Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చదవాల్సిన ఓ నిజజీవిత కథ… చదివిన కొద్దీ వెంటాడే కథ… స్వరపుత్రుడు…

April 17, 2022 by M S R

నిజానికి నేను ఈ కథకు ఎంతమేరకు న్యాయం చేయగలనో తెలియదు… ఇది కల్పితం కాదు… నిజజీవిత కథ… సరిగ్గా రాస్తే ఓ సినిమా కథ… ఓ నవల… ఓ వెబ్ సీరీస్… life అంటే..? An Uncertain… Very Dynamic… Just, It Happens… We have to receive as it comes… అంతేనా..? అంతేనేమో… ఉత్తర కర్నాటక… అరేబియా సముద్రతీరం వెంబడి ఉడుపి జిల్లా… కుందపుర తాలూకాలోని బస్రూర్ అనే ఊరు… అదొక పూర్ ఫ్యామిలీ… మన కథానాయకుడి పేరు కిరణ్… సరిగ్గా ఫస్ట్, జనవరిన పుట్టాడు… 1984లో… ఇద్దరు అన్నలు, ఓ అక్క…

విశ్వబ్రాహ్మణ కుటుంబం… 

విశ్వబ్రాహ్మణులు… కమ్మరి పని మాత్రమే కాదు, యక్షగానాలు, భజనలు… ఓ చిన్న ఆర్కెస్ట్రా… ఆ పిల్లాడి చుట్టూ సంగీతస్వరాలే… అన్నిచోట్లా ఉండేవే… కుటుంబ తగాదాలతో కుటుంబం చీలిపోయింది… మామ దగ్గర ఆర్కెస్ట్రాలో పనిచేసే అన్నయ్య కొలువు ఊడిపోయింది… దాంతో కిరణే సొంతంగా ఓ చిన్న ఆర్కెస్ట్రా జమచేసుకుని, భక్తిగీతాల ప్రదర్శనలు ఇచ్చేవాడు… కుటుంబం గడవాలి కదా… కానీ సంగీతం తనలోకి మరింత ఇంకింది… 17 ఏళ్లకు ఊరు వదిలాడు… ఏదో సాధించాలి… కానీ ఏమిటది..? తనకే తెలియదు… 

Ads

200 రూపాయలతో స్టార్ట్…

జేబులో ఉన్నవి 200 రూపాయలు… నేరుగా బెంగుళూరు వెళ్లాడు… బిడదిలోని ఓ ఆర్ట్ అకాడమీలో చేరాడు… శిల్పాలు చెక్కే పని నేర్చాడు… శిలలే కాదు, దారు శిల్పాలు కూడా…! పగలంతా విగ్రహాలను చెక్కుతూ, రాత్రిళ్లు తనకు పరిచయమైన ఫిలిమ్ పర్సనాలిటీలను కలుస్తూ ఉండేవాడు… సినిమాలకు సంగీత దర్శకత్వం చేయాలనే కోరిక మెల్లిమెల్లిగా బలపడుతూ, వేళ్లూనుకుని పోయింది… పెరుగుతూనే ఉంది…

కీబోర్డు అమ్మేశాడు…

విగ్రహాలకు చెక్కే పనితో కడుపు నిండేది కానీ, మనసు నింపే సంగీతపు పని..? అప్పుడప్పుడూ అన్నలు కాస్త సొమ్ము పంపించేవాళ్లు… మొదట్లో ఓ భక్తిగీతాల ఆడియో చేశాడు… అప్పటికే మంచి పేరు సంపాదించిన ఉడుప అర్చనతో పాడించాడు… కానీ సీడీలు చేయించి, రిలీజ్ చేయడానికి పైసల్లేవు… ఏం చేయాలో అర్థంగాక కీబోర్డు అమ్మేశాడు… సీడీలు రిలీజయ్యాయి… తరువాత..? బ్లాంక్… ఉన్న కీ బోర్డు పోయింది, కళ్లెదుట శూన్యం…

విధి సొంతూరుకు తన్నింది… 

కథ మళ్లీ సొంతూరు చేరింది… ఒకరిద్దరి సాయంతో ప్రస్తుత స్థితిలో సంగీతానికి టెక్నాలజీ ఎంత అవసరమో తెలుసుకున్నాడు… అక్కడిక్కడా డబ్బు పోగేసి, ఓ చిన్న కంప్యూటర్ కొని, ఇంట్లోనే ఓ చిన్న స్టూడియో ఏర్పాటు చేసుకున్నాడు… ఓ సినిమాకు అవకాశం వచ్చింది… కానీ ఆ సినిమాయే స్టార్ట్ కాలేదు… అంత ఈజీయా జీవిత పయనం…?

ముంబై పిలిచింది… 

సినిమాలు అంటే ముంబై… నిద్రపోని నగరం… రకరకాల ప్రతిభలు అక్కడికి చేరుతూనే ఉంటయ్… పరీక్షకు నిలబడతయ్… మెదడు నిండా కోటి స్వరస్వప్నాలు నిండిన మన హీరో కూడా ముంబై చేరాడు… రాగానే అలుముకుని పూలదండ వేయదు కదా ముంబై,.. పగలంతా ఏ శిల్పాల పనో చేసేవాడు… రాత్రిళ్లు పబ్బులు, బార్ల వెంట పని కోసం తిరిగేవాడు… అక్కడ చేరితే అదే సినిమాలకు దారి చూపిస్తుందని ఓ నమ్మకం…

ఓ పబ్బు రారమ్మంది… 

ఏడాది గడిచింది… అనుకోకుండా అంథేరిలోని ఓ పబ్బు నుంచి చాన్స్ దొరికింది… ఆ పబ్బు ఓనర్ కూడా ఓ మంచి మ్యూజిషియన్ కోసం చూస్తున్నాడు… ఓ కామన్ ఫ్రెండ్ వాళ్ల ఊరికి చెందినవాడే ఆ ఓనర్… వెంటనే వచ్చి చేరిపో, నీ ఫుడ్, నీ వసతి, నీ జీతం మాట్లాడదాం, వచ్చెయ్ అన్నాడాయన… హమ్మయ్య, ఓ దారి దొరికింది అనుకున్న కిరణ్ అప్పటిదాకా తను పనిచేస్తున్న ఓనర్‌కు చెప్పాడు, కొలువు మానేస్తున్నాను అన్నాడు… విధి మరోసారి వికటంగా నవ్వింది… 

అనుకోని ట్విస్టు… 

బట్టలు సర్దుకుని, తన దగ్గరున్న సంగీత పరికరాల్ని సంచీలో పెట్టుకుని, ఓ లోకల్ ట్రెయిన్ కోసం వెయిట్ చేస్తున్నాడు… అదేరోజు ముంబైలో ఓ ట్రెయిన్ బాంబ్ పేలింది… చుట్టుపక్కల భయం, ఉద్రిక్తత, కలకలం… ట్రెయిన్లు రద్దు… మరి అంథేరికి వెళ్లడం ఎలా..? మళ్లీ పాత ఓనర్ దగ్గరకు వెళ్లాలని అనిపించలేదు… మైండ్ బ్లాంక్… ఎటు పోవాలి..? ఏం చేయాలి..? డబ్బుల్లేవు… అసలు సొంతూరికి వెళ్లాలంటే కూడా డబ్బుల్లేవు… నిస్త్రాణగా ఓ బెంచీ మీద ఒంటరిగా కూలబడ్డాడు…

పోలీస్ దాష్టికం… 

ఎలాగోలా ఊరికి వెళ్లిపోదాం అనుకుని, థానే రైల్వే స్టేషన్ వైపు బయల్దేరాడు… స్టేషన్ సమీపించేవేళ ఓ పోలీస్ ఆపాడు… చెక్ చేయాలన్నాడు… అక్కడికి కిరణ్ మొత్తుకుంటూనే ఉన్నాడు… రఫ్‌గా హ్యాండిల్ చేశాడు పోలీస్… పోలీస్ ఎక్కడైనా పోలీసే కదా… కీబోర్డు, తబలా విరిగిపోయాయి సదరు పోలీస్ చేతిలో… కిరణ్ కలల్లాగే… కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప చేసేదేముంది..?

అన్నా… వచ్చి తీసుకుపో… 

ఎలాగోలా ఊరికి తీసుకుపోయే ట్రెయిన్ పట్టుకున్నాడు… టికెట్టుకు డబ్బుల్లేవు… ఎవరైనా వచ్చి అడిగితే బుక్కయిపోతాడు… భయం… బాత్రూంలో దూరాడు, గడియ పెట్టుకున్నాడు… ఏడుస్తూనే ఉన్నాడు… కడుపులో ఆకలి… చుట్టూ వాసన… బస్రూర్ చేరాక కూడా ఎవరైనా చెక్ చేస్తారేమోనని భయపడి, అంతకుముందు జంక్షన్‌లోనే దిగిపోయి, అన్నకు ఫోన్ చేశాడు… అన్నా, వచ్చి నన్ను తీసుకుపో…

ఇక చాల్లేరా… అన్నీ వదిలెయ్… 

ఇక ఇవన్నీ అయ్యేపనులు కావు, అందరమూ చేసే పనే నువ్వూ చేసుకో… ఆ ప్రయత్నాలన్నీ వదిలెయ్ అన్నారు అందరూ… కానీ ప్యాషన్ అనేది స్థిమితంగా నిలవనివ్వదుగా… అది అల్లరి చేస్తూనే ఉంటుంది… కానీ మార్గమేది..? మనసు నెగెటివ్ ఆలోచనల వైపు మళ్లింది… ఆలోచన అదుపు తప్పింది… అప్పు 2 లక్షలు దాటిపోయింది… ఒత్తిడి పెరుగుతోంది… బ్యాంకులో తీసుకున్న కాస్త అప్పు కూడా పెరిగిపోయి, నోటీసులు వస్తున్నాయి… ఛ, ఇక లాభం లేదు, ఓ కిడ్నీ అమ్ముకుంటాను అని నిర్ణయం తీసుకున్నాడు… 

కిడ్నీ అమ్ముకోవాలని… 

ఊళ్లో కొత్తగా ఓపెనైన ఓ హాస్పిటల్‌కు వెళ్లాడు కిడ్నీ అమ్మితే ఎంత వస్తుందో కనుక్కోవడానికి… తరువాత హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది… తన మనస్సుకు సమాధానం చెప్పుకుని, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా హాస్పిటల్ వెళ్లాడు… ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లే సమయంలో ఎందుకో మనస్సు మొరాయించసాగింది… తను చేస్తున్నది తప్పు అని ఎవరో గట్టిగా చెవుల్లో అరుస్తున్న ఫీలింగ్… గుట్టుచప్పుడు గాకుండా అక్కడి నుంచి బయటపడ్డాడు… ఫేట్… డెస్టినీ…

ఓ టాయిలెట్‌లో జీవితం… 

let what may come, already Iam in a worse position, waiting for worst  అనే మెట్ట వేదాంతంలోకి జారిపోలేదు… మళ్లీ బెంగుళూరు వెళ్లాడు… అంతకుముందు తన రూమ్మేట్ సాయపడలేదు… చేతిలో డబ్బు లేదు, ఉండటానికి వసతీ లేదు… గోవిందరాజునగర్‌లోని ఓ పాడుబడిన పబ్లిక్ టాయిలెట్‌లో ఉండసాగాడు… ఏ గుళ్లలో ఎప్పుడు ఏం ప్రసాదం పెడతారో తెలుసుకుని, సరిగ్గా సమయానికి వెళ్లి చేతులు చాచేవాడు… నిర్వేదంగా… కనీసం దేవుడివైపు చూడకుండా… ‘‘నాలాంటోడి కోసం కాదు ఈ లోకం’’ అనే భావన పెరుగుతూనే ఉంది తనకు తెలియకుండానే…

దేవుడిలా ఓ ఫేస్ రీడర్…

గెలుపు అన్వేషణలో ఉన్నవాడికి ఓపిక అవసరం… దరిద్రం కూడా అదే నేర్పింది… ఓరోజు అవెన్యూ రోడ్‌లో కామత్ అనే ఓ అనుకోని ఫ్రెండ్ తనను ఓ ఫేస్ రీడర్ దగ్గరకు తీసుకెళ్లాడు… ఆయన చూశాడు, విస్మయంగా… ‘‘ఈయన్ని కలవాలంటే రేప్పొద్దున మనం ముందస్తు అపాయింట్‌మెంట్ తీసుకోవాలి, బంగారు భవిష్యత్తు’’ అన్నాడు… కిరణ్ విరక్తిగా నవ్వుకున్నాడు… ముందుగా కీ బోర్డు కొనడానికి డబ్బుల్లేవు స్వామీ అన్నాడు… ఆయన నిశ్శబ్దంగా తన సంచీ తెరిచి, 35 వేల రూపాయలు ఇచ్చాడు… అదొక టర్నింగ్ పాయింట్… రవి ఇంకా ఆ ఆశ్చర్యం నుంచి తేరుకోవడం లేదు… 

పేరు మారింది… 

పేరు మార్చుకున్నాడు… ఫేస్ రీడర్ పేరు రవిని తన పేరుగా మార్చుకున్నాడు… తన ఊరు బస్రూర్ తన ఇంటి పేరైంది… వెరసి రవి బస్రూర్… ఓ కొత్త జీవితం మొదలైనట్టే అనిపిస్తోంది… ఓరోజు తన రేడియో జాకీ దోస్త్ ద్వారా ఓ ఆఫర్ వచ్చింది… 92.7 బిగ్ ఎఫ్ఎం కోసం జింగిల్స్ చేయాలి… చేశాడు… ఇంప్రెస్డ్… 15 వేల జీతంతో ఆడియో ఎడిటర్ జాబ్ దొరికింది… వర్క్, వర్క్… ఏడాదిలో మూడు ఇంక్రిమెంట్లు… కన్నడ ఫిలిమ్ ఇండస్ట్రీకి ప్రోగ్రామర్‌గా చేయసాగాడు… పనిచేద్దాం, అది ఏ ఫలితమిస్తే అది స్వీకరిద్దాం… అదొక్కటే తను నమ్మిన అంతిమసూత్రం… అవకాశాలు వస్తున్నయ్…

ఉగ్రాం మూవీతో టర్నింగ్… 

ప్రశాంత్ నీల్‌తో పరిచయం… ఉగ్రాం మూవీకి సోలో చాన్స్… ఇక వెనక్కి తిరిగే చూసే పని రాలేదు… కీర్తి, డబ్బు, సర్కిల్… కేజీఎఫ్ తనను ఎక్కడికో తీసుకెళ్లింది… ఇప్పుడు చూశాం కదా కేజీఎఫ్-2 తో తనకు ఎంత ఖ్యాతి దక్కిందో… గాయకుడు, స్క్రిప్ట్ రైటర్, సంగీత దర్శకుడు, కీబోర్డ్ ప్లేయర్, లిరిక్ రైటర్, నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ రైటర్, ఎడిటర్… అన్నింటికీ మించి తను ఓ శిల్పి… అదీ రవి బస్రూర్ అంటే… 

కరోనా వేళ ఇంటికి వెళ్లి… 

ఆమధ్య కరోనా సంక్షోభం వేళ, అన్నీ కట్టిపెట్టాడు… సొంతూరు చేరుకున్నాడు… నాన్నకు సాయంగా అన్ని పనులూ చేసేవాడు… రోజుకు 35 రూపాయల సంపాదన… మెటల్ వర్క్, వుడ్ వర్క్… వాట్ నాట్..? అన్నీ చేశాడు… ‘‘దేవుడు కరుణామయుడు, రూట్స్ గుర్తుచేస్తున్నాడు..’’ అంటూ వీడియోలు షేర్ చేసుకున్నాడు… దటీజ్ రవి… రవి బస్రూర్…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
  • పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?
  • కథ ప్రజెంట్ చేసే దమ్ముండాలే గానీ… పనిమనిషి కూడా కథానాయికే…
  • పర్లేదు, వితండవీరులు కూడా చదవొచ్చు ఈ కథను… కథ కాదు, చరిత్రే…
  • ఒక పనిమనిషి మరణిస్తే ఇంత దయా..?! ఇప్పటికీ వెంటాడే ఆశ్చర్యం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions