పాయల్ రాజ్‌పుత్… ఈ పేరు వినగానే ఆర్‌ఎక్స్ 100 అనే ఓ చిన్న సినిమాలో ఓ బోల్డ్ కేరక్టర్ వేసిన ఓ నటి గుర్తొస్తుంది… తరువాత ఏవో రెండు మూడు ఐటమ్ సాంగ్స్, పెద్దగా క్లిక్ కాని హీరోయిన్ గుర్తొస్తుంది… కానీ ఆమె తొలి దర్శకుడు అజయ్ భూపతి ఆమెను అలా వదిలేయలేదు… మహాసముద్రం సినిమా సమయంలో హీరోయిన్‌గా తీసుకోకపోయినా తన సినిమాకు ఆమె టచ్ లేకుండా వదిలేయలేదు… తరువాత మంగళవారం సినిమా… ఆమే ప్రధాన పాత్ర…
వావ్… చప్పట్లు కొట్టే నటన… అసలు ఆమె మనకు తెలిసిన ఆ బోల్డ్ అల్లాటప్పా పాయలేనా అనిపిస్తుంది… అసలే ఆ పాత్ర ఓ సంక్లిష్టమైన కేరక్టరైజేషన్… దానికి పరిపూర్ణంగా న్యాయం చేసింది… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆమె ఉత్తమనటి అవార్డుకు అర్హురాలు (జ్యూరీ నిష్పాక్షికంగా తీర్పు చెబితే)… ఎవడెవడో ఏదో రాసినట్టు అది బోల్డ్ బోల్డర్ కేరక్టర్ కాదు.., నిజానికి ఆ కేరక్టర్ చేయడమే పాయల్ సాహసం… బహుశా ఏ పేరున్న నటీ ఆ పాత్రను ఒప్పుకునేది కాదేమో… భేష్ పాయల్… (సినిమా తాలూకు సస్పెన్స్ ఫ్యాక్టర్ చెడగొట్టదలుచుకోలేదు, అందుకే కథ జోలికి పోవడం లేదు, ఆ పాత్ర తత్వమూ చెప్పడం లేదు ఇక్కడ…)
Ads
సరైన మౌత్ టాక్ లేక ఏదో పర్లేదు అన్నట్టు నడిచింది సినిమా థియేటర్లలో… పైగా హారర్, బోల్డ్ సీన్స్ అనే ప్రచారంతో ఫ్యామిలీ ప్రేక్షకులు దూరంగా ఉన్నారు… కానీ ఇప్పుడది హాట్‌స్టార్ ఓటీటీలో ఉంది… సినిమా ఫస్టాఫ్ అంతా ఏదో సస్పెన్స్ ఫ్యాక్టర్ బిల్డప్ చేయడానికి నానా కష్టాలూ పడ్డాడు దర్శకుడు… ఏమిట్రా ఈ సినిమా అనిపిస్తూ ఉంటుంది… కానీ సేమ్, కాంతార సినిమాలాగే చివరి ముప్పావు గంట అదరగొట్టేశాడు… చివరి రెండు నిమిషాల వరకూ పలు ట్విస్టులు మనల్ని ఊపిరాడనివ్వవు…
కాంతార ఎందుకు గుర్తొచ్చిందీ అంటే… మరో కారణం ఉంది… అది సంగీత దర్శకుడు అజనీష్… ఏదో ప్రైవేటు ఆల్బమ్ కాపీ కొట్టి కాంతారలోని సూపర్ బంపర్ హిట్ సాంగ్ వరాహరూపం కంపోజ్ చేశాడనే ఆరోపణల్ని, కేసుల్ని ఎదుర్కున్నాడు కదా… కానీ కాపీ మాస్టర్ కాదు, ఒరిజినాలిటీ సత్తా ఉన్నవాడే… మంగళవారం సినిమాలో పలు సీన్లు బాగా ఎక్స్‌పోజ్ అయ్యాయంటే తన బీజీఎంతో ఎలివేటైనవే… పాటలు పెద్ద ఇంప్రెసివ్ లేవు, కానీ బీజీఎం భలే చేశాడు… అసలు ఈ సినిమాకు తను అంగీకరించడమే సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్…
ఇందులో చెప్పుకోదగిన మరో పాత్ర రాజేశ్వరీ దేవి… (కథ, సినిమా సమీక్ష జోలికి వెళ్లడం లేదు ఇక్కడ…) మలయాళంలో కనిపించే దివ్య పిళ్లై భలే చేసింది… ఒక పాత్రలో ప్రియదర్శి మెరిశాడు… చివరకు పోలీస్ పాత్రలో నందిత శ్వేత కూడా ఆప్ట్‌గా చేసింది… మరి సినిమా ఎందుకంత హిట్ కాలేదు..? పర్లేదు, పెట్టిన డబ్బులు వచ్చినట్టున్నయ్… కానీ ఆశించినంతగా సక్సెస్ పేరు రాలేదు… పాన్ ఇండియా సినిమా కదా… తమిళంలో చెవ్వయ్‌కిళమై, మలయాళంలో చొవ్వాజ్చా, కన్నడంలో కూడా మంగళవారం, హిందీలో మంగళవార్… ఓ పిచ్చిపాటలో తరుణ్ భాస్కర్ ఎందుకు అనేది ఆ దర్శకుడికే తెలియాలి…
Share this Article