ఎందుకు..? కంచంలో అన్నం పెట్టుకోగానే… మరణించిన సన్నిహితులు ఎందుకు గుర్తొస్తారు..? అన్నం మెతుకుల్లోనే ఎందుకలా కనిపిస్తారు..? ఒక్కసారిగా కన్నీళ్లు మత్తడి దూకుతాయి ఎందుకు..? ఎప్పుడైనా మీరు అనుభవించారా..? కలల్లో కనిపించడం వేరు… కన్నీళ్లపాలైన వేళ కలత నిద్రలో కళ్లు తుడుస్తారు నిజమే… కానీ కంచంలో అన్నమే పదే పదే యాది చేస్తుంది దేనికి..?
నిజానికి ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ మీద ఎవడికీ ఏ సదభిప్రాయమూ లేదు… అదొక దిక్కుమాలిన కామెడీ షో… అదీ తలకుమాసిన టేస్టు కలిగిన మల్లెమాల వాళ్ల ఎదవన్నర షో… కానీ వాళ్లదే ఒక తాజా ప్రోమోలో ఓ చిన్న డైలాగ్ ఒక్కసారిగా కదిలించింది… ఈమధ్య వెటరన్ ఆర్టిస్ట్ అన్నపూర్ణ అప్పుడప్పుడూ ఆ షోలో పార్టిసిపేట్ చేస్తోంది… వెరీ ప్రాక్టికల్… ఆమె రివర్స్ పంచులకు భయపడి ఎవడూ ఆమె మీద సెటైరిక్ పంచులు వేయరు…
కానీ ఈ తాజా ప్రోమోలో…. ఏదో చిన్న స్కిట్… తల్లీదండ్రులు దూరమైన ఓ చిన్నారి ఆక్రోశం ఆ స్కిట్ సారాంశం… దాని గురించి చెప్పుకోవడం లేదు మనం… సుడిగాలి సుధీర్ స్కిట్ ఎలా ఉందని అడుగుతాడు అన్నపూర్ణను… ఆమె మామూలుగానే మాట్లాడుతూ హఠాత్తుగా ఎమోషన్‌కు గురైంది… ‘‘నేను నా బిడ్డను కోల్పోయాను… మనం చాలాసార్లు అందరిముందూ దుఖపడలేం… అదెప్పుడో ఓ తెల్లవారుజామునో, ఓ అర్ధరాత్రిలో, కంచంలో అన్నం పెట్టుకున్నప్పుడు’’ అంటూనే కన్నీళ్లపాలైంది…
Ads
నిజం… శోకాలు పెట్టడం, పాత జ్ఞాపకాల్ని ఓ పాటలా, వలబోయడం ఒకప్పటి పద్ధతి… అలా ఏడవకపోతేనే ఫేక్ దుఖంగా సందేహించేవాళ్లు అప్పట్లో… అన్నపూర్ణ చెప్పినట్టు దుఖపడటం కూడా అందరి ముందూ చేయలేరు కొందరు… దుఖం ప్రదర్శన కాదు, అదొక నొప్పి… అసలు దుఖం అంతరంగంలో ఉప్పెనలా ఉన్నా సరే, బయటికి కనిపించదు కొందరిలో… ఎంత బాగా చెప్పావమ్మా….
ఒక్కసారిగా ఫ్లోర్ అంతా భారంగా మారిపోయింది… అందరి కళ్లు తడెక్కాయి… అంటే గుండెల్లో దాగిన తడి మత్తడి దూకింది… అది నటన కాదు… రియల్ ఎమోషన్… కదిలించేసింది… ఐతే ఎందుకు అన్నం తింటున్నప్పుడే దూరమైనవాళ్లు యాదికొస్తారు..? చెలియలికట్టకు గండికొడతారు..? పెద్ద ప్రశ్న… గొప్ప ప్రశ్న…
కొత్తదేమీ కాదు… అందరికీ అనుభవైకవేద్యమే… అన్నపూర్ణకు మాత్రమే తెలిసింది కాదు… కానీ ఎంత కామెడీ షో అయినా, ఎంతటి కమర్షియల్ ఎదవ కార్యక్రమమైనా సరే… ఎప్పుడోఓసారి, ఇదుగో, ఇలాంటి ఒక్క డైలాగ్ కలుక్కుమనిపిస్తుంది… ఇది ఎందుకు చెబుతున్నాను అంటే… రెండు రోజులుగా ఓ రీల్ వీడియో బాగా వైరల్ అవుతోంది… రీల్ అనే ఓ సోషల్ పిచ్చి తెలిసిందేగా… దానికి ఓ రీతిరివాజు ఏమీ ఉండదు… ఎవరో ఫన్ కోసం క్రియేట్ చేసి ఉంటారు…
మరణించిన భర్త ఫోటోకు దండేసి, దానికి ఎదురుగా ఫుల్ మేకప్పులో ‘‘వెన్నెలైనా చీకటైనా’’ అని పాడుతోంది… https://m.facebook.com/story.php?story_fbid=1020422571887468&id=100017592033139&sfnsn=wiwspwa …. కావచ్చు, ఇది ఫన్ కోసమే కావచ్చు… కానీ చూసేవాళ్లకు వెగటు… యాంటీ సెంటిమెంట్… దూరమైన వాళ్లను యాదికి తెచ్చుకోవడం, ఎప్పుడు యాదికొస్తారు అనేది పెద్ద ఎమోషనల్ సబ్జెక్టు… చివరికి అదీ వెకిలి సబ్జెక్టు అయిపోయింది ఈరోజు…
సరే, ఇదంతా రాస్తుంటే ఓ పాట గుర్తొచ్చింది… కుబుసం అనే సినిమాలో వందేమాతరం అద్భుతంగా పాడాడు… శ్రీహరి హీరో… నక్సలైట్ల సబ్జెక్టును టచ్ చేసిన సినిమా… ఇప్పుడు ట్యూన్లలోకి పిచ్చి పదాలు ఇరికించే తిక్క రచయిత గానీ, ఒకప్పుడు సుద్దాలలో ఓ మనసున్న కవి బతికి ఉండేవాడు… బహుశా తనే రాసి ఉంటాడు… ‘‘నింగికెగిసినారా… నేలతారలారా… వేగుచుక్కలై దారిచూపుతారా… ఏ తల్లి బిడ్డలో, భూతల్లి నుదుటిపై నీ గుండె నెత్తుటిపై బొట్టు పెట్టి పోతిరో’’ అని హృద్యంగా సాగుతుంది పాట…
అందులోనే ఓచోట… ‘‘నాగేటి సాళ్లలోన మొలకలవుతరా… తినేటి కంచంలో మెతుకులవుతరా…? సంక్రాంతి పండుగ వాకిట్లో ముగ్గులో నీ నవ్వు చూసుకుందుమే’’ అని గుండెను పిండేస్తుంది… మళ్లీ అదే ప్రశ్న… కంచంలో అన్నం ఒక్కసారిగా పాత యాదిలన్నీ మోసుకొచ్చి కంటినీటికి గండి కొడతాయెందుకు..? తిండికీ, దూరమైన గుండె గొంతుకకు… పేగునొప్పికీ లింకేమిటి..? కడుపులో దుఖం పొంగుకొస్తుంది దేనికని…?! బుక్క గొంతుకు అడ్డంపడి పొలమారుతుంది దేనికని..?
సినిమా అత్యద్భుతమైన కమ్యూనికేషన్… ఇప్పుడు టీవీ కూడా…! దాని ప్రభావం అంతా ఇంతా కాదు… కాకపోతే కమర్షియల్ నీచ మాఫియా వాటిని కూడా బ్రహ్మాండంగా భ్రష్టుపట్టించేసింది చాన్నాళ్లుగా… ఐనా సరే, చుక్కతెగి ఎప్పుడో రాలిపడ్డట్టుగా… ఇదుగో ఎప్పుడో ఓసారి… మనసును పెకిలించి, ఏడిపిస్తాయి కొన్ని పాటల పదాలు, కొన్ని మాటలు… చాలా అరుదుగా… అత్యంత అరుదుగా…!!
Share this Article