Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

header-new-unit-muchata.com
  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మబ్బుల్లో కారు గతుకుల రోడ్డుపైకి… కాషాయధ్వజం పైపైకి… అదే గ్రేటర్ తీర్పు…

December 4, 2020 by M S R

ఇది చార్మినార్ భాగ్యలక్ష్మి గుడి… ఈ అమ్మవారు ఎంత పవర్ ఫుల్ అంటే… మబ్బుల్లో విహరిస్తున్న కారును కిందకు లాగి, హైదరాబాద్ గతుకుల రోడ్డు మీద పడేసింది… ఎక్కడో నాలుగు దగ్గర కొట్టుమిట్టాడే బీజేపీని ఏకంగా నలభై ఐదు దాటించి, దాదాపు యాభై  అంకె దాకా తీసుకుపోయింది… తెలంగాణ రాజకీయ ముఖచిత్రం నుంచి కాంగ్రెస్ పార్టీని రెండు సీట్లతో పక్కకు నెట్టేసింది… అవునూ… గ్రేటర్ ఎన్నికల్లో చివరాఖరుకు ఏం జరిగింది..? నగర ప్రజలు ఏం తీర్పు చెప్పారు…? ఇప్పటివరకూ తెలిసిన ఫలితాలు, ట్రెండ్స్ ఏం చెబుతున్నాయి..? (రిజల్ట్ రోజు సాయంత్రానికి…)

https://muchata.com/wp-content/uploads/2020/12/WhatsApp-Video-2020-12-04-at-17.29.00.mp4

చూస్తూ ఉండండి, సెంచరీ కొడతాం అని గప్పాలు పలికిన టీఆర్ఎస్‌ పార్టీని నగర ప్రజలు నిర్దాక్షిణ్యంగా నేలకు దింపారు… నేను ప్రపంచంలోకెల్లా అతి పెద్ద హిందువును అని పదే పదే చాటిచెప్పుకుంటూ కేసీయార్‌ సందర్భానుసారం విసిరిన వాదనల్ని… యాంటీ- బీజేపీ పోరాటం షురూ చేసి, ఢిల్లీలో గత్తర లేపుతాను అన్న గంభీరమైన ప్రకటనల్ని… మా పరిపాలనకు తిరుగులేదు, మాకు ఎదురులేదు అని చేసుకున్న ఆర్భాపు ప్రచారాల్ని నగర ప్రజలు తిరస్కరించారు… ప్రత్యేకించి ఉద్యోగులు తమ వ్యతిరేకతను స్పష్టంగా వ్యక్తీకరించారు… మజ్లిస్‌తో టీఆర్ఎస్ దోస్తీని గ్రేటర్ ప్రజలు హర్షించలేదు, వ్యతిరేకించారు… ఇది గమనించి, మజ్లిస్‌తో మాకు పొత్తు లేదు బాబోయ్ అని టీఆర్ఎస్ ఎంత చెప్పుకున్నా సరే జనం విశ్వసించలేదు… అఫ్ కోర్స్, అందరికన్నా ఎక్కువ సీట్లు పేరుకు అంతిమంగా తనవే… ఎక్స్ అఫిషియో ఓట్ల పుణ్యం తో మేయర్ పీఠం కూడా తనదే కావొచ్చు గాక… కానీ ఆ గెలుపులో మజా లేదు… కాలర్ ఎగరేసే అతిశయం లేదు… పాత ప్రాభవం లేదు… కాంగ్రెస్ ను చంపీ చంపి బీజేపీని తెచ్చి పెట్టుకున్నాడు కెసిఆర్… వోడిపోయాడు… చివరకి సగం మార్క్ కూడా రానంత… అరవైకి… బీజేపీకి తనకీ ఓట్లు, సీట్లలో పెద్ద తేడా లేదు ఇప్పుడు…

బీజేపీ కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా పక్కకు నెట్టేసింది.., టీఆర్ఎస్‌ను ఎదురొడ్డి నిలబడటం మీకు చేతకాదు… తెలంగాణలో టీఆర్ఎస్ ప్లస్ మజ్లిస్, దానికి పోటీ అంటే బీజేపీ… అయితే నెంబర్ వన్, లేదంటే నంబర్ టూ… అదీ లెక్క… అంతే తప్ప ఈ లెఫ్టు, ఈ కాంగ్రెస్, ఇతరత్రా పార్టీలకు టీఆర్ఎస్ వ్యతిరేక పోరాటం చేతకాదని చాటిచెప్పింది… చాలా ఏళ్ల తరువాత హైదరాబాదులో హిందూ వోటును చాలా సంఘటితపర్చింది… దానికి అడ్డుపడిన టీఆర్ఎస్‌కు పాఠం చెప్పింది… అవకాశవాదంతో టీఆర్ఎస్‌కు, దాని దోస్త్ పార్టీ మజ్లిస్‌కు వంతపాడిన సోకాల్డ్ లెఫ్ట్ మేధావులను బీజేపీ వెక్కిరించినట్టయింది… రాబోయే రోజుల్లో గ్రేటర్‌లో బీజేపీ నిర్ణయాత్మక శక్తి అని నిరూపించుకుంది… ఇప్పటి బీజేపీ బండి పాత బీజేపీ కాదనీ, పార్టీలోని టీఆర్ఎస్ అనుకూల కాషాయాంబరధారుల ఆటలకు అడ్డుకట్ట పడినట్టేనని ఈ కొత్త కాషాయచిత్రం తెలియజేస్తోంది… తెలంగాణ రాజకీయాల్లో చోటుచేసుకోబోయే మార్పులకు ఇది నాందీప్రస్తావన కావొచ్చు కూడా…

ముస్లింల సంఖ్య అధికంగా ఉన్న డివిజన్లలో మజ్లిస్ అలవోకగా విజయకేతనాలు ఎగురవేసింది… ముస్లింల సంఘటిత వోటు విలువ ఏమిటో, ప్రభావం ఏమిటో మరోసారి చాటిచెప్పింది మజ్లిస్… ఈ టీఆర్ఎస్ అవసరం మాకేమీ లేదు, మా అవసరమే వాళ్లకు ఉందేమో అన్నట్టుగా మాట్లాడి… మా బలం మాకే సొంతం అని మరోసారి స్పష్టం చేసింది… గత 44 సీట్లకు కాస్త అటూ ఇటూ… ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో వోటింగు ఎలా ఉంటుందో, హిందూ ప్రాంతాల్లో అది ఎలా చీలిపోయి, చతికిలపడుతుందో మజ్లిస్ ఫలితాలు తెలియచేస్తున్నాయి… ఇదే మొన్న బీహార్‌లో కనిపించింది, రేపు బెంగాల్‌లోనూ కనిపించనుంది…

కాంగ్రెస్ దురవస్థ, పతనం ఇంకా కొనసాగుతాయనీ… ఈ ప్రభుత్వ వ్యతిరేకతను కూడా సొమ్ము చేసుకునే స్థితిలో పార్టీ లేదనీ…. అసలు పార్టీని ఓ దశ, దిశ లేకుండా పోయాయని ప్రజలకు చెప్పినట్టయింది… అక్కడక్కడా సాధించిన వోట్లు, సీట్లు ఆయా అభ్యర్థుల వ్యక్తిగత విజయాలే తప్ప పార్టీ చెప్పుకోవడానికి ఏమీలేదు… అనేకానేక వరుస ఓటములకు బాధ్యత వహించాల్సిన పీసీసీ అధ్యక్షుడిని ఎన్నేళ్లయినా మార్చుకోలేని దౌర్భాగ్యం ఆ పార్టీది… అది గ్రేటర్‌ ఎన్నికల్లో ఇంతకుమించి పెద్దగా సాధించే సీన్ కూడా ఏమీ లేదు… ఆ పార్టీ తరఫున మంచికి ఎవరూ ఓనర్ కాదు, చెడుకు ఎవరూ జిమ్మేదారి కారు… ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ గ్రేటర్‌లో ఉందీ అంటే ఉన్నట్టుగా ఉండిపోయింది… అంతే…

మిగతా ఏ పార్టీ గురించీ చెప్పడానికి ఏమీ లేదు… అవి నామ్‌కేవాస్తే పార్టీలు… పత్రికల్లో, టీవీల్లో కనిపిస్తుంటాయి… ఉపన్యాసాలు దంచుతుంటాయి… బొచ్చెడు నీతులు చెబుతుంటాయి… జనం చదివి, విని, చూసి నవ్వి వదిలేస్తుంటారు… మేయర్ పీఠం టీఆర్ఎస్‌దే కావచ్చు… కానీ అది నైతికంగా దెబ్బతిన్నట్టయింది… గత 99 స్థానాల నుంచి అనూహ్యంగా బోలెడంత కిందకు జారిపోయింది… ఆమేరకు బీజేపీ ఎగబాకింది… కాదు, నిజానికి ఇప్పుడే ఎగబాకడం స్టార్ట్ చేసింది… మొన్న దెబ్బాక… ఇప్పుడు గ్రేటర్… రేపు..?!! ఐనా టీఆర్ఎస్‌లో ఆత్మవిమర్శ ఉంటుందంటారా..? నెవ్వర్… ఆ అలవాటే లేదు… ఆశించకండి…! ఒక ఫక్తు రాజకీయ పార్టీని ప్రజలు తమ తీటకు తామే భరిస్తారు… ఎప్పటిదాకా..? సమర్థ ప్రత్యామ్నాయం కనిపించేదాకా…!!

చివరగా :: చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారు పవర్ ఫుల్… గతంలో తెలంగాణలో మతం, కులం పెద్దగా రాజకీయ ప్రభావం చూపించేవి కావు… ఇప్పుడు మతం కూడా తెలంగాణ రాజకీయాలను శాసించబోతోంది… కాలం విచిత్రమైంది…!

Follow Us


Share this Article


Search On Site

Advertisement

Latest Articles

  • టార్గెట్ అంబానీ…! కేవలం మనీ కోసమేనా..? అంతటి మొసాద్‌కూ చిక్కని క్లూ..!!
  • కాక పెరుగుతోంది..! కానీ ఎవరు గెలిస్తే ఎవరికేం ఫాయిదా..?!
  • మట్టి మోసం చేయదు… ఉప్పెనలో తేలిపోయిన ఊక, ఉప్పు… అసలు కథ ఇదీ…
  • పాకిస్థాన్‌కు మోడీ రహస్య సందేశం… ఒకేమాట… అంతే, అభినందన్ వచ్చేశాడు…
  • నో డౌట్… పాట బంపర్ హిట్…! కానీ సుద్దాల ఎక్కడ ఎత్తుకొచ్చాడు దీన్ని..?!
  • కంగనా రనౌత్, ఆలియా భట్, దీపిక పడుకోన్… ఈ పాత్రకెవరు సూటబుల్..?
  • పోనీ… ప్రతి చందాకూ ఐటీ వారి ధ్రువపత్రం జతచేయాలా కామ్రేడ్..?!
  • మరీ ఎక్కువ చదివావోయ్… నువ్వు ఈ కొలువుకు పనికిరావు… గెటౌట్…
  • ప్రేమ ఖతం..! ప్రియుడి హత్యకు ప్రియురాలి సుపారీ… ప్లస్ ఒక పూట..?
  • ఇప్పుడిలా సాగిలబడ్డాయి గానీ… ఒకప్పుడు పొలిటికల్ కార్టూన్ అంటే…?!

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now