ఈమధ్య వచ్చి హిట్టయిన సినిమాల్లో మాస్ మసాలా, దమ్ బిర్యానీ పాటలు కొన్ని వచ్చినయ్… ప్రత్యేకించి పుష్ప పాటలైతే పోద్దాడి కల్లులా ఫుల్లు కిక్కు ఎక్కించేసినయ్… సినిమా విజయంలో ఆ పాటలదీ ప్రధాన పాత్రే… అయితే అన్నీ రక్తి పాటలే తప్ప, భక్తి ప్రధాన పాటలు తెలుగు సినిమాల్లో వినక ఎన్నేళ్లయిందో కదా… అంటే కేవలం ఆధ్యాత్మికతను రంగరించి రాయబడిన పాటలు అని మాత్రమే కాదు, వాటికి తగిన నాట్యం, జతకలిసి నర్తించే సహనర్తకులు… ఆ పాటలకు తగిన ట్యూన్లు… ఆహ్లాదంగా ఆ పదాల్ని హత్తుకుపోయే సంగీత వాయిద్యాలు… అలాంటి పాటలు క్రమేపీ తెలుగు సినిమాల్లో మాయమైపోతున్నయ్… ఇప్పుడు ఒక పాట కనిపించింది, వినిపించింది…
మరీ అరుదు ఈ పాటలు… కాదంటే అస్మైక యోగ, తస్మైక భోగ అంటూ… దిగు దిగు దిగు నాగా అంటూ… లెహరాయీ అంటూ కొత్త కొత్త రాళ్లురప్పలను విసురుతారు… అదేమంటే… దేవిశ్రీప్రసాద్‌లా ‘‘ఎహె, ఆధ్యాత్మికం ఏంటి..? ఐటమ్ కంటెంట్ ఏంటి..? ట్యూన్ క్లిక్కయిందా, జనంలోకి వెళ్లిందా లేదా అనేదే ముఖ్యం’’ అని ఏవో కొక్కిరి బాష్యాలూ చెప్పేస్తారు… ఈ నేపథ్యంలో శ్యాం సింగరాయ్ సినిమాలో ఓ పాట చాలామంది ప్రేక్షకులకు బాగా కనెక్టయింది… అభినందించాలి బాధ్యులను…
Ads
ఇది సిరివెన్నెల రాసిన చివరిపాట కావచ్చు బహుశా… బాగుంది… ‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు’ కల్మషాన్ని ఈ ప్రణవాలయ పాహి పాటతో కడుక్కున్నాడు అనిపించింది… పాజిటివ్ నోట్‌లోనే..! గాయకుడు అనురాగ్ కులకర్ణి బాగా పాడాడు… మిక్కీజేమేయర్ స్వరరచన కూడా బాగుంది… అన్నింటికీ మించి ఆ పాటకు ప్రాణం సాయిపల్లవి… (ఆమధ్య వచ్చిన లవ్‌స్టోరీ సినిమాకు కూడా సాయిపల్లవి డాన్సులే ప్రధాన ఆకర్షణ)… డాన్స్ కంపోజ్ ఎవరు చేశారో వివరాలు వెంటనే తెలియరాలేదు గానీ… పాటకు తగిన నర్తనం బాగా నప్పింది… అమ్మవారిని ఆరాధించే సంకీర్తనలాగా…! సినిమా కథలో హీరోయిన్ దేవదాసి, ఆమె వృత్తే నర్తన, సంగీతం… సో, కథకు తగిన, కథన సందర్భానికి తగిన పాట…
ప్రణవాలయ పాహి పరిపాలయ పరమేశి
కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాశి
ధీంతానా ధీంధీంతాన జతులతో
ప్రాణమే నాట్యం చేసే గతులతో
నామశతమ్ముల నతులతో
నాపైన నీ చూపు ఆపేలా…
శరణంటినే జనని, నాదవినోదిని భువనపాలినివే
అనాథరక్షణ నీ విధి, కాదటే మొర విని చేరవటే
నా ఆలోచనే
నిరంతరం నీకు నివాళినివ్వాలనీ
నాలో ఆవేదనే
నువ్వాదరించేలా నివేదనవ్వాలనీ
దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా
జీవముతో భావముతో సేవలు చేసా
ప్రతి ఋతువు ప్రతి కృతువు నీవని ఎంచా
సతతము నీ స్మరణే…నే
ధీంతానా ధీంధీంతానా జతులతో
ప్రాణమే నాట్యంచేసే గతులతో
నామశతమ్ముల నతులతో
నాపైన నీ చూపు ఆపేలా…
శరణంటినే జనని
నాదవినోదిని భువనపాలినివే
అనాథరక్షణ నీ విధి కాదటే
మొర విని చేరవటే…
……….. ఇదీ ఆ లిరిక్… సరే, ఏ సినిమా నటి డాన్స్ చేయాలన్నా, అవి పిచ్చి గెంతులైనా సరే, హీరో పక్కన కుప్పి గంతులైనా సరే… కొంత ప్రాక్టీస్ అవసరం… కంపోజ్ చేసే మాస్టర్ చేసి చూపించాల్సిందే, వీళ్లు నేర్చుకోవాల్సిందే… మరి ఈ అరుదైన పాటకు, కాస్త శాస్త్రీయ నాట్యం టచ్ ఇస్తూ డాన్స్ ప్రాక్టీస్ ఎలా సాగింది..? ఈ వీడియో చూడండి…
సాయిపల్లవి అండ్ గ్రూప్ డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఇది… ఇప్పుడు ప్రతి హిట్ పాట డాన్స్ ప్రాక్టీస్ వీడియోలు రిలీజ్ చేయడం కూడా ట్రెండ్ కదా… చివరకు ఊ అంటావా, ఊఊ అంటావా ఐటం సాంగ్‌కు సమంత ఒంపుసొంపుల ఎగ్జిబిషన్, ఆ మసాలా ఊపులు ఎలా ప్రాక్టీస్ చేసిందో కూడా ఒక వీడియో వచ్చింది… అలాగే ఈ ప్రణవాలయ పాహి ప్రాక్టీస్ కూడా వీడియోగా వచ్చింది… బాగుంది… వైరల్ అయ్యింది…
నచ్చని విషయం ఏమిటంటే… యూట్యూబులో ఈ పాట వీడియో కింద మ్యూజిక్ కంపోజర్, లిరిక్ రైటర్ గట్రా అందరి పేర్లూ వున్నయ్… చివరకు ‘‘Keyboards – Mickey J Meyer…. Rhythms and Percussion – Arunachala…. Additional Rhythms – Venkatesh Patvari Recorded at Inspire Studios ( Hyderabad )…. Mixed by Mickey J Meyer at Quietbird Studios (USA)…. Audio Mastered by Darren Vermaas ( New York )….’’ ఇవీ రాసుకున్నారు… కానీ డాన్స్ మాస్టర్ పేరు లేదు… అన్యాయం… చివరకు వికీపీడియాలో కూడా ఆ వివరాల్లేవ్… హేమిటో మరి…!!
డాన్స్ మాస్టర్ మరీ అంత చీప్ అయిపోయిందా..? అసలే మగపెత్తనాలు ఎక్కువుండే సినిమా కొరియోగ్రఫీ రంగంలో శాస్త్రీయనృత్యం తెలిసిన, స్వయంగా నర్తన నేర్చిన సూపర్ డాన్స్ మాస్టర్‌కు, జాతీయ అవార్డు విజేతకు అసలు విలువే లేదా..? చివరకు క్రెడిట్స్ కూడా దక్కనివ్వరా..?! (OTT verison movie చివర్లో కూడా టైటిల్స్ వస్తుండగానే ఆగిపోయింది)… ఇక వెతగ్గా వెతగ్గా… కొరియోగ్రాఫర్ కృతి మహేశ్ అని ఎక్కడో, ఏదో సైటులో కనిపించింది… (పద్మావత్‌లో బాగా పాపులరైన ఘూమర్ సాంగ్ క్రెడిట్ ఈమెదే…) నీకు ప్రశంసాపూర్వక చప్పట్లు సోదరీ…!!
Share this Article