ఒక దొంగను ఇంటర్వ్యూ చేసిన వీడియో ఒక చిన్న పార్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సత్ ప్రవర్తన కలిగిన కొందరు నేరస్తులను జైళ్ల శాఖ నిర్వహించే పెట్రోల్ బంకుల్లో ఉద్యోగాలు చేయిస్తున్నారు. ఉప్పల్ దగ్గర అలాంటి ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఈ ఇంటర్వ్యూ లో కూర్చున్న దొంగ ఇండియన్ ఆయిల్ యూనిఫాం వేసుకోవడం వలన అలాంటి ఒక పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు అనుకుంటున్నాను.
ఈ ఇంటర్వ్యూను ఏదైనా టీవీ వాళ్లు చేశారా, ఇంటర్వూయర్ వ్యక్తిగతంగా చేశారా నాకు ఐడియా లేదు. అయితే ఇక్కడ చెప్పదలచుకున్న విషయం అది కాదు. ఈ దొంగ చెప్పిన ఆర్థిక సత్యం గురించి.
ఉండడానికి సొంత ఇల్లు లేదా గేటెడ్ కమ్యూనిటిలో అపార్ట్మెంట్, ఆ ఇంట్లో విలువైన ఫర్నిచర్, ఇతర విలువైన ఎలెక్ట్రానిక్ వస్తువులు, తిరగడానికి ఒక మంచి కారు, వేసుకునే దుస్తులు మొదలు ధరించే నగల వరకు, కాళ్ళకి వేసుకునే బూట్ల నుండి చేతికి పెట్టుకునే వాచి, జేబులో ఫోన్ వరకు అంతా ఖరీదైన జీవనశైలి. వీళ్లను చూడగానే అబ్బా వీళ్ళు ఎంత ధనవంతులో కదా అనిపించడం సహజం. కాని ఇలా సమాజంలో మనకి తారసపడే అనేకమంది ఆర్థికంగా పైకి కనబడేదానికి వాస్తవానికి నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది.
Ads
ఇల్లు హోమ్ లోన్ తో కొన్నది, కారు కూడా లోన్ తీసుకుని కొన్నదే, ఇక ఖరీదైన ఫర్నిచర్, టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మెషిన్, ఐఫోన్ వంటివి ఏ బజాజ్ ఫైనాన్స్ దగ్గరో వాయిదా పద్ధతిలో కొన్నదే. నెలకి భార్యాభర్తలు ఇద్దరూ సంపాదించిన వచ్చే జీతంలో సగం కంటే ఎక్కువ ఈ EMIలు కట్టడానికే పోతాయి. ఇక ఖరీదైన జీవనశైలి మెయింటెయిన్ చేయడానికి మిగతాది.
వీటికి తోడు ప్రెస్టిజ్ కోసం పిల్లల్ని చేర్పించిన కార్పొరేట్ స్కూలు ఫీజుల భారం, కనీసం నెలకు ఒకసారి రెస్టారెంట్ లో భోజనం, మల్టీప్లెక్స్ లో సినిమా, అపుడప్పుడు షికారులకి వెళ్ళడం. వచ్చే సంపాదనంతా ఇలా ఖర్చు చేస్తూ తమ అసలు ఆర్థిక స్థితికి అనుగుణంగా కాకుండా ఇతరులకు (బంధువులు , స్నేహితులకు) గొప్పగా కనబడాలి అనే ఒక ఫాల్స్ ప్రెస్టీజ్ లో బతుకుతూ ఉంటారు బోలెడు మంది.
ఇలాంటి వారి దగ్గర ఇంట్లో కూడబెట్టిన బెట్టిన డబ్బులు ఉండవు, లాకర్ లో దాచుకోవడానికి నగలు ఉండవు. ఇందాకే వీళ్ళు నగలు వేసుకుంటావు అన్నావు అప్పుడే నగలు ఉండవు అంటున్నావు ఏమిటి అంటారా? ఇలాంటి వారి దగ్గరి బంధువుల్లో ఎవరింట్లో అయినా ఫంక్షన్ ఉంటే నగలు మెడలో ఉంటాయి. లేదంటే ముత్తూట్ ఫైనాన్స్ లో తాకట్టులో ఉంటాయి.
సరిగ్గా ఇలాంటి వారి గురించే ఇంటర్వ్యూలో దొంగ చెప్పింది. సామాన్యులు జిగేల్ మని మెరిసే ఇతరుల జీవితాలను చూసి వాళ్ళేదో ధనవంతులు అని భ్రమ పడితే, సమాజాన్ని చదివిన ఒక దొంగ మాత్రం పైపై పటోటాపాలకు మోసపోకుండా నిజంగా డబ్బేవరి దగ్గరుంది గుర్తించి దొంగతనాలు చేస్తున్నాడు.
నేను ఈ పోస్టులో చెప్పిన విషయాలు కొందరికి రుచించకపోవచ్చు కాని వాస్తవం ఏమిటనేది ఎవరిది వారికి తెలిసే ఉంటుంది……. – నాగరాజు మున్నూరు
(రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఓ చోరీ వార్త గుర్తొచ్చింది… ఒక ఇంట్లో ఓ దొంగకు ఎత్తుకెళ్లడానికి ఏమీ దొరకలేదు… చిరాకు, నిరాశ… ఇంట్లో ఏమీ లేవు, ఇలాగైతే మేమెలా బతకాలనే ఆక్రోశం ఫాఫం… సీసీటీవీ ఎదుట మొహం పెట్టి ప్చ్, దోచుకోవడానికి ఇంట్లో ఏమీ లేవంటూ ఆవేదన వ్యక్తం చేశాడు… ఓ వాటర్ బాటిల్ తీసుకొని, రూ.20 అక్కడ పెట్టి దొంగ వెళ్లిపోయాడు…)
Share this Article