పాలస్తీనా నుంచి హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో భీకరంగా ఇజ్రాయిల్‌పై దాడి సాగిస్తున్నారు… వందల రాకెట్లు… వాటిని మధ్యలో అడ్డగించి పేల్చేస్తున్నది ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థ… ఆ వ్యవస్థ పేరు ఐరన్ డోమ్… అంటే తెలుగులో ఉక్కు ఛత్రం… ఆ రాకెట్ల వర్షం నుంచి కాపాడేది… నిజంగానే 90 శాతం సక్సెస్ రేటుతో కాపాడుతోంది… మరి మన పరిస్థితి ఏమిటి..? ఇటు చైనా అనే ఓ బడా బాహుబలి… ఇటు పాకిస్థాన్ అనబడే ఓ చోటా బాహుబలి… అణ్వస్త్రాలు సహా వేల క్షిపణులున్నయ్… అత్యంతాధునిక యుద్ధ విమానాలున్నయ్… గగనతలం నుంచి వచ్చిపడే ఆ ప్రమాదాల నుంచి మన రక్షణ ఏమిటి..? హమాస్ వంటి ఉగ్రసంస్థలెన్నో ఇండియా మీద కసికసిగా ఉన్నయ్… వాటి చేతుల్లో డర్టీ బాంబులు ఉంటే, వాటి చేతికీ క్షిపణులు చిక్కితే అదీ ప్రమాదమే మనకు…. అయితే మనకూ ఉన్నయ్ వేల క్షిపణులు, అణ్వస్త్రాలు… మనం చేయగల దాడి సంగతి తరువాత, ముందు డిఫెన్స్ కూడా ముఖ్యమే కదా… ఈ ఐరన్ డోమ్ మనకెందుకు లేదు..? ఇవీ ప్రశ్నలు… ఛలో కాస్త ఆ వివరాల్లోకి వెళ్దాం…
ఐరన్ డోమ్ అంటే… ఓ పెద్ద రాడార్, బోలెడన్ని స్వల్ప శ్రేణి క్షిపణులు… 2000 సంవత్సరం నుంచే డెవలప్ చేసుకుంది ఆ దేశం… ఒక్కటి 60 నుంచి 70 కిలోమీటర్ల మేరకు నిఘా వేయగలదు… ఆ పరిధిలో తమ వైపు దూసుకొచ్చే ఏ ఆబ్జెక్టయినా సరే…. డ్రోన్ కావచ్చు, క్షిపణి కావచ్చు, విమానం కావచ్చు… ఈ డోమ్ వదిలే తామిర్ క్షిపణులు వాటిని అడ్డగించేసి, పేల్చేస్తాయి… ఇజ్రాయిల్ చిన్న దేశం, దాని అవసరాలకు అది చాలు… కానీ మనకేమో కొన్ని వేల కిలోమీటర్ల సరిహద్దు… గుట్టలు, కొండలు, దుర్గమ ప్రాంతాలు… ఈ చిన్న చిన్న డిఫెన్స్ సిస్టమ్స్ మన అవసరాలకు ఏమాత్రం సరిపోదు… పైగా తామిర్ మిస్సయిల్స్ ఖరీదు ఎక్కువ… ఈ డోమ్ డెవలప్ చేసింది ఇజ్రాయిల్ డిఫెన్స్ కంట్రాక్టర్లుగా ఉన్న రాఫెల్…
Ads
ఇండియా అటు విదేశీ, ఇటు స్వదేశీ పరిజ్ఞానాలు, కొనుగోళ్ల మీద ఆధారపడుతోంది… మనకు పృథ్వి, ఏఏడీ, ఆకాశ్ మిస్సయిల్స్ ఉన్నయ్… మన అమ్ముల పొదిలో ఎప్పుడో చేరిపోయినయ్… వీటిలో పృథ్వి ఎక్కువ ఎత్తు నుంచి వచ్చే ఆబ్జెక్ట్స్‌ను టార్గెట్ చేస్తుంది… మీడియం రేంజ్ అయితే ఆకాశ్, స్వల్ప శ్రేణి అయితే ఏఏడీ… ఇవి దాడికీ ప్లస్ రక్షణకు ఉపయోగకరమే… ఇవి గాకుండా ఇదే ఇజ్రాయిల్ సహకారంతో బరాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం డెవలప్ చేసుకుంటున్నాం… ఇది మీడియం రేంజ్… మొన్న చైనావాడు మన లడఖ్ ఏరియాను ఆక్రమించడానికి వచ్చినప్పుడు ఇండియా అర్జెంటుగా బరాక్-8 మిస్సయిళ్లను సరిహద్దుల్లో మొహరించింది… అవి ఇజ్రాయిల్‌తో కలిసి డెవలప్ చేసుకున్నవే…
రష్యాలో ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టం ఉంది… 2018లోనే దాని కొనుగోలుకు ఒప్పందాలు కుదిరినయ్… అమెరికా కస్సుబుస్సుమన్నది కొన్నిరోజులపాటు… దాని స్వార్థం ఏమిటంటే… అచ్చం అలాంటిదే అమెరికన్ తయారీ National Advanced Surface to Air Missile-II (NASAMS-II) కొనాలని దాని ఒత్తిడి… కానీ మనం ఎస్-400 కొనుగోలుకే మొగ్గు చూపాం… దానికి బోలెడు కారణాలుంటయ్… ఈ సిస్టం 600 కిలోమీటర్ల పరిధి వరకూ నిఘా వేయగలదు… ఒకేసారి 80 టార్గెట్లను కొట్టగలదు… అమెరికా నుంచి కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టం కొనడానికి ఇండియా ఆసక్తి చూపిందని వార్తలొచ్చినయ్… ఏమైందో తెలియదు… అలాగే రాఫెల్ సహకారం కూడా తీసుకుంటున్నట్టు కొన్ని వార్తలు… రక్షణ రహస్యాలు కాబట్టి అంత త్వరగా బయటపడవ్… పడకూడదు కూడా… సో, హైలీ అడ్వాన్స్డ్ బరాక్-8, ఎస్-400, నాసామ్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఇక ఐరన్ డోమ్ మనకేల..?
ఇండియాకు ఉన్న చిక్కు ఏమిటంటే… పాకిస్థాన్ గానీ, చైనా గానీ భూతలం నుంచే కాదు… గగనం నుంచి, మన చుట్టూ ఉన్న సముద్రతలం నుంచి కూడా క్షిపణుల్ని ప్రయోగించగలదు… ఇన్ని వేల కిలోమీటర్లపై నిఘా వేయడం, రేప్పొద్దున అవసరమైనప్పుడు శత్రువు వదిలే క్షిపణుల్ని మధ్యలోనే ఛేదించడం అనేది చాలా పెద్ద టాస్క్… అందుకని దేశీయంగానే ఎక్కువ మిస్సయిళ్లను ఉత్పత్తి చేసుకోవడం మీద కాన్సంట్రేట్ చేస్తున్నాం… మరీ అవసరమైతే చైనా మొత్తం మన క్షిపణి పరిధిలోకి వచ్చే పృథ్వి ఆధునిక వేరియంట్ కూడా దాదాపు ఫైనల్ స్టేజీలో ఉంది… ఇదంతా సరే మరి చైనా, పాకిస్థాన్ ఎయిర్ డిఫెన్స్ మాటేమిటి..? వాటికీ వేల క్షిపణులున్నయ్… చైనా కూడా రష్యా నుంచి ఎస్-400 కొనాలని ప్రయత్నించింది… మధ్యలో ఏవో చిక్కులు వచ్చినయ్… చైనా తనే సొంతంగా రూపొందించుకున్నది… ఇక పాకిస్థాన్ అంటారా..? దానికి చైనా, ఉత్తర కొరియా ఉన్నాయి కదా…!!
Share this Article