మనం కేజీఎఫ్ సంగీత దర్శకుడు రవి బస్రూర్ సక్సెస్ స్టోరీ చెప్పుకున్నాం… ఫేట్, డెస్టినీ, టైం… పేరు ఏదైతేనేం, మనిషిని ఎటు తీసుకుపోతుందో ఎవరూ చెప్పలేరు… అదే రవి కథ… సేమ్, అదే కేజీఎఫ్-2 ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి టీన్స్‌లో ఉన్న ఓ పిల్లాడని చెప్పుకున్నాం… ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగించే కథ తనది… అసలు ఆ దర్శకుడు ప్రశాంత్ నీల్ తనే ఓ డిఫరెంట్ కేరక్టర్… కేజీఎఫ్ కథాచర్చలకు తరచూ యశ్ దగ్గరకు వెళ్లేవాడు…
పెగ్గేస్తే గానీ కలం కదలదు… గంటల తరబడీ కూర్చునేవాళ్లు… యశ్‌తో ఒక దర్శకుడు-ఒక హీరో అనే బంధం కాదు… ఇద్దరు స్నేహితులు వాళ్లు… తనకు సంబంధించిన డైలాగుల్లో అధికశాతం తనే రాసుకున్నాడు యశ్… ఓ పట్టాన కన్విన్స్ కాడు… ఓ రోజు హఠాత్తుగా యశ్ కారు డ్రైవర్ కమ్ బాడీ గార్డ్ రామచంద్రరాజును చూసి, మైండ్‌లో ఏదో స్ట్రయికైంది ప్రశాంత్‌కు… ‘‘ఈ సినిమాలో విలన్‌గా చేస్తావా’’ అనడిగాడు… ‘‘రఫ్ లుక్ కావాలి, కాస్త గడ్డం పెంచు ముందుగా…’’ అన్నాడు… ఇటు యశ్ షాక్… అటు రామ్ షాక్… ఆరోజుకు నవ్వి వదిలేశారు…
అసలు సినిమాల్లో కాదు, ఎప్పుడూ కెమెరా ముందు నటించిన అనుభవం లేదు రామచంద్రరాజుకు… 12 ఏళ్లుగా యశ్‌తో ఉంటున్నాడు… నిజానికి దర్శకుడు కావాలని సినిమాల్లో వచ్చాడు, కన్‌స్ట్రక్షన్ బిజినెస్ వదిలేసి మరీ యశ్ దగ్గర చేరాడు అంటారు గానీ… అదేమీ కాదు… ఆ కోరికలు ఉన్నవాడు యశ్ దగ్గర బాడీగార్డుగా, డ్రైవర్‌గా పుష్కరంపాటు కాలం ఎందుకు వృథా చేసుకుంటాడు..?
Ads
నిజంగానే గడ్డం పెంచడం స్టార్ట్ చేశాడు… రోజూ జిమ్‌కు వెళ్లి బాడీ బిల్డింగ్ కూడా స్టార్ట్ చేశాడు… యశ్ రోజూ చూస్తున్నాడు ఇదంతా… తను విలన్ పాత్ర చేస్తాననే నమ్మకం బలంగా ఏమీ లేదు రామ్‌కు… కానీ ఎక్కడో ఏ మూలో చిన్న ఆశ… నిజంగానే ప్రశాంత్ సార్ తన సినిమాలోకి తీసుకుంటే బాగుండు అని… అదే తనను దాదాపు ఏడెనిమిది నెలలపాటు మౌనంగా ఎదురుచూసేలా చేసింది… ఓరోజు ప్రశాంత్ యశ్‌ను అడిగాడు… నీ బాడీగార్డు ఇక నీకు ఉండడు, నీకు వోకేనా..? యశ్ నవ్వుతూ నీ ఇష్టం అన్నాడు… చాలా సింపుల్ గా…
కానీ కేజీఎఫ్‌లో యశ్ పాత్రకు దీటుగా అంతే బలమైన ఓ విలన్ అవసరం… తీరా చూస్తే రామ్‌కు అసలు నటనలో అనుభవమే లేదు… లుక్కు వరకూ వోకే… యశ్ ఆ డౌటే వెలిబుచ్చాడు… ‘‘అది నాకు వదిలెయ్’’ అన్నాడు ప్రశాంత్ తేలికగా… ఆడిషన్ జరిగింది… ప్రశాంత్ హేపీ… షూటింగు స్టార్టయింది… కట్ చేస్తే… ఒక్కసారిగా పాన్ ఇండియా ఆర్టిస్ట్ అయిపోయాడు గరుడ అలియాస్ రామ్… పలు కన్నడ, తెలుగు, తమిళ సినిమాల్లో కొత్తగా చాన్సులొచ్చాయి… తెలుగులో మహాసముద్రం సినిమా చేశాడు…
కేజీఎఫ్-2లో జస్ట్, ఓ అతిథి పాత్ర… అయితే ఇక్కడ మెచ్చుకోవల్సింది ప్రశాంత్ ఎంపిక గురించి కాదు… యశ్ తత్వం గురించి… తన డ్రైవర్ కమ్ బాడీగార్డును తన సినిమాలో తనకు ప్రధాన ప్రత్యర్థిగా పెట్టడాన్ని ఏమాత్రం నెగెటివ్‌గా తీసుకోలేదు… అహం లేకుండా ఆహ్వానించాడు… ఒక సహనటుడిగానే ట్రీట్ చేశాడు… రామచంద్రరాజు అలియాస్ గరుడ రామ్ కథ చెప్పే నీతి ఏమిటంటే… ‘‘రేపు ఏమిటో చెప్పలేం’’…!! అదృష్టం బాకీ ఉంటే ఎక్కడ అనామకంగా ఉన్నా సరే విజయహారం ఎగిరొచ్చి మెడలో పడుతుంది అని…!!
Share this Article