ఫేక్ న్యూస్, ఫేక్ ఫోటోలు, ఫేక్ ఖాతాలు, ఫేక్ వీడియోలు, తప్పుడు ప్రచారాలతో సోషల్ మీడియాను భ్రష్టుపట్టించారు… ఆ ఆందోళన బలంగానే కనిపిస్తున్నా సరే, ప్రస్తుతం నిజానికి జనంలోకి బలంగా వెళ్తున్నది, జనం ఫాలో అవుతున్నదీ సోషల్ మీడియా మాత్రమే..! పలు సందర్భాల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా వెలవెలబోతోంది… సోషల్ మీడియా మాత్రమే డామినేట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది… మొన్న మూడో తారీఖున ‘‘నేను-నా వేములవాడ’’ పేజీలో ఓ పోస్టు కనిపించింది…
విషయం ఏమిటంటే… కొత్తగా వచ్చిన ఈవో రమాదేవి ఓ సామాన్య భక్తురాలిగా వెళ్లి, అక్కడ టోల్ అక్రమాల్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నది… గుడ్, ఆ చొరవ అవసరమే… అసలు అక్కడే కాదు, కొబ్బరికాయలు కొట్టే దగ్గర్నుంచి, ప్రసాదాల దాకా… ప్రతి అడుగులోనూ అవినీతి, అక్రమం… ఐనా ప్రతి గుడినీ ఇలాంటి పాపాల అడ్డాగా ఎప్పుడో మార్చేశారు, రాజకీయ నాయకుల మద్దతు ఉంటుంది, ఇలా కొత్తగా వచ్చే అధికారులు హల్‌చల్ చేసినా, తరువాత సైలెంట్ అయిపోవాల్సిందే, సిస్టం అంతగా పొల్యూట్ అయిపోయింది మరి…
ఆ వీడియో సంభాషణ వింటుంటే లోకల్ రిపోర్టర్ల మద్దతు ఉన్నట్టుగా వినిపిస్తోంది… లేనిదెక్కడ..? పోనీ, ఈ అక్రమాల పట్టివేత మీద తరువాతైనా ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలెన్ని..? ఈ మాట ఎందుకు చెప్పుకోవాలీ అంటే… ఈ ఒక్క వీడియో పోస్టుకు 61 వేల లైకులు కనిపిస్తున్నయ్… 18 లక్షల వ్యూస్ ఉన్నయ్… అన్నింటికీ మించి 3300 కామెంట్లు… గుళ్ల దగ్గర అక్రమాలపై భక్తుల అసహనం, కోసం, అసహ్యం ఆ కామెంట్లలో వ్యక్తమవుతోంది… మరి ఇంతగా ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది కదా… మెయిన్ స్ట్రీమ్ స్పందన ఏమిటి..?
Ads
నిజమే, ఎవరో భక్తుడు చెప్పినట్టు… ప్రతి పుణ్యక్షేత్రాన్ని ఓ దోపిడీక్షేత్రం చేస్తున్నారు… అన్నీ సిండికేట్లే… సగటు భక్తుడికి అడుగడుగునా దేవుడు కనిపిస్తాడు… మూలవిరాట్టు దాకా పోవాల్సిన పనేలేదు… యాదాద్రి, భద్రాద్రి, వేమాద్రి… ఏ అద్రి చూసుకున్నా ఇదే… అందుకే గుళ్లపై ప్రభుత్వ పెత్తనాలు పోవాలనే కోరికలు బలం పుంజుకుంటున్నయ్… ఏ మత క్షేత్రానికీ లేని సర్కారీ పెత్తనాల చెర గుళ్లకే ఎందుకు..? ఇదీ ప్రశ్న… ప్రభుత్వ నిఘా లేకపోతే అక్రమార్కులు ఇంకా దోచుకుంటారు కదా అనేది కొందరి ప్రశ్న… ఇప్పుడేమైనా సక్కగుందా అనే ఎదురుప్రశ్నే దానికి జవాబు..!! అవునూ, ఇంతకీ వేములవాడలో అంతా సద్దుమణిగినట్టేనా..?!
Share this Article