణువు, రాముడు, కృష్ణుడు…పేరేదయినా దేవుడు స్థిర శక్తి. పార్వతి, లక్ష్మి, సీత, రుక్మిణి, దుర్గ, సరస్వతి, కాత్యాయని, భవాని, శ్యామల… పేరేదయినా కదిలే శక్తి. లేదా దేవుడిలో కదిలే శక్తి దేవత.
నిజానికి శివుడిని, విష్ణువును, రాముడిని ఒక్కరినే పూజిస్తే ఫలితం ఎక్కువగా ఉండదని మంత్రశాస్త్రమే స్పష్టంగా చెబుతుంది. పార్వతితో శివుడిని, లక్ష్మితో విష్ణువును, సీతతో రాముడిని కలిపి పూజిస్తేనే శీఘ్రఫలం. ఇందులో అంతరార్థం- వారిని వేరు చేయకూడదు. వేరుగా చూడకూడదు అని. అలాంటప్పుడు మహిళ పౌరోహిత్యం చేయడం ఏరకంగా చూసినా ఆహ్వానించాల్సిందే. ఏదయినా కార్యం మీద వెళుతుంటే మగవాడు ఎదురొస్తే కొంప కొల్లేరే. ముత్తయిదువ ఎదురొస్తే ఆ పని దిగ్విజయం. అలాంటిది ఆ ముత్తయిదువే పురోహితురాలిగా కూర్చుని మాంగళ్య ధారణ మంత్రం చదివి కళ్యాణం చేయిస్తే- మంగళానికే మంగళం. కళ్యాణానికే కళ్యాణం. శుభానికే శుభం. ఈ మధ్య బెంగళూరుకు చెందిన ప్రముఖ పురోహితురాలు దియా మిర్జా పెళ్లి శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయి- మహిళా పురోహితుల మీద చర్చ జరుగుతోంది. మంచిదే. ఇంటి హితం-బాగు కోరేది ఇల్లాలు. ఊరి బాగు- హితం కోరేది పురోహితురాలు….. By… -పమిడికాల్వ మధుసూదన్
Share this Article