ఎహె, ఒక రోడ్డు కాస్త కుంగిపోతే ఇన్ని విమర్శలా..? 99 శాతం పాజిటివిటీ గమనించకుండా ఒక శాతం నాణ్యతలోపాల్ని పనిగట్టుకుని బదనాం చేయాలా..? చిన్న చిన్న లోపాలు కనిపిస్తే యాదాద్రి ఘన వైభవ పునర్నిర్మాణాన్ని కించపరచాలా..?….. ఇవీ కొన్ని విపల సమర్థనలు… చిన్నపాటి వర్షానికే యాదాద్రి లోపాలు బయటపడటంపై, నిర్మాణంలో కనిపిస్తున్న డొల్లతనంపై విమర్శలకు ఇవి నిజంగా సరైన సమాధానాలేనా..? అసలు మీడియా ఎలా కవర్ చేసిందో ఓసారి పరిశీలిస్తే…
టీవీలు మరీ అంతగా రెచ్చిపోయి టాం టాం చేయలేదు… చాలావరకు టీఆర్ఎస్ అనుకూలత వల్ల కావచ్చు… పత్రికల విషయానికొస్తే… అధికార పత్రిక కాబట్టి, అదెలాగూ రాయదు కాబట్టి, నమస్తేను వదిలేసేయండి… ఈనాడు ఈమధ్య వెన్నెముకను కోల్డ్ స్టోరేజీలో దాచుకుని బతుకుతోంది కాబట్టి దాన్నీ వదిలేయొచ్చు… ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ బ్యానర్‌తో ప్రయారిటీ ఇచ్చింది కానీ, స్థూలంగా పరిశీలిస్తే సాక్షి కవరేజీ బాగుంది… మంచి ఫోటోలు పబ్లిష్ చేసింది…
Ads
ఇవి సాక్షిలో కనిపించిన ఫోటోలు… అంతేకాదు, ఒక రోడ్డు కుంగిపోవడమే కాదు… క్యూ కాంప్లెక్సుల్లోకి నీరు చేరడం, ప్రధానాలయం, అష్టభుజి మండపంలో లీకేజీల ఫోటోలు సమస్య తీవ్రతను పట్టిస్తున్నాయి… ఇన్ని వందల కోట్లు పెట్టి, ఇంతగా ప్రచారం చేసిన పునర్నిర్మాణం లోపాలను అవి బట్టబయలు చేశాయి… అధికారయంత్రాంగం ఏదేదో సమర్థించుకోవచ్చుగాక, కానీ నర్సింహస్వామి భక్తగణాన్ని తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయి…
గుట్ట మీద పార్కింగ్‌కు 500 పెట్టడం దగ్గర్నుంచి అనేక అంశాల్లో భక్తులకు అసంతృప్తి ఉంది… గుట్టపైన కాసేపు నిలబడే వసతి లేకపోవడం మాత్రమే కాదు… ఆమధ్య మరో వార్త కనిపించింది… గుట్టపైన పూజారులకు లఘుశంక తీర్చుకునే వెసులుబాటు లేక, కిందకు వెళ్లి రావల్సి వస్తోందని ఆ వార్త… నిజానికి పలుసార్లు నిర్మాణలోపాల మీద వార్తలొచ్చాయి… సరిగ్గా పర్యవేక్షణ లేదు, కొన్ని కూలగొట్టారు, మళ్లీ కట్టారు, ఓ ప్రణాళిక లేకుండా పనులు చేసుకుంటూ పోయారు…
కేసీయార్ స్వయంగా అనేకసార్లు వెళ్లాడు… యాదగిరిగుట్ట భారీ పునర్నిర్మాణంపై కేసీయార్ సంకల్పాన్ని, ప్రయత్నాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదు… అదేసమయంలో నిర్మాణలోపాలను విస్మరించడానికీ వీల్లేదు… స్థంభాలపై కేసీయార్ చిత్రాలు, టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రచార బొమ్మల దగ్గర్నుంచి… ప్రధానాలయంలోకి లీకేజీల దాకా… బోలెడు తప్పుటడుగులు… అసలు సీరియస్‌గా, స్థూలంగా పనులను సమీక్షించి, సరిదిద్దే ప్రయత్నాలు జరిగాయా..? పలు పనుల్ని అధికార పార్టీ వాళ్లే చేశారనీ, ఈ డొల్లతనానికి బాధ్యులు వాళ్లేనని ఓ ఆరోపణ… అయితే..?
ప్రభుత్వ పనులంటే అంతే… మరి గుడేమో దేవాదాయ పరిధిలో ఉంది… ప్రభుత్వం అధికారికంగా డబ్బులిస్తోంది… అందుకని అధికార ప్రొసీజర్ ప్రకారమే పనులు అప్పగిస్తూ వచ్చారు… వాళ్లు ఇతర ప్రభుత్వ పనుల్లాగే ఇష్టారాజ్యంగా పనులు చేశారు… కంట్రాక్టర్లకు, దేవాదాయ శాఖ అధికారులకు, సిబ్బందికి ధర్మనిరతి, ఆధ్యాత్మికసోయి, భక్తిభావన ఎట్సెట్రా ఎందుకుంటాయి..? మరేం చేసి ఉండాల్సింది..?!
ప్రభుత్వ ఆధ్వర్యంలో కాదు, ప్రైవేటుగా కట్టబడే అనేక గుళ్లు నిక్షేపంగా, చెక్కుచెదరకుండా, మంచి నాణ్యతతో నిలబడ్డాయి… అక్షరధామ్ నుంచి అమెరికాలో కట్టే ఇస్కాన్ ఆలయాల దాకా పలు భారీ, వైభవోపేత గుళ్లు కళ్లెదుట నిలిచాయి… అయోధ్యలోనూ గుడికి ప్రభుత్వం మద్దతుగా ఉంటుంది తప్ప నిర్మాణబాధ్యత మొత్తం మహంతులదే… (వారణాసిలో అభివృద్ధి పనులు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సాగినా, ఎక్కడా వీసమెత్తు ప్రతిఘటన, విమర్శ, నాసిరకం ఆరోపణల్లేకుండా పర్‌ఫెక్టుగా చేయగలిగారు…)
యాదగిరిగుట్ట గుడిని గనుక దేవాదాయ శాఖ నుంచి విముక్తం చేసి, ధార్మికభావన ఉన్నవాళ్లతో ఓ ట్రస్టు ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదనే ఓ అభిప్రాయం ఉంది… కానీ కేసీయార్ అలా చేయడు, ప్రభుత్వం పెత్తనం నుంచి వదిలేయడు… ఒకవేళ చేసినా సరే, ఆ అనధికారిక ట్రస్టుకు ప్రభుత్వం అధికారికంగా వందల కోట్లను ఇవ్వగలదా..?
అక్కడ ఆర్కిటెక్ట్ దగ్గర నుంచి (ఈయనకే వేములవాడ పనులూ అప్పగిస్తారట) పర్యవేక్షణ బాధ్యుడు, వైటీడీఏ చైర్మన్ కిషన్‌రావు, గుడి ఉన్నతాధికారుల దాకాా ఎందరో బాధ్యులు… ఎంతసేపూ వీవీఐసీ సూట్లు, ఏర్పాట్ల మీద శ్రద్ధ తప్ప ప్రధాన ఆలయ నిర్మాణ నాణ్యతపై సోయి లేదెవరికీ..!! నిష్ఠురంగా ఉన్నా సరే, నిజం ఇదే… ఇప్పటికే పెద్దల పాలైన పేదల దేవుడు నర్సింహస్వామికి ఇంకా రాను రాను ఎన్ని చుక్కలు చూపిస్తారో…!!
Share this Article